PM Narendra Modi : ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన సప్తధారలు ఇవే.. వీటివల్ల ఉపయోగాలు ఏమిటంటే?
PM Narendra Modi :ఢిల్లీ ఎర్రకోటలో జరిగిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రధాని మాట్లాడుతూ దేశ ప్రగతి కోసం ‘ సప్తధార ’ రోడ్ మ్యాప్‌ను ప్రకటించారు.
- Harish Thanniru
- Published on- August 15, 2026 / 02:20 PM IST
PM Narendra Modi : 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటలో ఘనంగా జరిగాయి. ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. సప్తధార శక్తి సామర్థ్యాలతో దేశాన్ని నూతన శిఖరాలకు తీసుకెళ్తామన్న ప్రధాని.. భారతావనికి నూతన వేగం అందిస్తామని, సరికొత్త లక్ష్యాలను సాధించి, వాటిని అధిగమించేలా శక్తివంతం చేస్తామన్నారు. ఈ సందర్భంగా దేశ ప్రగతి కోసం ‘ సప్తధార ’ రోడ్ మ్యాప్‌ను ప్రకటించారు.
Also Read : CM Chandrababu Naidu : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రజలకు చంద్రబాబు కీలక సూచనలు.. మన టార్గెట్ ఇదే..!
తయారీ రంగంలో బలోపేతం ..
ప్రపంచంలోనే ప్రధాన తయారీ కేంద్రంగా భారతదేశంను మార్చడమే లక్ష్యంమని ప్రధాని మోదీ తెలిపారు. తక్కువ ఖర్చుతో, అత్యుత్తమ నాణ్యతతో, భారీ స్థాయిలో ఉత్పత్తులను తయారు చేయడంపై దృష్టి సారించనున్నామని, అదే సమయంలో దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. ఉత్పత్తి ధర, నాణ్యత, పరిమాణంపై దృష్టి సారించాలని, ప్రపంచ స్థాయిలో పోటీతత్వాన్ని సాధించాలని ఆయన ఉత్పత్తిదారులకు సూచించారు. మన ప్యాకేజింగ్ ప్రజలను ఆకట్టుకునేలా ఉండాలని.. మన కచ్చితత్వం మన గుర్తింపుగా మారాలని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.
వ్యవసాయం – ఆహార ప్రాసెసింగ్..
కేవలం వ్యవసాయ ఉత్పత్తులను పండించడానికే పరిమితం కాకుండా.. వాటిని ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ చేసి అధిక విలువ కలిగిన ఉత్పత్తులుగా మార్చడం, ఎగుమతులను పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు.. తద్వారా రైతులకు మరిన్ని మార్కెట్ అవకాశాలు, మెరుగైన ఆదాయం లభించేలా చేయనున్నట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. పొలం నుంచి ఎగుమతి మార్కెట్‌కు మన ఉత్పత్తులను మళ్లించాలన్నారు. మన సంప్రదాయ ఆహారం, మిల్లెట్స్, సుంగధ ద్రవ్యాలు, పండ్లు, కూరగాయలు అంతర్జాతీయ బ్రాండ్లుగా మారాల్సిన అవసరం ఉందని మోదీ పేర్కొన్నారు.
సాంకేతికత.. ఆవిష్కరణలు..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), సెమీకండక్టర్లు, డిజిటల్ టెక్నాలజీ, పరిశోధన, ఆవిష్కరణలకు మరింత ప్రాధాన్యం ఇస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు. ఇతర దేశాలు అభివృద్ధి చేసిన సాంకేతికతను వినియోగించడం మాత్రమే కాకుండా.. కీలకమైన సాంకేతికతలను భారత్‌లోనే అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. యూపీఐని ప్రవేశపెట్టడం ద్వారా మన సామర్థ్యం ఏంటో మనకు తెలిసిందన్నారు. మేడిన్ ఇండియా 6జీ దేశమంతటా చేరాలని లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. యూపీఐ, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాలో భారత విజయాన్ని ప్రస్తావించిన మోదీ.. నెక్స్ట్ జనరేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో మనం మరో పెద్ద అడుగు వేయాల్సిన అవసరం ఉందన్నారు.
గతిశక్తి – మౌలిక వసతులు..
దేశ ఆర్థిక అభివృద్ధికి మెరుగైన రోడ్లు, రైల్వేలు, పోర్టులు, విమానాశ్రయాలు, లాజిస్టిక్స్ వ్యవస్థలు కీలకమని ప్రధాని మోదీ అన్నారు. దేశవ్యాప్తంగా వేగవంతమైన కనెక్టవిటీని పెంపొందించాలన్న ప్రధాని మోదీ.. వ్యాపార రంగానికి ఊతం ఇవ్వడం కోసం కొత్త రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలు ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తామన్నారు.
రక్షణ రంగంలో స్వావలంబన..
భారత్ తన రక్షణ తయారీ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుందని మోదీ పేర్కొన్నారు. రక్షణ పరికరాలు, ఆయుధ వ్యవస్థలను దేశీయంగా ఎక్కువగా తయారు చేయడం ద్వారా విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గించనున్నట్లు తెలిపారు. అదే సమయంలో భారత రక్షణ ఉత్పత్తుల ఎగుమతులను కూడా పెంచే దిశగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. డ్రోన్ టెక్నాలజీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన ప్రధాని.. డ్రోన్లు, కౌంటర్ డ్రోన్ టెక్నాలజీ భారత్ మరింత పెట్టుబడులు పెడుతుందన్నారు.
గ్రీన్ – బ్లూ ఎకానమీ..
భారత్ అభివృద్ధి ప్రణాళికలో గ్రీన్ ఎకానమీ, బ్లూ ఎకానమీకి కూడా కీలక స్థానం కల్పించడం జరిగిందని మోదీ తెలిపారు. పునరుత్పాదక ఇంధనం, స్వచ్ఛమైన సాంకేతికతలు, పర్యావరణ పరిరక్షణతో పాటు సముద్ర వనరులను సమర్థంగా వినియోగించుకోవడంపై దృష్టి పెట్టాలని మోదీ పిలుపునిచ్చారు.
భారతదేశ సాఫ్ట్ పవర్..
భారత్‌కు ఉన్న సంస్కృతి, వారసత్వం, యోగా, పర్యాటకం, సంప్రదాయాలు, జ్ఞానం, అంతర్జాతీయ ప్రభావాన్ని వ్యూహాత్మక బలాలుగా ఉపయోగించుకోవడమే సాఫ్ట్ పవర్ లక్ష్యం. కేవలం ఆర్థిక, సైనిక శక్తితోనే కాకుండా.. సంస్కృతి, దౌత్యం ద్వారా కూడా ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ప్రభావాన్ని మరింత పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
