Delimitation: నియోజకవర్గాలు పెరిగితే ఏపీలో ఎవరికి లాభం? కూటమికి ప్లస్ అవుతుందా, వైసీపీకి ఎదురయ్యే సవాళ్లేంటి?

కేంద్రం నిర్ణయంతో ఏపీలో ఓవరాల్‌గా 88 అసెంబ్లీ సీట్లు.. 13 వరకు పార్లమెంటు స్థానాలు పెరుగుతాయ్‌. ఇది కూటమికి ప్లస్‌ కాగా.. వైసీపీకి సవాల్‌గా మారే అవకాశాలు ఉంటాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.

  • Published On : March 24, 2026 / 09:25 PM IST
  • నియోజకవర్గాల పునర్విభజనకు సన్నాహాలు!
  • 263కు పెరగనున్న 175 అసెంబ్లీ స్థానాలు..
  • 38కి పెరగనున్న 25 లోక్‌సభ స్థానాలు….
  • నియోజకవర్గాలు పెరిగితే ఏపీలో ఎవరికి లాభం?
  • అధికార పార్టీకి భారీ ప్లస్ అయ్యే చాన్స్ ఉందా?

 

Delimitation: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నియోజకవర్గాల పునర్విభజనకు.. ఎట్టకేలకు అడుగులు పడుతున్నాయ్‌. లోక్‌సభ స్థానాలతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ సీట్లను 50శాతం మేర పెంచాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ డెసిషన్‌ ఏపీ రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు కారణం అవుతోంది. ఆంధప్రదేశ్‌లో లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు భారీగా పెరగడం ఖాయం. మరి ఇది ఎవరికి లాభం.. అధికార కూటమికి ప్లస్ అవుతుందా.. వైసీపీ పరిస్థితేంటి..

రాష్ట్ర విభజన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య పెంచే అవకాశాలను కేంద్రం పరిశీలిస్తుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. 2011 జనాభా లెక్కల ఆధారంగా దేశవ్యాప్తంగా అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలను 50శాతం పెంచాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయ్‌. దీంతో మొత్తం లోక్‌సభ స్థానాలు 816కు.. అన్ని రాష్ట్రాల్లో కలిపి అసెంబ్లీ స్థానాలు 6వేల 185కు పెరిగే అవకాశాలు ఉన్నాయ్‌. కేంద్రం నిర్ణయంతో ఏపీ రాజకీయాల్లో ఆసక్తి కనిపిస్తోంది. నియోజకవర్గాల పునర్విభన తర్వాత.. ఏపీలో ప్రస్తుతం ఉన్న 175 ఎమ్మెల్యే స్థానాలు 263కి పెరుగుతాయని అంచనా. 25 లోక్‌సభ స్థానాలు.. 38కి పెరిగే చాన్స్ ఉంటుంది. ఇదే ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాలు పెరిగితే లాభం ఎవరికి.. అధికార కూటమికి ప్లస్ అవుతుందా.. వైసీపీకి కలిసి వస్తుందా అనే చర్చ జరుగుతోంది.

సీట్లు పెరిగితే అధికార కూటమికే ప్లస్..! ఎలా అంటే..

కేంద్రం నిర్ణయంతో ఏపీలో అసెంబ్లీ సీట్లు భారీగా పెరిగితే.. అది అధికార కూటమికి ప్లస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయ్‌. అధికారంలో ఉన్న కూటమి పునర్విభజనను తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం 175 సీట్లలో 164 సాధించిన కూటమి.. 263 సీట్లలో 135 మ్యాజిక్ ఫిగర్‌ను ఈజీగా చేరుకుంటుందని అంచనా. ఇదంతా ఎలా ఉన్నా.. సీట్ల సర్దుబాటు ఈజీ అవుతుంది. ప్రస్తుతం కూటమిలో టీడీపీతో పాటు.. జనసేన, బీజేపీ భాగస్వాములుగా ఉన్నాయ్‌. 2024 ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు సవాల్‌గా మారింది. దీంతో చాలాచోట్ల అసంతృప్తులు కనిపించాయ్. ఐతే ఇప్పుడు సీట్లు పెరిగితే.. ఆ సమస్యకు చెక్ పెట్టే అవకాశం ఉంటుంది. కూటమి పార్టీల మధ్య మరింత ఐక్యత పెరిగే అవకాశం ఉంటుంది. ఇక అటు పెరిగిన నియోజకవర్గాలతో పొత్తులో భాగంగా జనసేనతో పాటు బీజేపీకి కూడా ప్రాతినిధ్యం పెరగడం ఖాయం. ఓవరాల్‌గా నియోజకవర్గాల పెంపు అనేది.. కూటమికి ప్రయోజనం కావడం ఖాయంగా కనిపిస్తోంది.

గెలుపు గుర్రాలను ఎంపిక చేయడం వైసీపీకి సవాల్‌!

కేంద్రం నిర్ణయంతో ఏపీలో ఓవరాల్‌గా 88 అసెంబ్లీ సీట్లు.. 13 వరకు పార్లమెంటు స్థానాలు పెరుగుతాయ్‌. ఇది కూటమికి ప్లస్‌ కాగా.. వైసీపీకి సవాల్‌గా మారే అవకాశాలు ఉంటాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. ఎన్నికలకు ముందు.. ఎన్నికల తర్వాత చాలామంది నేతలు ఫ్యాన్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఐతే ఇప్పుడు నియోజకవర్గాలు పెరిగితే.. పెరిగిన సీట్లలో అభ్యర్థులను నిలబెట్టడం.. గెలుపు గుర్రాలను ఎంపిక చేయడం వైసీపీకి సవాల్‌గా మారే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. మహిళా రిజర్వేషన్లు, సమర్థుల కొరత ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. తమ పార్టీకి గుడ్‌బై చెప్పి కూటమి పార్టీల్లోకి వెళ్లిపోయిన నేతలు.. ఏదోరోజు తిరిగి రావడం ఖాయం అనే ఆలోచన వైసీపీలో కనిపించేది. ఐతే ఇప్పుడు నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుండడంతో.. కూటమిలో చేరిన నేతలు అంతా అక్కడే ఫిక్స్ అయ్యే చాన్స్ ఉంది.

అప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు కూటమి..అదే పని చేయడం ఖాయం..!

2009లో చివరిసారిగా నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. కేంద్రంలో యూపీఏ రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు.. ఏపీలో కాంగ్రెస్ రెండోసారి విజయం సాధించేందుకు అప్పట్లో నియోజకవర్గాల పునర్విభజన బాగా ప్లస్ అయింది. అప్పట్లో ఏపీలో టీడీపీ ప్రతిపక్షంలో ఉండేది. సైకిల్‌ పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాలను.. పునర్విభజనలో భాగంగా విభజించారు. ఇప్పుడు కూడా కూటమి అదే పని చేయడం ఖాయం అనే అంచనాలు వినిపిస్తున్నాయ్‌. వైసీపీకి బలమైన నియోజకవర్గాలను ఎంపిక చేసుకుని విభజించే అవకాశాలు లేకపోలేదు. ఇలా.. ఎలా చూసినా.. నియోజకవర్గాల పునర్విభజన కూటమికి ప్లస్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.

Also Read: మీ సిగరెట్ డబ్బులను SIPలో పెడితే లక్షల్లో సంపాదన.. ఈ లెక్కలు చూస్తే లైఫ్‌లో మళ్లీ స్మోకింగ్ చేయరు!