CAA: దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన అమిత్ షా కామెంట్స్

హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్న మోదీ సర్కారు... మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా..

Amit Shah

దేశంలో పౌరసత్వ సవరణ చట్టం అంశం మరోసారి తెరపైకి వచ్చింది. 2019లోనే ఆమోదం పొందిన ఈ బిల్లుపై తీవ్రస్థాయి వ్యతిరేకతలు, ఆందోళనలు ప్రారంభమైన నేపథ్యంలో వాయిదా పడుతూ వస్తోంది. అయితే వచ్చే పార్లమెంట్‌ ఎన్నికలలోపే సీఏఏను అమలు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ఎవరి పౌరసత్వాన్ని లాక్కోవడం ఈ చట్టం ఉద్దేశం కాదని కేంద్రం చెబుతుండగా.. కొన్ని రాష్ట్రాలు మాత్రం దీనికి ఆమోదించేది లేదని భీష్మించి కూర్చున్నాయి.

మేనిఫెస్టోలోని హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్న మోదీ సర్కారు… మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టాన్ని పార్లమెంట్‌ ఎన్నికలకు ముందే అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రకటించారు. సీఏఏ గురించి ముస్లింలను తప్పుదోవ పట్టించారన్న ఆయన.. వాళ్లను కావాలనే రెచ్చగొట్టారన్నారు. విదేశాల్లో వేధింపులు తట్టుకోలేక జీవనోపాధి కోసం వివిధ దేశాల నుంచి భారత్‌కు వలస వచ్చిన వారికి పౌరసత్వం ఇస్తామని చెప్పారు అమిత్‌షా.

2019 ఎన్నికల సమయంలో పార్లమెంట్‌లో పౌరసత్వ చట్టానికి సవరణలు చేసి పార్లమెంట్‌ ఉభయ సభల్లో ఆమోదం తెలిపారు. తర్వాత రాష్ట్రపతి ఆమోదముద్రతో ఇది చట్టంగా మారింది. అయితే.. దేశవ్యాప్తంగా దీనికి వ్యతిరేకంగా నిరసనలు మొదలయ్యాయి. సీఏఏను వెనక్కి తీసుకోవాలంటూ పలు రాష్ట్రాల్లో మైనార్టీలతో పాటు ఇర వర్గాల వారు ఆందోళనలు చేపట్టడంతో ఈ చట్టాన్ని అమలు చేయడం వాయిదా పడుతూ వస్తోంది.

సీఏఏ ఉద్దేశం?
పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్‌కు చెందిన ముస్లిమేతర వలసదారులకు భారత పౌరసత్వం కల్పించడమే సీఏఏ ఉద్దేశం. 2014 డిసెంబర్‌ 31కి ముందు ఇండియాకు వలస వచ్చిన.. హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్శీలు, క్రైస్తవులకు ఇది వర్తిస్తుంది. అయితే.. ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్‌, ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ దేశాల నుంచి వచ్చిన ముస్లిమేతర మైనార్టీలు అధిక సంఖ్యలో ఉన్నారు. వీరందరికీ పౌరసత్వం కల్పిస్తే.. తమ హక్కులకు భంగం కలగడంతో పాటు.. ఉపాధి అవకాశాలపై దెబ్బపడుతుందని స్థానికులు వాపోతున్నారు.

జాతీయ పౌరుల రిజిస్టర్‌
ఈ చట్టంలో భాగంగా తెరపైకి వచ్చిన జాతీయ పౌరుల రిజిస్టర్‌ కూడా మరో వివాదానికి కారణమైంది. ఇందులో భాగంగా ధ్రువీకరణ పత్రాల ఆధారంగా పౌరసత్వానికి అర్హులైన వారి జాబితా రూపొందిస్తారు. సరైన పత్రాలు లేని వారిని అక్రమ వలసదారులుగా గుర్తిస్తారు. 2020లో అసోంలో అమలు చేసిన ఈ NRC విధానాన్ని దేశవ్యాప్తం చేస్తామని ప్రధాని మోదీ ప్రకటించడం మరో వివాదానికి దారితీసింది. ఎలాంటి పత్రాలు లేని ముస్లింలను అక్రమ వలసదారులుగా గుర్తిస్తారని ఆ వర్గంలో తీవ్ర ఆందోళన నెలకొంది.

మరోవైపు.. ఈ పౌరసత్వ చట్టాన్ని అమలు చేయబోమని పశ్చిమబెంగాల్‌, తమిళనాడు సహా పలు రాష్ట్రాలు ప్రకటించాయి. పౌరసత్వాలు రద్దయ్యే విధంగా ఉన్న ఈ చట్టాన్ని తాము అంగీకరించమని ప్రకటించిన తరుణంలో.. అమిత్‌షా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఒకవేళ చెప్పినట్లుగానే కేంద్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందే ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకువస్తే.. ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో వేచి చూడాల్సిందే.

BRS: గులాబీ పార్టీకి ఇప్పుడు పెద్ద సవాల్‌గా ఇదే..

ట్రెండింగ్ వార్తలు