ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమిపై గౌతం గంభీర్ స్పందించాడు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అరవింద్ కేజ్రవాల్ నేతృత్వంలోని ఆప్.. ఘోరంగా ఓడించింది. ఓట్లు రాబట్టుకునేందుకు బీజేపీ తన బెస్ట్ ఇచ్చింది. కానీ, ప్రజలు దేశ రాజధాని విషయంలో కన్విన్స్ అవలేదని గంభీర్ అన్నాడు.
‘ఢిల్లీ ఎన్నికల ఫలితాలను మేం ఒప్పుకుంటున్నాం. అరవింద్ కేజ్రీవాల్‌ను, ఢిల్లీ ప్రజలను అభినందిస్తున్నాం. మా బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నించాం. రాష్ట్ర ప్రజలను కన్విన్స్ చేయలేకపోయాం. అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలో ఢిల్లీ బాగుపడుతుందని ఆశిస్తున్నా’ మాజీ క్రికెటర్, ఎంపీ గౌతం గంభీర్ అన్నాడు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మంగళవారం(ఫిబ్రవరి 11,2020) వెలువడ్డాయి. మొత్తం 70 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఆప్ 50కి పైగా స్థానాల్లో గెలుపొందింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మ్యాజిక్ ఫిగర్ 35. ఇక బీజేపీ విషయానికి వస్తే.. గతంతో పోలిస్తే మెరుగైన ఫలితాలు సాధించింది. అధికారం కోసం తీవ్రంగా ప్రయత్నించినా ఓటర్ల మనసులు గెల్చుకోలేకపోయారు.
ఢిల్లీ ప్రజల గుండెల్లో క్రేజీ.. కేజ్రీవాలేనని తేల్చేశాయి ఫలితాలు. కేంద్ర పెద్దలు సహా వెయ్యి మందికి పైగా సైన్యం మోహరించినా.. సింహం సింగిల్‌గా పోరాటం చేసిందని కేజ్రీవాల్‌ను ఆకాశానికెత్తేస్తున్నారు ప్రజలు. అయితే కేజ్రీ గెలుపు గాలివాటమో మరొకటో కాదు. రెండుసార్లు అధికారంలో ఉన్న పార్టీకి మూడోసారి కూడా ప్రజలు పట్టం కట్టారంటే కేజ్రీవాల్ ఎంత కష్టపడి ఉంటారో అర్థం చేసుకోవచ్చు.
ఆమ్ ఆద్మీ పార్టీ ఆవిర్భావం నుంచి కేజ్రీవాల్ స్పష్టమైన లక్ష్యంతో ప్రజల దగ్గరకు వెళ్లారు. ఢిల్లీ సమస్యలపై పూర్తి అవగాహన పెంచుకున్నారు. వాటన్నింటినీ తీర్చేందుకు కావాల్సిన అంశాలు, వనరులపై మేధావులతో చర్చించారు. మేనిఫెస్టో రూపకల్పన సైతం 2015లో డివిజన్ల వారీగా, రాష్ట్రం మొత్తానికి అవసరమైన విధానాలను పొందుపరిచి ప్రజల ముందుకెళ్లారు. దీంతో 70 స్థానాలకు 67 స్థానాలను క్లీన్ స్వీప్ చేశారు కేజ్రీవాల్. ఈసారి కూడా అలాంటి వ్యూహాన్నే అనుసరించారు.