మేఘాలయ హనీమూన్ కేసు: రాజ్ కుశ్వాహాకి రాఖీ కట్టేది.. అతడు సోనమ్ ని అక్కా అని పిలిచేవాడు.. ఇంకా..
ఈ కేసులో ఊహించని ట్విస్ట్ ఇచ్చింది రాజ్ కుశ్వాహా సోదరి సుహానీ. ఆమె ఏం చెప్పిందంటే..

పెళ్లి తర్వాత ప్రతి జంట హనీమూన్‌కు వెళ్లాలని కలలుకంటారు. హనీమూన్ ఓ మధురానుభూతి ఇస్తుంది. కానీ ఇటీవల మేఘాలయలో హత్యకు గురైన రాజా రఘువంశీ పాలిట మాత్రం అదే యమపాశమైంది. మేఘాలయ కొండల్లో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ హాయిగా భర్తతో గడపాల్సిన భార్యే.. ప్రియుడి కోసం దారుణానికి ఒడిగట్టింది. భర్తను చంపించింది. దేశాన్ని కుదిపేసిన ఈ హనీమూన్ హత్య కేసులో ప్రధాన నిందితురాలు సోనమ్ రఘువంశీని పోలీసులు అరెస్ట్ చేయగా, ఇప్పుడు విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి.
హనీమూన్ కాదు, హత్యకు స్కెచ్!
పెళ్లైన 9 రోజులకే సోనమ్ తన భర్త హత్యకు పక్కా ప్రణాళిక వేసింది. పోలీసుల దర్యాప్తు ప్రకారం ఈ హత్యకు ప్లాన్ ఇలా జరిగింది..
- మే 11న రాజా – సోనమ్ వివాహం జరిగింది.
- పెళ్లైన 9 రోజులకే మే 20న హనీమూన్ కోసం మేఘాలయ బయలుదేరారు. పోలీసులు గుర్తించిన కీలకమైన విషయం ఏమిటంటే, వారు బుక్ చేసుకున్నవి వన్ వే టికెట్లు మాత్రమే.
- మూడు రోజులు హనీమూన్ డ్రామా ఆడిన తర్వాత కిరాయి హంతకుల సాయంతో సోనమ్ తన భర్త రాజాను హత్య చేయించింది.
- జూన్ 2న సోహ్రాలోని ఓ జలపాతం దగ్గర లోయలో రాజా మృతదేహం బయటపడింది.
కేసులో బిగ్ ట్విస్ట్
ఈ హత్య వెనుక సోనమ్ ప్రియుడు రాజ్ కుశ్వాహా హస్తం ఉందని పోలీసులు చెబుతున్నారు. తమ ఫ్యామిలీ బిజినెస్‌లో పనిచేసే కుశ్వాహా సోనమ్‌కు సన్నిహితంగా ఉంటుందని, హత్య కోసం ఆమె రౌడీలకు రూ.20 లక్షలు సుపారీ ఇచ్చిందని తెలుస్తోంది.
అయితే, ఈ కేసులో ఊహించని ట్విస్ట్ ఇచ్చింది రాజ్ కుశ్వాహా సోదరి సుహానీ. ఆమె ఏం చెప్పిందంటే.. “నా అన్నయ్య సోనమ్‌ను ‘దీదీ’ (అక్క) అని పిలిచేవాడు. వాళ్లిద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదు. బిజినెస్ పని మీదే ఆమె ఫోన్ చేసేది. ఆ ఫోన్లు మేము కూడా లిఫ్ట్ చేసేవాళ్లం” అని చెప్పింది. ఈ వ్యాఖ్యలతో కేసు మరోవైపు తిరుగుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
విచారణలో ఏం తేలింది?
భర్త హత్య తర్వాత కనిపించకుండా పోయిన సోనమ్ జూన్ 7న ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో పోలీసులకు లొంగిపోయింది. పోలీసులు ఆమెను అధికారికంగా అరెస్ట్ చేసి, విచారణ నిమిత్తం మేఘాలయలోని శిలాంగ్‌కు తరలించారు. సోనమ్‌ను మొదట గణేశ్ దాస్ హాస్పిటల్‌లో వైద్య పరీక్షల అనంతరం సదర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ప్రస్తుతం సోనంతో పాటు ఈ హత్యకు సహకరించిన మరో నలుగురు నిందితులు మూడు రోజుల పోలీసు కస్టడీలో ఉన్నారు. ప్రేమ, నమ్మకం పునాదులపై నిలబడాల్సిన పెళ్లి బంధాన్ని అపహాస్యం చేసేలా ప్రవర్తించింది సోనమ్. పోలీసుల విచారణ కొనసాగుతున్న కొద్దీ ఈ కేసులో మరిన్ని చీకటి కోణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రియుడి కోసం భర్తను చంపిందా? లేక దీని వెనుక ఇంకేమైనా కారణాలున్నాయా? అనే ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.