Telangana Cabinet: క్యాబినెట్‌లోకి పీసీసీ చీఫ్, పార్టీ ప్రెసిడెంట్‌గా యాష్కీ? ఇటు కాంగ్రెస్‌లో, అటు మంత్రివర్గంలో భారీ మార్పులు?

క్యాబినెట్ షఫ్లింగ్ లో భాగంగా ఒకరిద్దరు మంత్రులకు ఉద్వాసన తప్పదనే చర్చ బలంగా వినిపిస్తోంది. వారి ప్లేస్ లోకి కొత్త ముఖాలను తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారట.

  • Published On : April 8, 2026 / 09:29 PM IST
  • ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత విస్తరణకు గ్రీన్‌సిగ్నల్.!
  • రెండు బెర్తులు భర్తీ..ఇద్దరు, ముగ్గురికి ఉద్వాసన..!
  • క్యాబినెట్‌లోకి పీసీసీ చీఫ్ మహేష్‌ కుమార్‌ గౌడ్..!
  • పీసీసీ చీఫ్‌గా మధుయాష్కీ గౌడ్‌కు అవకాశం ఇస్తారని టాక్
  • మంత్రి పదవి రేసులో రాజగోపాల్‌రెడ్డి, ఆది శ్రీనివాస్, విజయశాంతి

 

Telangana Cabinet: తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు ముహుర్తం దగ్గర పడిందా? రెండు బెర్తుల భర్తీతో పాటు..ఒకరిద్దరికి ఉద్వాసనకు రంగం సిద్ధమైందా? అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. ఎప్పటి నుంచో ఊరిస్తున్న మంత్రివర్గ ప్రక్షాళనకు అధిష్టానం కూడా ఆమోదం తెలిపిందట. ఐదు రాష్ట్రాల ఎన్నికలు అయిపోగానే క్యాబినెట్ షఫ్లింగ్ చేస్తారని అంటున్నారు. కీలక మార్పులు, చేర్పులు ఉంటాయని టాక్. కొత్తగా మంత్రి పదవుల రేసులోకి వచ్చిందెవరు? పదవులు కోల్పోయేదెవరు?

ఎప్పుడెప్పుడా అని ఊరిస్తున్న క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయ్యిందట. ఇక ఆలస్యం చేయకుండా క్యాబినెట్‌లో మిగిలిపోయిన మంత్రి పదవులను భర్తీ చేయాలని రాష్ట్ర పెద్దలతో పాటు పార్టీ అధిష్టానం కూడా డిసైడ్ అయ్యిందట. మంత్రివర్గంలో సీఎంతో పాటు మొత్తం 18 మందికి ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతం సీఎంతో కలిపి 16 మంది ఉన్నారు. మరో రెండు క్యాబినెట్ బెర్తులు ఖాళీగా ఉన్నాయి. అయితే ఈ రెండు స్థానాల కోసం కాంగ్రెస్ పార్టీలో అరడజను మంది నేతలు పోటీ పడుతున్నారు. అన్ని సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని మిగిలిన రెండు స్థానాలతో పాటు క్యాబినెట్ ప్రక్షాళన కూడా చేయాలని భావిస్తున్నారట. ఇప్పటికే దాదాపు రెండున్నరేళ్ల పదవీకాలం పూర్తికాగా… వచ్చే జనరల్ ఎలక్షన్స్ ను దృష్టిలో పెట్టుకొని విస్తరణకు సీఎం సిద్దమవుతున్నారట. అందుకే ఈసారి క్యాబినెట్లోకి కొత్త ముఖాలు..అందులోనూ ఊహించని ట్విస్టులు ఉంటాయనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.

సీఎంకు హైకమాండ్ ఫ్రీ హ్యాండ్..!

క్యాబినెట్ షఫ్లింగ్ లో భాగంగా ఒకరిద్దరు మంత్రులకు ఉద్వాసన తప్పదనే చర్చ బలంగా వినిపిస్తోంది. వారి ప్లేస్ లోకి కొత్త ముఖాలను తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారట. పరిపాలనను మరింత సమర్థవంతంగా పరుగులు పెట్టించాలంటే..తనకు అనుకూలమైన టీమ్ కావాలని సీఎం కోరుతున్నారట. వచ్చే ఎన్నికల్లో మరోసారి పార్టీని అధికారంలోకి తీసుకురావాలంటే కాస్త ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని కూడా హైకమాండ్ ను రిక్వెస్ట్ చేశారట. అధిష్టానం కూడా పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా సీయంకు ఈసారి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేందుకు సుముఖంగా ఉందని తెలుస్తోంది. అందుకే క్యాబినెట్ ప్రక్షాళనలో భాగంగా..సోషల్ ఈక్వేషన్స్ ను పరిగణలోకి తీసుకోవాలని భావిస్తోందట.

