Mamata Banerjee : లాయర్‌గా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. దేశ చరిత్రలో తొలిసారి..
Mamata Banerjee : తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ లాయర్‌గా మారబోతున్నారు.
- Harish Thanniru
- Updated on- February 4, 2026 / 11:46 AM IST
Mamata Banerjee
Mamata Banerjee : తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ లాయర్‌గా మారబోతున్నారు. సుప్రీంకోర్టు వేదికగా లాయర్‌గా వాదించనున్నారు. తద్వారా అరుదైన రికార్డును నమోదు చేయబోతున్నారు.
సుప్రీంకోర్టులో సర్, కేంద్ర ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా మమతా బెనర్జీ పిటీషన్లు వేసిన విషయం తెలిసిందే. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్షివ్ రివిజన్ (SIR) ప్రక్రియకు వ్యతిరేకంగా ఆమె వేసిన పిటిషన్ నేడు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు రానుంది. ఈ క్రమంలో ఏకంగా మమతా బెనర్జీ తన రాజకీయ పోరాటం కోసం న్యాయవాది అవతారమెత్తి వాదించనున్నారు.
సాధారణంగా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా తమ తరపున కోర్టుల్లో వాదించేందుకు అగ్రశేణి న్యాయవాదులను నియమించుకుంటారు. కానీ, మమతా బెనర్జీ మాత్రం నేరుగా రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. మమతా బెనర్జీ కలకత్తాలోని జోగేష్ చంద్ర చౌదరి లా కాలేజీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. ఇప్పటికే సుప్రీంకోర్టులో “పార్టీ-ఇన్-పర్సన్” (Party-in-person)గా వాదించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఒక సిట్టింగ్ సీఎం ఇలా కోర్టులో స్వయంగా వాదనలు వినిపించడం దేశ చరిత్రలోనే ఇదే ప్రథమం కావడంతో న్యాయ, రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
