Telangana Cabinet: బీసీ కోటాలో రాములమ్మ, ఓసీ కోటాలో రాజన్న..! అమాత్య ఆశలు నెరవేరేనా? ఎన్నికలవగానే మంత్రివర్గ విస్తరణ పక్కానా?
మున్నూరుకాపు సామాజిక వర్గం నుంచి ఆది శ్రీనివాస్..యాదవ సామాజిక వర్గం నుంచి బీర్ల అయిలయ్య తనకు క్యాబినెట్‌లో చోటు కల్పించాలని కోరుతున్నారు. అయితే విస్తరణకే పరిమితం అయితే మాత్రం ఈ ఇద్దరి ఆశలు నెరవేరుతాయో లేదోనన్న డైలమా కంటిన్యూ అవుతోంది.
- Naveen
- Published On : April 2, 2026 / 10:40 PM IST
- ఐదు రాష్ట్రాల ఎన్నికలు అయిపోగానే ముహూర్తం.!
- క్యాబినెట్‌లో రెండు బెర్తులు ఖాళీ..ఎందరో ఆశావహులు
- విస్తరణకే పరిమితమా? క్యాబినెట్ షఫ్లింగ్ చేస్తారా?
Telangana Cabinet: అటు ఇటు రెండున్నరేళ్ల అధికారం అయిపోతుంది. క్యాబినెట్ ఆశలతో నేతలు డ్రీమ్స్‌లోనే గడిపేస్తున్నారు. న్యూఇయర్‌లో ఆశలు నెరవేరుతాయనుకుంటే సంక్రాంతి మూఢాలు అడ్డొచ్చాయ్. ఆ తర్వాత పురపోరు బ్రేకులు వేసింది. ఇప్పుడు ఫైవ్ స్టేట్స్ ఎలక్షన్స్ తర్వాత క్యాబినెట్ విస్తరణ చేయాలని డిసైడ్ అయ్యారట. మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న ఆ రెండు బెర్తులు ఎవరికి? క్యాబినెట్ షఫ్లింగ్ జరిగేనా? విస్తరణకే పరిమితం అవుతారా?
ఐదు రాష్ట్రాల ఎన్నికలు అయిపోగానే క్యాబినెట్ విస్తరణ చేయనున్నారా? అంటే అవుననే టాక్ వినిపిస్తోంది. పూర్తిస్థాయి మంత్రివర్గ ఏర్పాటు చేసి తీరాలని అధిష్టానం డిసైడ్ అయిందంటున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఏఐసీసీ అగ్రనేతలు బిజీగా ఉన్నారు. సీఎం రేవంత్ కూడా స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్నారు. దీంతో ఫైవ్ స్టేట్స్ ఎలక్షన్ అయిపోగానే..క్యాబినెట్ విస్తరణ చేయాలని నిర్ణయించారట. అయితే క్యాబినెట్‌లో మిగిలిన రెండు మంత్రి పదవుల భర్తీకే పరిమితం అవుతారా? లేక మంత్రివర్గ ప్రక్షాళనకు అడుగులు వేస్తారా.? అనేది సస్పెన్స్‌గా మారింది.
రేసులో మహేశ్ గౌడ్, విజయశాంతి, రాజగోపాల్..
రెండు బెర్తులనే ఫిలప్ చేస్తే..ఆశావహులను ఎలా సంతృప్తి పరుస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి అమాత్య యోగం కోసం గట్టి పట్టుబడుతున్నారు. ఇక బీసీ వర్గం నుంచి కూడా పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పేరు ప్రధానంగా చర్చకు వస్తున్నా..విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, బీర్ల అయిలయ్య వంటి వారు పోటీ పడుతున్నారు. విజయశాంతి పేరు కూడా రేసులో ప్రధానంగా వినిపిస్తోంది. అయితే రెండు బెర్తుల కోసం అరడజను మంది ఆశావహులు సీరియస్‌గా ట్రై చేస్తుండటంతో ఎవరికి అవకాశం కల్పిస్తారనే ఉత్కంఠ కంటిన్యూ అవుతోంది.
