AI Impact Summit 2026: ఏఐ సమ్మిట్ లో అనూహ్య ఘటన.. చొక్కాలు విప్పి నిరసన
ప్రధాని మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారి ఆందోళనతో సదస్సులో కాసేపు గందరగోళం నెలకొంది.
AI Impact Summit Representative Image (Image Credit To Original Source)
- ఇండియా ఏఐ సమ్మిట్ లో కలకలం
- చొక్కాలు విప్పి యూత్ కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
- ఇండియా-యూఎస్ ట్రేడ్ డీల్ పై ఆగ్రహం
AI Impact Summit 2026: ఢిల్లీలోని భారత్ మండపంలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. వరల్డ్ డిజిటల్ దిగ్గజాలు ఈ సమ్మిట్ కు తరలి వచ్చారు. ఏఐ సమ్మిట్ తో యావత్ ప్రపంచం దృష్టిని భారత్ అట్రాక్ట్ చేసింది. ఇదిలా ఉండగా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో ఎవరూ ఊహించని విధంగా అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా కలకలం రేగింది. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు హల్ చల్ చేశారు.
సమ్మిట్ జరుగుతున్న సమయంలో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు సడెన్ గా చొక్కాలు విప్పేశారు. ట్రేడ్ డీల్ ను వ్యతిరేకిస్తూ యూత్ కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. ప్రధాని మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారి ఆందోళనతో సదస్సులో కాసేపు గందరగోళం నెలకొంది.
ఇండియా-అమెరికా ట్రేడ్ డీల్ తో పాటు నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి అంశాలను ప్రస్తావిస్తూ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు సమ్మిట్ బోర్డ్ ముందు నిలబడి నిరసనకు దిగారు. ‘పీఎం ఈజ్ కాంప్రమైజ్డ్’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ చర్యతో వెంటనే అలర్ట్ అయిన భద్రతా సిబ్బంది అక్కడికి చేరుకుని ఆందోళనకారులను బలవంతంగా బయటకు పంపింది. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను తిలక్ మార్గ్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఏఐ సమ్మిట్ ఉన్నత స్థాయి సదస్సు. అంతర్జాతీయ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు తరలి వచ్చారు. దీంతో చాలా టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. అలాంటి భద్రతను దాటుకుని యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ఎలా లోపలికి వచ్చారనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనతో భారత్ మండపం దగ్గర సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం చేశారు.
యూత్ కాంగ్రెస్ కార్యకర్తల చర్య అధికార, విపక్ష నేతల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. యూత్ కాంగ్రెస్ కార్యకర్తల తీరును అధికార పార్టీ నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. అంతర్జాతీయ వేదికపై ఇలాంటి నిరసనలు కరెక్ట్ కాదన్నారు. అంతర్జాతీయ సదస్సును అడ్డుకుని దేశ ప్రతిష్టకు భంగం కలిగించారని బీజేపీ నేతలు మండిపడ్డారు. దీనికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రేపటి నుంచి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ మాత్రం తమ కార్యకర్తలు చేసిన పనిని సమర్ధించుకుంటోంది. ఇది తమ నిరసన తెలిపే హక్కు అని ఆ పార్టీ నాయకులు అంటున్నారు.
ఇక, ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026పై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేస్తోంది. దీన్ని పబ్లిసిటీ స్టంట్ గా రాహుల్ గాంధీ విమర్శించారు. కేంద్రంలోని మోదీ సర్కార్.. జాతీయ ప్రయోజనాల కంటే కార్పొరేట్ శక్తులకే ప్రాధాన్యత ఇస్తోందని మండిపడ్డారు.
Also Read: హైదరాబాద్లో రెస్టారెంట్ లో తీగలాగితే.. దేశంలో రూ.70,000 కోట్ల స్కాం.. బయటపడిందిలా..
