Tihar Jail Food : జైల్లో భోజనం తినలేకపోతున్నా.. పాస్తా, ఆలివ్ ఆయిల్ కావాలి.. కోర్టును కోరిన అమెరికన్ ఖైదీ..
Tihar Jail Food : తిహార్ జైలులో అందిస్తున్న కారం, నూనె ఎక్కువగా ఉండే ఆహారం తినలేక 14 కిలోలు బరువు తగ్గానని అమెరికన్ నిందితుడు మాథ్యూ వాన్‌డైక్ కోర్టును ఆశ్రయించాడు. పాస్తా, ఆలివ్ ఆయిల్‌తో తానే వంట చేసుకునేందుకు అనుమతి కోరాడు.
- Harish Thanniru
- Updated on- July 10, 2026 / 12:17 PM IST
US Mercenary Matthew VanDyke
Tihar Jail Food : ఉగ్రవాద కుట్ర కేసులో అరెస్ట్అయ్యి ఢిల్లీలోని తిహార్ జైలులో ఉన్న అమెరికా పౌరుడు మాథ్యూ ఆరోస్ వాస్‌డైక్ జైలు భోజనంపై కోర్టును ఆశ్రయించాడు. తిహార్ జైలులో అందిస్తున్న ఆహారం నేను తినలేక పోతున్నా.. కారం, నూనె ఎక్కువగా, డీప్ ఫ్రై చేసిన జిడ్డు పదార్థాలతో ఉంటోందని పేర్కొంటూ.. తానే స్వయంగా వంట చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఢిల్లీ ప్రత్యేక ఎన్ఐఏ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.
పిటిషన్ లో వాన్‌డైక్ తెలిపిన వివరాల ప్రకారం.. జైలులోని ఆహారాన్ని తినలేక పోతున్నా. 50రోజులుగా ఇదే పరిస్థితి. ఆ సమయంలో ప్రధానంగా సోయా పాలు వంటి ద్రవ ఆహారంపైనే ఆధారపడుతున్నట్లు పేర్కొన్నాడు. దీంతో గత మూడు నెలల్లో సుమారు 14కిలోలు బరువు తగ్గినట్లు కోర్టుకు తెలిపాడు. అంతేకాదు.. పోషకాహారలోపం కారణంగా ఆరోగ్యం క్షీణించిందని, రోగనిరోధక శక్తి కూడా తగ్గిపోయిందని తెలిపాడు.
తన కుటుంబ సభ్యులు జైలుకు ఇండక్షన్ స్టవ్, వంట పాత్రలు తీసుకురావడానికి అనుమతి ఇవ్వాలని వాన్‌డైక్ కోర్టును కోరాడు.. అంతేకాదు.. పాస్తా, ఆలివ్ఆయిల్, బియ్యం, పప్పులు, బ్రెడ్, వెన్న, చికెన్, చేపలు, సోయా పాలు వంటి ఆహార పదార్థాలు కూడా అందించేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును అభ్యర్థించాడు.
మాథ్యూ వాన్‌డైక్‌ను ఈ ఏడాది మార్చిలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్టు చేసింది. భారత్, మయన్మార్‌లోని సాయుధ ఉగ్రవాద సంస్థలకు సహకరించడం, డ్రోన్ శిక్షణ ఇవ్వడం, ఉగ్రవాద కుట్రలో పాల్గొన్నారనే ఆరోపణలతో ఆయనతో పాటు మరికొందరిపై కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆయన న్యాయపరమైన కస్టడీలో తిహార్ జైలులో ఉన్నాడు. వాన్‌డైక్ పిటిషన్ తిహార్ జైలు అధికారులు తమ సమాధానం దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను జులై 21కు వాయిదా వేసింది.
