Unpaid Traffic Challans : ట్రాఫిక్ చలాన్లు కట్టకపోతే ఇక కరెంట్ కట్? సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
Unpaid Traffic Challans : ట్రాఫిక్ చలాన్లు కట్టకుండా ఎగ్గొడితే కరెంట్ బిల్లుతో లింక్ చేసి వసూలు చేయొచ్చంటూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పెండింగ్ చలాన్లు వసూలు చేయాలంటే ఇలాంటి చర్యలు తీసుకోవచ్చునని సూచించింది.
- Sreehari A
- Updated on- September 28, 2026 / 06:34 PM IST
Unpaid Traffic Fines
- పెండింగ్ చలాన్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- ట్రాఫిక్ చలాన్లు కట్టని వారి కరెంట్ బిల్లుకు జోడించాలని సూచన
- కరెంట్ బిల్లులు కచ్చితంగా కడతారు.. లేకపోతే పవర్ కట్
- అలాంటి ప్లాన్ చేయాలని సూచించిన సుప్రీంకోర్టు
Unpaid Traffic Challans : వాహనదారులకు బిగ్ అలర్ట్.. మీ వాహనంపై పెండింగ్ చలాన్లు ఉన్నాయా? జర జాగ్రత్త.. ఇకపై ట్రాఫిక్ చలాన్లు కట్టకుండా ఎగ్గొట్టినవారికి పవర్ కట్ కానుంది. అంతేకాదు.. వాహన రిజిస్ట్రేషన్ చేయించుకోలేరు.. కనీసం వాహన ఫిట్‌నెస్ సర్టిఫికేట్ కూడా జారీ చేయరు..
అలాగే డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేస్తారు.. ఎప్పుడైతే పెండింగ్ చలాన్లను క్లియర్ చేస్తారో ఆ తర్వాతే అన్ని సర్వీసులు మళ్లీ అందుబాటులోకి వస్తాయి.. చాలామంది వాహనదారులు నిర్లక్ష్యంగా ట్రాఫిక్ చలాన్లు కట్టకుండా వదిలేస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి ఇ-చలాన్లు కోట్లలో పెండింగ్ లో ఉన్నాయని సుప్రీం కోర్టు పేర్కొంది. చెల్లించని ట్రాఫిక్ చలాన్‌లను వసూలు చేయడానికి అధికారులు క్షేత్రస్థాయిలో పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది.
పవర్ బిల్లులతో చలాన్లు కలపాలి :
కేవలం ఈ-చలాన్లు జారీ చేస్తే సరిపోదని, వాటిని నిర్దేశిత సమయంలోగా చెల్లించకపోతే చర్యలు కూడా చేపట్టాల్సిన అవసరం ఉందని కోర్టు సూచించింది. ఒక విచారణ సందర్భంగా జస్టిస్ జె.బి. పర్దివాలా మాట్లాడుతూ.. ప్రజలు ట్రాఫిక్ చలాన్‌లు చెల్లించకపోతే విద్యుత్ బిల్లులతో సహా ఇతర ప్రభుత్వ బకాయిలతో ఆ మొత్తాన్ని జోడించి వసూలు చేసే మార్గాలను అధికారులు అన్వేషించవచ్చని పేర్కొన్నారు.
కరెంట్ బిల్లులు అయితే కచ్చితంగా కడతారు.. ఒకవేళ బిల్లు చెల్లించకపోతే పవర్ కట్ చేయొచ్చునని అన్నారు. అప్పుడే పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల సమస్యను కూడా పరిష్కరించే అవకాశం ఉంటుందని అన్నారు.
Read Also : CM Mohan Yadav : సీఎం ఇంటిని కూల్చివేసిన అధికారులు.. అసలేం జరిగిందంటే?
రూ.20వేల కోట్లు చలాన్లు పెండింగ్ :
దేశంలో పెండింగ్ చలాన్ల సమస్యకు ఏదో ఒక మార్గం కనుక్కోవాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినట్లు బార్ అండ్ బెంచ్ నివేదించింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సుమారు రూ. 45వేల కోట్ల ఈ-చలాన్ బకాయిలు ఉన్నాయని, అందులో ఇప్పటివరకు దాదాపు రూ. 25వేల కోట్లు మాత్రమే వసూలు చేశారని కోర్టుకు తెలిపారు. మిగిలిన రూ. 20వేల కోట్ల రికవరీపై సుప్రీం ఈ కీలక సూచనలు చేసింది. క్షేత్రస్థాయి వాస్తవాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని జస్టిస్ పర్దివాలా అన్నారు.
పోలీసులు వేల, లక్షల ఈ-చలాన్లు జారీ చేయవచ్చని, కానీ వాటి ద్వారా విధించిన జరిమానాలను వసూలు చేయడమే అసలైన సమస్యగా ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సైతం ఇలాంటి చర్యలే చేపట్టాలని కోర్టు సూచనలు చేసింది.
సుప్రీంకోర్టు సూచించిన చర్యలివే :
పెండింగ్‌లో చలాన్‌లు ఉన్న వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ల రెన్యువల్ నిలిపివేయొచ్చు.. తద్వరా డూప్లికేట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ల జారీని నిలిపివేయొచ్చు.. అలాగే ఆ వాహనాల యాజమాన్య బదిలీని కూడా నిరోధించవచ్చని కోర్టు తెలిపింది.
చలాన్‌లు క్లియర్ అయ్యే వరకు వాహన ఫిట్‌నెస్ సర్టిఫికేట్ జారీ చేయకూడదని కోర్టు పేర్కొంది. ఇలాంటి వాహనాలను పరివాహన్ పోర్టల్‌లో బ్లాక్‌లిస్ట్ చేయాలని సూచించింది. అలాగే డ్రైవింగ్ లైసెన్సుల రెన్యువల్ కూడా నిలిపివేయాలని సూచించింది.
డ్రైవింగ్ లైసెన్సులను నిలిపివేయొచ్చు. చెల్లించని చలాన్లు ఉన్న వాహనాలకు పీయూసీ సర్టిఫికెట్లు జారీ ఆపేయడం వంటి చర్యలను సూచించింది. వాహనాలను తప్పక తనిఖీ చేయాలని, వాహనానికి ఈ-చలాన్ చెల్లించకపోతే అవసరమైతే అధికారులు స్వాధీనం చేసుకోవచ్చని కూడా కోర్టు పేర్కొంది. అదే సమయంలో, చెల్లించని ట్రాఫిక్ చలాన్‌లను విద్యుత్ బిల్లులకు జోడించాలనే ఆలోచన విచారణ సమయంలో కేవలం ఒక సూచన మాత్రమేనని, అమలుకు ఆదేశం కాదని కోర్టు స్పష్టం చేసింది.
