వయనాడ్ విలయం.. పెరుగుతున్న మృతుల సంఖ్య.. ప్రమాదం సమయంలో విపరీతంగా మోగిన ఫోన్లు

కేరళ రాష్ట్రం వయనాడ్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కొండ చరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది.

వయనాడ్ విలయం.. పెరుగుతున్న మృతుల సంఖ్య.. ప్రమాదం సమయంలో విపరీతంగా మోగిన ఫోన్లు

Wayanad Landslide

Updated On : July 30, 2024 / 4:25 PM IST

Wayanad Landslide : కేరళ రాష్ట్రం వయనాడ్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కొండ చరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 44 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు వంద మంది వరకు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా.. వందలాది మంది ఆచూకీ లభించలేదు. సహాయక చర్యలు కొనసాగుతున్నా కొద్దీ మృతదేహాలు వెలుగులోకి వస్తున్నాయి. మరోవైపు వర్షం కారణంగా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతుంది. పర్యటక ప్రాంతమైన మెప్పాడలో పరిస్థితి ఘోరంగా ఉంది. ఇక్కడి ముండకై ప్రాంతంలో భారీ సంఖ్యలో ప్రాణ నష్టం జరిగింది.

ఇదిలాఉంటే.. అర్థరాత్రి వేళ ప్రమాదం జరిగిన సమయంలో బాధితుల ఫోన్లు విపరీతంగా మోగినట్లు గుర్తించారు. ఫోన్ సంభాషణలు.. బాధితుల ఆక్రందనలను స్థానిక మీడియా ప్రత్యక్ష ప్రసారం చేసింది. తమను కాపాడాలంటూ ఫోన్ ల ద్వారా స్థానికులు వేడుకున్నారు. చురల్మల ప్రాంతంలోని ఓ మహిళ తమ వారికి ఫోన్ చేసి.. ఇల్లు మొత్తం శిథిలాల్లో చిక్కుకుపోయింది. అక్కడి నుంచి బయటకు లాగి ప్రాణాలు కాపాడాలని కోరుతున్నట్లు ఉంది. ఆమె బిగ్గరగా ఏడుస్తూ కాపాడండి అంటూ వేడుకుంది. పలువురు అర్థరాత్రి ప్రమాదం జరిగిన సమయంలో తమ బంధువులు, స్నేహితులకు ఫోన్లు చేసి తమ కాపాడాలని వేడుకున్నారు.

Also Read : కడుపు ఎండుతున్నా భారత్ టార్గెట్‌గా పాక్‌ కుట్రలు.. సైన్యంతో ఉగ్రవాద చర్యలు చేయిస్తూ కవ్వింపులు

కొండచరియలు విరిగిపడిన ఘటనపై రాహుల్ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమ వాళ్ళను కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కాగా.. రేపు వయనాడ్ కు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా వెళ్లనున్నారు. వయనాడ్ కొండచరియల విరిగిపడిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో సహాయక చర్యల్లో 225 మంది ఆర్మీ సిబ్బంది పాల్గొన్నారు.

Also Read : Kerala : కేరళలో తీవ్ర విషాదం.. కొండచరియలు విరిగిపడి 20మందికిపైగా మృతి.. మట్టిదిబ్బల కింద చిక్కుకున్న వందలాది మంది?

వాయనాడ్ జిల్లాలోని విపత్తు ప్రదేశంలో కీలకమైన చురల్మల వద్దనున్న వంతెన కూలిపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. అయితే, కొండచరియలు విరిగిపడటంతో ఇళ్లు, వాహనాలు భారీగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియోనుచూస్తే ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. ఈ వీడియోలో కొండచరియలు విరిగిపడటంతో ఇళ్లు, వాహనాలు, చెట్లు ధ్వంసమయ్యాయి.

కేరళను ఆదుకోవాలని రాజ్యసభలో కేంద్రానికి కేరళ ఎంపీలు విజ్ఞప్తి చేశారు. కేరళకు తక్షణం రూ. 5 వేల కోట్లు కేటాయించాలని ఎంపీలు కోరారు. వయనాడ్ విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. మరోవైపు కోజికోడ్, మలప్పురం, వాయనాడ్ కాసరగోడ్ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా పతనంతిట్ట, అలప్పుజా, కొట్టాయం, ఎర్నాకులం, ఇడుక్కి, త్రిసూర్ పాలక్కాడ్‌లలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.