ఘాట్స్ ఓన్ స్టేట్‌ కేరళలో జలప్రళయం.. ప్రకృతి ప్రకోపమా.. మానవ తప్పిదమా.?

ఘాట్స్ ఓన్ స్టేట్‌గా పేరున్న కేరళలో ప్రకృతి ప్రళయాలు పెను విషాదాన్ని నింపుతున్నాయి. అపార సహజ వనరులున్న కేరళ ప్రకృతి విపత్తులతో ఆగమాగం అవుతోంది.

What makes Kerala so vulnerable to Wayanad landslides like disasters

Kerala landslides: కేరళలో ప్రకృతి అందాలు ఉండటమే కాదు.. ఆ రాష్ట్ర ప్రజలు కూడా ప్రకృతి ప్రేమికులు. భారత్‌లో ఏ రాష్ట్రానికి లేని సహజ వనరులు కేరళ సొంతం. ఆయుర్వేద మూలికలు, కాఫీ, టీ, యాలకుల తోటలు..మరోవైపు ప్రకృతి అందాలు ఇవన్నీ కేరళాకే పరిమితం. ఘాట్స్ ఓన్ స్టేట్‌గా పేరున్న కేరళలో ప్రకృతి ప్రళయాలు పెను విషాదాన్ని నింపుతున్నాయి. మానవ తప్పిదాలతోనే కేరళలో తుపానుల తీవ్రత బాగా పెరిగిపోతున్నట్లు తెలుస్తోంది. నీట మునిగిన భూములను మళ్లీ ఉపయోగంలోకి తేవడం, ఓడరేవుల అభివృద్ధి, రొయ్యల సాగు, నదీమార్గాల మళ్లింపు, ఇసుక తవ్వకాలు.. ఇలాంటి చర్యలు ప్రకృతి సహజత్వాన్ని దెబ్బతీశాయి. దాంతో అపార సహజ వనరులున్న కేరళ ప్రకృతి విపత్తులతో ఆగమాగం అవుతోంది. 2007లో ఓఖి తుపాను రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. తౌతే తుపాను మరోసారి విలయం సృష్టించింది. ఆ రెండు తుపానులతో లెక్కలేనంత నష్టం జరిగింది.

ముందు చూపు లేకపోవడమే కారణమా?
కొచ్చిన్‌ ఓడరేవు కోసం డ్రెడ్జింగ్‌ చేసిన తర్వాత గ్రామాలు సముద్రానికి బాగా దగ్గరైపోయాయి. కొచ్చి నుంచి అళప్పుళ వరకు తీరప్రాంత జాతీయ రహదారి నిర్మాణంతో సముద్ర కోత మరింత ఎక్కువైంది. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చేపట్టిన తర్వాతే తుపాన్ల ప్రభావం కేరళను మరింతగా ఇబ్బంది పెడుతోంది. తుపాన్లతో సముద్రపు అలల ప్రభావం తీరప్రాంత గ్రామాలపై మరీ ఎక్కువగా ఉండకుండా.. జియో సింథటిక్‌ ట్యూబులతో దాదాపు 310 కిలోమీటర్ల గోడలు కట్టారు. తుపాన్ల దాటికి వాటిలో చాలావరకు కొట్టుకు పోయాయి. శరవేగంగా మౌలిక వసతులను అభివృద్ధి చేయాలన్న ఆలోచన తప్ప, ముందు చూపు లేకపోవడమే కేరళలో ప్రకృతి విలయానికి ప్రధాన కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ప్రకృతి విల‌య‌ తాండ‌వంతో కేర‌ళ విల‌విల‌
కేరళ కాంక్రీట్ జంగిల్‌గా అస్సలు క‌నిపించ‌దు. సుందరమైన పశ్చిమ కనుమల మధ్య కేరళలో సుగంధ తోటలు, వన్యప్రాణులతో ప్రకృతి అందాలు మైమరిపిస్తాయి. నేటికీ.. చుట్టూ విశాల‌మైన స్థలంలో మ‌ధ్యన ఇల్లు క‌ట్టుకోవ‌టం.. ఇంటికి.. ఇంటికి మ‌ధ్య దూరం ఎక్కువ‌గా ఉండ‌టం కేర‌ళ‌లో చాలాచోట్ల క‌నిపిస్తుంటుంది. ప్రకృతిని ప్రేమించే కేర‌ళీయులు..ఈ మ‌ధ్య వారి మ‌న‌సులు మారుతున్నాయి. శ‌తాబ్దాల నుంచి అనుస‌రిస్తున్న విధానాల్ని వ‌దిలేసి.. త‌మ‌ను తాము మారిపోతున్న తీరును చూసి ప్రకృతి కూడా త‌ట్టుకోలేక‌పోతోంది. పర్యావ‌ర‌ణాన్ని దెబ్బతీస్తుండటంతో పాటు.. ప్రకృతి విల‌య‌ తాండ‌వంతో కేర‌ళ రాష్ట్రం ఇప్పుడు విల‌విల‌లాడిపోతోంది. రెండుమూడేళ్లకోసారి వచ్చే విపత్తులతో వ‌ణికిపోతోంది.

Also Read: వయనాడ్ విలయం.. ప్రమాదం సమయంలో విపరీతంగా మోగిన ఫోన్లు

కొండచరియలు విరిగిపడటం కేరళలో కొత్తేమి కాదు. కానీ ప్రళయం వచ్చినప్పుడు ల్యాండ్ స్లైడ్స్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటోంది. ప్రకృతి సిద్ధమైన కొండలు, గుట్టల నుంచి రాళ్లు, మట్టి కిందకు జారిపడటాన్ని కొండచరియలు విరిగిపడటం అంటారు. ఏటవాలుగా ఉన్న ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతాయి. వర్షపాతం ఎక్కువగా ఉన్నప్పుడు, మంచుపాతం వంటి కారణాలతో కోతకు గురవడం, భూగర్భ జలాల్లో మార్పులతో కొండచరియలు విరిగిపడుతాయి. నీటి అడుగున కూడా కొండచరియలు విరిగిపడతాయి. వీటిని సబ్‌మెరైన్ ల్యాండ్‌స్లైడ్స్ అంటారు. దీంతో భూంకపాలు ఏర్పడి కొన్నిసార్లు ఇది సునామీకి దారితీసి ప్రకృతి ప్రళయానికి దారి తీస్తుంది.

Also Read: మాటలకందని మహా ఉత్పాతం.. ఎటు చూసినా విధ్వంసం జాడలు.. భీతావాహ దృశ్యాలు

కేరళ 2018లో తీవ్ర వరదలతో 483 మంది ప్రాణాలు కోల్పోయారు. 1961 నుంచి 2016 మధ్య 295 మంది కొండచరియలు విరిగిపడి మరణించారు. 2019 నుంచి 2020 వరకు 100 మందికిపైగా చనిపోయారు. 2021లో కొట్టాయం, ఇడుక్కి జిల్లాల్లో కొండచరియలు విరిగిపడిటం 50మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఇలా కొండచరియలు విరిగిపడి మనుషులు చనిపోవడం, నిరాశ్రయులు అవడం కేరళాలో ఇంకతముందు కూడా జరిగింది. వయనాడ్‌లో చోటుచేసుకున్న ప్రళయం మాత్రం మాటల్లో చెప్పలేనిది.

ట్రెండింగ్ వార్తలు