సొంత ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేలా కామెంట్స్..
ఖాళీగా ఉన్న రెండు మంత్రి పదవులపై అటు రాములమ్మకు..ఇటు రాజన్న బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఈ ఇద్దరిది స్పెషల్ కాంబినేషన్. మనుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ విజయశాంతి. ఈ ఇద్దరి కల, ఆశ ఒకటే. అదే క్యాబినెట్ మినిస్టర్. అయితే అమాత్య యోగం కోసం వెయిటింగ్‌లో ఉన్న వీళ్లిద్దరు..తమకు మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్నారు. ఈ క్రమంలోనే సమయం సందర్భం దొరికినప్పుడుల్లా సొంత ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేలా కామెంట్స్ చేస్తున్నారు.
ఈ మధ్యే అటు మండలిలో రాములమ్మ, ఇటు అసెంబ్లీ రాజగోపాల్‌రెడ్డి చేసిన కామెంట్స్ అధికార కాంగ్రెస్‌ను ఇరకాటంలో పడేశాయన్న చర్చ నడుస్తోంది. వారి అసంతృప్తి చల్లార్చేందుకు హస్తం పార్టీ పెద్దలు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. రాజగోపాల్‌రెడ్డికి అధిష్టానమే హామీ ఇచ్చి ఉండటంతో ఆయనకు బెర్త్ పక్కా అంటున్నారు. ఇక లేడీ ఫైర్ బ్రాండ్‌గా..బీఆర్ఎస్‌పై బాణాలు ఎక్కు పెట్టాలంటే రాములమ్మకు మంత్రివర్గంలోకి తీసుకుంటే బాగుంటుందన్న చర్చ జరుగుతోందట.
ఇప్పటికే రెండున్నరేళ్ల పాలన పూర్తి కావొస్తోంది. ఎన్నికలకు ఇంకో రెండున్నరేళ్లే ఉన్నట్లు. ఈ అంశాన్ని దృష్టిలో క్యాబినెట్‌లో ఖాళీగా ఉన్న రెండు బెర్తుల భర్తీపై ఫోకస్ పెట్టింది. అయితే విప్‌లుగా పని చేస్తున్న వారు ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్నారు. గతంలో ఇద్దరికి ప్రమోషన్ దక్కగా..మరో ఇద్దరు కూడా అమాత్య యోగం కోసం వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నారు. విప్‌లు ఆది శ్రీనివాస్, బీర్ల అయిలయ్య ఇద్దరు కూడా మంత్రివర్గంలో ఛాన్స్ కోసం ఆశలు పెట్టుకున్నారు.
మున్నూరుకాపు సామాజిక వర్గం నుంచి ఆది శ్రీనివాస్..యాదవ సామాజిక వర్గం నుంచి బీర్ల అయిలయ్య తనకు క్యాబినెట్‌లో చోటు కల్పించాలని కోరుతున్నారు. అయితే విస్తరణకే పరిమితం అయితే మాత్రం ఈ ఇద్దరి ఆశలు నెరవేరుతాయో లేదోనన్న డైలమా కంటిన్యూ అవుతోంది. క్యాబినెట్ విస్తరణతో పాటు షప్లింగ్ చేస్తే మాత్రం ఆది శ్రీనివాస్, బీర్ల అయిలయ్యకు ప్రమోషన్ దక్కే చాన్సెస్ ఎక్కువగా ఉన్నాయంటున్నారు. అదే జరిగితే ఇప్పటికే క్యాబినెట్‌లో ఉన్నవారిలో ఎవరికి ఉద్వాసన పలుకుతారన్నది మరో చర్చ. క్యాబినెట్ ఎక్స్‌ప్యాన్షన్‌తోనే సరిపెడుతారా? లేక ప్రక్షాళన చేస్తారా అనేది చూడాలి.
Also Read: పండుగ చేసుకోండి.. పెట్రోల్, డీజిల్ దెబ్బతో వర్క్ ఫ్రమ్ హోమ్.. ఆరోజు నుంచే ఆరంభం..
