Meghalaya Honeymoon Case: రాజా రఘువంశీ తల్లికి సోనమ్ బ్రదర్ ప్రామిస్ .. ‘మమ్మీ నేనే స్వయంగా వెళ్లి..’
గోవింద్ ను చూడగానే రాజా తల్లి ఉమ కన్నీటిపర్యంతం అయ్యారు. సోనమ్ ఇలా చేస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు అంటూ బోరున విలపించారు.
- Naveen
- Published On : June 11, 2025 / 08:48 PM IST
Meghalaya Honeymoon Case: మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. హనీమూన్ పేరుతో భర్త రాజా రఘువంశీని మేఘాలయ తీసుకెళ్లి కిరాయి హంతకులతో భార్య సోనమ్ హత్య చేయించిందని తెలిసి అంతా షాక్ అయ్యారు. ఈ దారుణ ఘటన అందరినీ కదిలించింది. ప్రియుడి కోసం సోనమ్ ఘాతుకానికి ఒడిగట్టింది. రాజా రఘువంశీ హత్యతో అతడి కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. మృతుడి తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. నా కొడుకు ఏం తప్పు చేశాడు, అతడిని ఎందుకు చంపేశారు అంటూ రోదిస్తోంది.
కాగా, నిందితురాలు సోనమ్ రఘువంశీ సోదరుడు గోవింద్.. ఇండోర్ కి వెళ్లారు. రాజా కుటుంబాన్ని కలిశారు. రాజా తల్లి ఉమను చూసి అతడు ఒక్కసారిగా కంటతడి పెట్టారు. ఇద్దరూ బోరున విలపించారు.
రాజా తల్లికి గోవింద్ క్షమాపణలు చెప్పాడు. అంతేకాదు ఆమెని అమ్మ అని సంభోదించాడు. రాజా తల్లికి అతడు వాగ్దానం ఇచ్చాడు. ”విచారణకు నేను స్వయంగా వెళ్తాను, సోనమ్ కు శిక్ష పడేలా చూస్తాను” అని రాజా తల్లితో చెప్పాడు గోవింద్.
హనీమూన్ కి వెళ్లిన రాజా కనిపించడం లేదని తెలిసిన వెంటనే గోవింద్ షిల్లాంగ్ కి వెళ్లాడు. సోనమ్ మృతదేహం కోసం తీవ్రంగా గాలించాడు. ఎడతెరిపి లేని వర్షం కురుస్తున్నా అతడు లెక్క చేయలేదు. సోదరి జాడ కోసం తీవ్రంగా గాలించాడు. అయితే సోనమ్ సజీవంగా ఉందని తెలుసుకుని ఉత్తరప్రదేశ్ లోని ఘాజీపూర్ కి వెళ్లాడు. భర్తను చంపించింది సోనమ్ అనే అనుమానంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేయడంతో సోదరికి సాయం చేసేందుకు గోవింద్ వెళ్లాడు.
గోవింద్ ను చూడగానే రాజా తల్లి ఉమ కన్నీటిపర్యంతం అయ్యారు. సోనమ్ ఇలా చేస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు అంటూ బోరున విలపించింది. గోవింద్ ను దగ్గరికి తీసుకుని గుండె పగిలేలా ఆమె ఏడ్చింది. ”సోనమ్ సోదరుడు గోవింద్ మాతో నిన్న మాట్లాడాడు. ఇవాళ మా ఇంటికి వస్తానని చెప్పాడు. చెప్పినట్లే ఇవాళ మా ఇంటికి వచ్చాడు. మా అమ్మకు క్షమాపణ చెప్పాడు. సోనమ్ ఏదైనా తప్పు చేసి ఉంటే.. ఎట్టి పరిస్థితుల్లో ఆమెను వదిలేది లేదని గోవింద్ మాతో చెప్పాడు” అని రాజా రఘువంశీ సోదరుడు విపిన్ రఘువంశీ తెలిపాడు.
బుధవారం, సోనమ్, మరో నలుగురు నిందితులను మేఘాలయలోని జిల్లా కోర్టు ముందు పోలీసులు హాజరుపరిచారు. హత్య ఎలా జరిగిందో తెలుసుకోవడానికి పోలీసులు వారిని కస్టడీకి కోరారు. ప్రధాన నిందితుడు, సోనమ్ ప్రియుడు రాజ్ కుష్వాహా రాజా హత్య కోసం హంతకులకు 50వేలు చెల్లించాడని మధ్యప్రదేశ్ క్రైమ్ బ్రాంచ్ విచారణలో తెలిసింది.
”ఈ పథకం అమలు చేయడానికి దుండగులకు రాజ్ 50వేలు ఇచ్చాడు. హోటల్ బసతో సహా ప్రయాణ ఖర్చులకు డబ్బిచ్చాడు. సంఘటన తర్వాత, వారు ఇండోర్‌లోకి ప్రవేశించడానికి వేర్వేరు రైళ్లలో వెళ్లారు. సంఘటన తర్వాత వారు తమ మొబైల్ ఫోన్‌లను ధ్వంసం చేశారు” అని క్రైమ్ బ్రాంచ్ అధికారి తెలిపారు.
హత్య జరిగిన సమయంలో సోనమ్ అక్కడే ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. దుండగుల్లో ఒకడైన విశాల్, రాజాపై వెనుక నుండి దాడి చేశాడు. తలకు రెండు గాయాలు చేశాడు. ఆ తర్వాత ముగ్గురు దుండగులు అతని మృతదేహాన్ని లోయలో పడేశారు. హత్య తర్వాత, సోనమ్ సిలిగురి మీదుగా ఇండోర్‌కు పారిపోయి రెండు రోజులు ఒక ఫ్లాట్‌లో బస చేసింది. ఆ తర్వాత ఆమె ఉత్తరప్రదేశ్ కి బయలుదేరి ఘాజీపూర్ చేరుకుంది.
గత నెలలో మేఘాలయలో హనీమూన్ సందర్భంగా రాజా, సోనమ్ కనిపించకుండా పోయారని ఫిర్యాదులు వచ్చాయి. ఈ నెల ప్రారంభంలో రాజా మృతదేహాన్ని గుర్తించారు. సోనమ్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. సోనమ్ సాయంతో రాజా హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలపై పోలీసులు కుష్వాహాను అరెస్ట్ చేశారు. అతను పట్టుబడిన తర్వాత సోనమ్ ఉత్తరప్రదేశ్‌లోని ఒక పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయింది.
Case Update🚨#SonamRaghuvanshi confessed to the murder.
Sonam’s Brother Says ‘Hang My Sister’ As He Consoles Raja’s Mother.
Media should be ashamed; let the family mourn in peace. pic.twitter.com/Up2VxvPzIv
— ShoneeKapoor (@ShoneeKapoor) June 11, 2025
