Uttarakhand : కన్నీరు పెట్టుకున్న మహిళా మంత్రి.. భర్తపై కేసు.. కొద్ది గంటలకే అనారోగ్యంతో ఆస్పత్రికి

Uttarakhand Women Minister Rekha arya : ఉత్తరాఖండ్ రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి రేఖా ఆర్య తన భర్త గిర్ధారీ లాల్ సాహుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తరువాత ఆమె కన్నీరు పెట్టుకుంటూ వీడియో విడుదల చేశారు.

Uttarakhand Women Minister Rekha arya

Uttarakhand Women Minister Rekha arya : ఉత్తరాఖండ్ రాజకీయాల్లో కలకలం చోటు చేసుకుంది. మహిళా భద్రతపై భరోసా కల్పించాల్సిన ఓ మహిళా మంత్రి కన్నీరు పెట్టుకున్న ఘటన చోటు చేసుకుంది. తన భర్త నుంచే ప్రాణహాని ఉదంటూ ఆమె బోరున విలపించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంతకుముందే భర్తపై పోలీసుకు ఫిర్యాదు చేసింది. అయితే, ఈ వీడియో పోస్టు చేసిన కొద్ది గంటలకే ఆమె ఆస్పత్రిలో చేరడం కలకలం రేపుతోంది.

Also Read : Petrol Price : ప్రపంచంలోనే అత్యంత చౌకగా పెట్రోల్ లభించే దేశాలివే ఇవే.. అక్కడ చాక్లెట్ కంటే చీపు!

ఉత్తరాఖండ్ రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి రేఖా ఆర్య తన భర్త గిర్ధారీ లాల్ సాహుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై దాడి చేయడం, వేధింపులకు పాల్పడటం, కులం పేరుతో అవమానించడం, ప్రాణాలు తీసేందుకు కుట్ర పన్నడం వంటి తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ ఘటనపై డెహ్రాడూన్‌లోని గఢీ కాంట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఫిర్యాదు చేసిన అనంతరం ఆమె కన్నీటిపర్యంతమవుతూ సోషల్ మీడియాలో వీడియోను విడుదల చేసింది.

రేఖా ఆర్య తన భర్తకు సంబంధించిన రెండు ఆడియో క్లిప్‌లను కూడా సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. వాటిలో ఒక మహిళతో మాట్లాడుతున్న సమయంలో తనను చంపేందుకు కుట్రకు సంబంధించిన సంభాషణ ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు.

2004 జూలై 6న ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో గిర్ధారీ లాల్ సాహుతో తనకు వివాహం జరిగిందని రేఖా ఆర్య తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వివాహ సమయంలో తన భర్తకు అంతకుముందు పెళ్లి కాలేదని చెప్పారని, ఆ తర్వాత ఆయనకు గతంలోనే వివాహమై పిల్లలు కూడా ఉన్నట్లు తెలిసిందని పేర్కొంది. అంతేకాకుండా, ఇతర మహిళలతో సంబంధాల విషయమై తాను అభ్యంతరం చెప్పినప్పుడు తనపై దాడి చేశారని, బెదిరింపులకు పాల్పడ్డారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.

తన సంతకాలను ఫోర్జరీ చేసి కొన్ని సంస్థల్లో డైరెక్టర్ పదవి నుంచి తొలగించినట్లు నకిలీ పత్రాలు సృష్టించారని కూడా రేఖా ఆరోపించారు. తన భర్తకు సంబంధించిన ఆడియో వినడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యానని రేఖా ఆర్య వీడియోలో తెలిపారు. తన పిల్లల భద్రతను దృష్టిలో పెట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని చెప్పారు.

“మహిళ సామాన్యురాలైనా, ప్రముఖురాలైనా గృహ హింసను భరించకూడదు. దానిపై గళం విప్పాలి” అని ఆమె పేర్కొన్నారు. తన వ్యక్తిగత జీవితంలో ఇంతటి బాధ ఎదురైనా రాజ్యాంగాన్ని సాక్షిగా చేసుకుని తన విధులను కొనసాగిస్తానని తెలిపారు.

ఇదిలా ఉంటే.. భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం రేఖా ఆర్య అస్వస్థతకు గురయ్యారు. ఛాతిలో నొప్పి, రక్తపోటు పెరగడంతో డెహ్రాడూన్‌లోని కృష్ణ మెడికల్ సెంటర్‌లో ఆమెను చేర్చినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని ఆమె వర్గీయులు తెలిపారు.

ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ.. బీజేపీ ప్రభుత్వానికి ఇది తీవ్ర అవమానం అంటూ వ్యాఖ్యానించింది. ఒక రాష్ట్ర మంత్రి స్వయంగా తన భర్త నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉందని చెబుతూ.. ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. అది ప్రభుత్వానికి సిగ్గుచేట్టు అంటూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి గరిమా మెహ్రా దసౌని అన్నారు.