Meghalaya Honeymoon Case: హనీమూన్ కేసులో సంచలనం.. నేనే చంపించాను, నేరాన్ని అంగీకరించిన సోనమ్..! సోనమ్‌ను ఉరి తీయాలన్న సోదరుడు..

నా కుటుంబం మాత్రమే కాదు, మొత్తం సమాజం సోనమ్ ను బహిష్కరిస్తుంది. నేను రాజా కుటుంబానికి క్షమాపణలు చెప్పాను. నేను ఎల్లప్పుడూ వారితోనే ఉంటాను అని సోనమ్ సోదరుడు చెప్పాడు.

Meghalaya Honeymoon Case: హనీమూన్ కేసులో సంచలనం.. నేనే చంపించాను, నేరాన్ని అంగీకరించిన సోనమ్..! సోనమ్‌ను ఉరి తీయాలన్న సోదరుడు..

Updated On : June 11, 2025 / 6:46 PM IST

Meghalaya Honeymoon Case: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మేఘాలయ హనీమూన్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సోనమ్ నేరాన్ని అంగీకరించినట్లు తెలుస్తోంది. నేనే నా భర్తను చంపించాను అని ఆమె పోలీసులతో చెప్పినట్లు సమాచారం. సుపారీ ఇచ్చి భర్తను చంపించిన ఆరోపణలతో సోనమ్, నలుగురు నిందితులు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. పోలీసుల విచారణలో వారు నేరం అంగీకరించినట్లు సమాచారం. భర్తను చంపడం భార్య సోనమ్ కళ్లారా చూసిందని, ఈ విషయాన్ని నిందితులు తమతో చెప్పారని షిల్లాంగ్ పోలీసులు వెల్లడించారు. ఒకవేళ కిరాయి గూండాలు హత్య చేయడంలో విఫలమైతే.. ఆమె స్వయంగా కొండ మీద నుంచి తోసి భర్తను చంపాలని ప్లాన్ చేసిందని పోలీసులు వెల్లడించారు.

మరోవైపు ఈ వ్యవహారంపై సోనమ్ సోదరుడు గోవింద్ తీవ్రంగా స్పందించాడు. సోనమ్ తో తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు. అంతేకాదు ఇంతటి దారుణానికి ఒడిగట్టిన సోనమ్ ను ఉరి తీయాలని అతడు డిమాండ్ చేశాడు. మృతుడు రాజా రఘువంశీ ఇంటికి వెళ్లిన సోనమ్ సోదరుడు.. రాజా తల్లిని ఓదార్చే ప్రయత్నం చేశారు. అదే సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు.

కొడుకు చనిపోయిన బాధలో ఉన్న రాజా రఘువంశీ తల్లిని సోనమ్ సోదరుడు గోవింద్ ఓదార్చే ప్రయత్నం చేశారు. ఇద్దరూ కలిసి భోరున విలపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read: మేఘాలయ హనీమూన్‌ కేసు: రాజ్ కుశ్వాహాకి రాఖీ కట్టేది.. అతడు సోనమ్ ని అక్కా అని పిలిచేవాడు.. ఇంకా..

”ఆమె (సోనమ్) నేరం ఒప్పుకుందో లేదో నాకు తెలియదు. కానీ ఆమె ఆ పని చేసిందని నేను చెబుతున్నాను. నేను రాజాతో ఉన్నాను. నేను సోనమ్‌ను బహిష్కరిస్తాను. మా తల్లిదండ్రులు కూడా దాన్ని అంగీకరించారు. నా కుటుంబం మాత్రమే కాదు, మొత్తం సమాజం ఆమెను (సోనమ్) బహిష్కరిస్తుంది. నేను (రాజా) కుటుంబానికి క్షమాపణలు చెప్పాను. నేను ఎల్లప్పుడూ వారితోనే ఉంటాను” అని సోనమ్ సోదరుడు గోవింద్ అన్నాడు.

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీ-సోనమ్‌కు మే 11న పెళ్లి జరిగింది. అదే నెల 20న హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లారు. మొదట జమ్మూకశ్మీర్‌కు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ అక్కడ పహల్గాం ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. దీంతో వారు మేఘాలయకు తమ హనీమూన్ ప్లాన్ మార్చుకున్నారు. హనీమూన్ కోసం షిల్లాంగ్ వెళ్లిన రెండు రోజుల తర్వాత రాజా-సోనమ్ ల ఆచూకీ గల్లంతైంది. జూన్ 2న ఘోరం వెలుగుచూసింది. భర్త రాజా రఘువంశీ మృతదేహం కనిపించింది. భార్య సోనమ్ కనిపించకుండా పోయింది. ఒక పదునైన ఆయుధంతో రాజా తలపై రెండుసార్లు కొట్టినట్లు పోస్టుమార్టం రిపోర్టులో బయటపడింది. సోనమ్ తన ప్రియుడు రాజ్ కుశ్వాహాతో కలిసి భర్త హత్యకు ప్రణాళిక చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. 20లక్షలు సుపారీ ఇచ్చి మరీ కిరాయి గూండాలతో భర్తను భార్యే హత్య చేయించిందని పోలీసుల విచారణలో బయటపడింది.