క్యాబినెట్ లోకి పీసీసీ చీఫ్..?

ముఖ్యంగా బీసీలకు పెద్దపీట వేయాలని పార్టీ జాతీయ స్థాయిలో ఒక నిర్ణయం తీసుకుందని అంటున్నారు. అందుకే బీసీలకు కూడా డిప్యూటీ సీఎం అవకాశం ఇవ్వాలని యోచిస్తోందట. ఈ కీలకమైన పోస్టును ప్రస్తుతం పీసీసీ చీఫ్ గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ కు ఇవ్వాలని పార్టీ అధిష్టానం డిసైడ్ అయినట్లు గాంధీభవన్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. పీసీసీ చీఫ్ గా ఉన్న మహేష్ గౌడ్ కు డిప్యూటీ సీఎంగా ఛాన్స్ ఇవ్వడంతో పాటు..ప్రభుత్వ విప్ గా ఉన్న ఆది శ్రీనివాస్ కు ప్రమోషన్ దక్కే ఛాన్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే రెడ్డి కోటాలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి, ఎస్టీ లంబాడ సామాజిక వర్గానికి చెందిన మరో ఎమ్మెల్యేను క్యాబినెట్ లోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు టాక్ నడుస్తోంది. అలాగే అధిష్టానం ఆశీస్సులతో ఫైర్ బ్రాండ్ రాములమ్మ కూడా రేసులో ఉన్నట్లు తెలుస్తోంది

పీసీసీ రేసులో బలంగా వినిపిస్తున్న మధుయాష్కీ గౌడ్ పేరు..

డిప్యూటీ సీఎంగా మహేష్ గౌడ్ మంత్రివర్గంలోకి చేరితే.. అనివార్యంగా పీసీసీ చీఫ్ పోస్ట్ కు రాజీనామా చేయాల్సి వస్తోంది. మహేష్ గౌడ్ పదవి నుంచి తప్పుకుంటే.. పీసీసీ పోస్ట్ ఎవరికనే చర్చ కూడా పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. ఇంటర్నల్ గా జరుగుతున్న ఈ పరిణామాల నేపథ్యంలో కొందరు సీనియర్ నేతలు తమకు పీసీసీ ప్రెసిడెంట్ గా అవకాశం ఇవ్వాలని..అధిష్టానం పెద్దలతో లాబీయింగ్ చేస్తున్నారట. పీసీసీ చీఫ్ కోసం ఒకరిద్దరి పేర్లను పార్టీ అధిష్టానం చర్చిస్తోందట. ముఖ్యంగా అధిష్టానానికి సన్నిహితుడైన మధుయాష్కీ గౌడ్ పేరు బలంగా వినిపిస్తోంది. గతంలో రెండుసార్లు ఎంపీగా పనిచేసిన మధుయాష్కీ..గత జనరల్ ఎలక్షన్స్ లో ఎల్బీనగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి కాస్త సైలెంట్ గా ఉంటున్న మధుయాష్కీ.. పీసీసీ చీఫ్ కోసం గతంలో గట్టి ప్రయత్నాలు చేశారు. కానీ అప్పటి పరిస్థితుల నేపథ్యంలో మహేష్ గౌడ్ వైపు అధిష్టానం మొగ్గు చూపింది.

ఇప్పుడు మంత్రివర్గంలోకి మహేష్ గౌడ్ వెళ్తే..ఆ పోస్టు వివాదరహితుడైన మధుయాష్కీని వరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు జోరుగా చర్చ జరుగుతోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత మంత్రివర్గ ప్రక్షాళన చేస్తారని..మే రెండో వారంలో క్యాబినెట్ షఫ్లింగ్ ఉంటుందనే చర్చ బలంగా నడుస్తోంది. ఏప్రిల్ 30 నాటికి అజారుద్దీన్ వ్యవహారం కూడా కొలిక్కి రానుందట. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ కన్ఫర్మ్ కాకపోతే.. ఏప్రిల్ 30 లోపు రాజీనామా చేయించి..మే రెండో వారంలో జరిగే క్యాబినెట్ విస్తరణలో ఆయనతో మరోసారి ప్రమాణస్వీకారం చేయిస్తారట. మొత్తం మీద మే రెండో వారంలో అటు తెలంగాణ కాంగ్రెస్ లో..రాష్ట్ర క్యాబినెట్ లో భారీ మార్పులు ఖాయమనే ప్రచారం అయితే నడుస్తోంది. మరి ఈసారైనా మంత్రివర్గ విస్తరణ, ప్రక్షాళన పక్కానా? జస్ట్ లీకులేనా అనేది వేచి చూడాలి.

Also Read: హైదరాబాద్ వాహనదారులకు అలర్ట్.. ఆ ప్రాంతంలో ఏకంగా ఏడాది పాటు ట్రాఫిక్ డైవర్షన్స్..