Abhijeet Dipke: అరెస్టుకు ముందే అభిజీత్ దిప్కే వీడియో.. ఉద్యమానికి కొత్త నాయకుడి ప్రకటన.. వీడియోలో సంచలన కామెంట్స్
పోలీసులు తనను అరెస్టు చేసిన వెంటనే అభిజీత్ దిప్కే(Abhijeet Dipke) రూపొందించిన ఒక ప్రీ-రికార్డెడ్ వీడియో సోషల్ మీడియాలో బయటకు వచ్చింది.
- V Santhosh Kumar
- Published on- October 10, 2026 / 02:50 PM IST
Video of the incident recorded by Abhijeet Deepke has gone viral.
Abhijeet Dipke: దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) అధినేత అభిజీత్ దిప్కే(Abhijeet Dipke)తో పాటు కీలక నేతలను పోలీసులు నాటకీయ పరిణామాల మధ్య అదుపులోకి తీసుకున్నారు. ముంబై నుంచి ఢిల్లీ చేరుకున్న అభిజీత్‌ను విమానాశ్రయంలో రన్ వేపైనే, విమానం లోపల నుంచే ఐజీఐ ఎయిర్‌పోర్ట్ పోలీసులు అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది. ఈ క్రమంలో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోగా, ఆయనతో పాటు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌లను కస్టడీలోకి తీసుకున్నారు.
వీడియో సందేశం విడదల.. కొత్త నాయకుడిగా అజింక్యా షిండే:
పోలీసులు తనను అరెస్టు చేసిన వెంటనే అభిజీత్ దిప్కే రూపొందించిన ఒక ప్రీ-రికార్డెడ్ వీడియో సోషల్ మీడియాలో బయటకు వచ్చింది. “మీరు ఈ వీడియో చూస్తున్నారంటే నన్ను, నా సహచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లే.. ఇకపై ఈ ఉద్యమానికి అజింక్యా షిండే నాయకత్వం వహిస్తారు” అని ఆయన స్పష్టం చేశారు. దేశంలో ప్రస్తుత పరిస్థితి అత్యవసర పరిస్థితి కంటే ఘోరంగా ఉందంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన దిప్కే, ఎంతమందిని అరెస్టు చేసినా తమ పోరాటం ఆగేది లేదని తేల్చి చెప్పారు.
ఈసీఐకి వ్యతిరేకంగా నిరసనలు.. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీనామాకు డిమాండ్:
ఈ అరెస్టులను ఖండిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన సీజేపీ, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలనే డిమాండ్‌పై వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేసింది. నేతల అరెస్టులతో సంబంధం లేకుండా దేశవ్యాప్త ఆందోళనలు కొనసాగుతాయని, గాంధీ, అంబేడ్కర్ ఆశయాల సాధనకు యువత, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఉద్యమించాలని పార్టీ పిలుపునిచ్చింది.
