Jeevan Reddy
Jeevan Reddy: అసంతృప్తి, నిరసన తెలపడం అయిపోయింది. ఫ్రస్ట్రేషన్ పీక్ లెవల్ దాటి.. నెక్స్ట్ లెవల్‌కు కూడా వెళ్లింది. ఇక క్లైమాక్స్‌కు వచ్చేసింది జగిత్యాల పొలిటికల్ ఎపిసోడ్. అంతా క్లియర్ కట్..ఔట్ రైట్ డెసిషన్ మాత్రమే మిగిలింది అంటున్నారట మాజీమంత్రి జీవన్‌రెడ్డి. మంత్రుల ముందే నిరసన..గాంధీభవన్‌లో జరిగిన సమీక్షలోనూ ప్రొటెస్ట్ చేసి చేయాల్సిన రచ్చ అంతా చేసేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాకను ముందు నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్న జీవన్‌రెడ్డి..మున్సిపల్ ఎన్నికల్లో హస్తం గుర్తును పక్కనబెట్టి మరీ వేరే ఏవేవో గుర్తులకు ఓటేయాలంటూ ప్రచారం చేశారు కూడా. ఇక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండే పరిస్థితి కనిపించట్లేదంటున్నారు. త్వరలోనే ఆయన సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు. జీవన్‌రెడ్డి హస్తం పార్టీకి గుడ్‌బై చెప్పడం ఖాయమేనా? కాంగ్రెస్‌ను వీడితే ఆయన నెక్స్ట్ స్టెప్ ఎటువైపు?
ప్రజా పాలనలో మనం ఎలాగూ భాగస్వాములం కాదు. ఇక ప్రజల పక్షానే ఉందాం అంటున్నారట జగిత్యాల మాజీ ఎమ్మెల్యే, సీనియర్ కాంగ్రెస్ లీడర్ జీవన్‌రెడ్డి. ఇక ఇదే లైన్‌లో ముందుకెళ్దామంటూ తన అనుచరులకు డైరెక్షన్స్ ఇచ్చేస్తున్నారట. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన సంజయ్..కాంగ్రెస్‌లో చేరడం..అప్పటి నుంచి అన్నింటా ఆయన మాటే చెల్లుబాటు అవుతుండటంపై ఎప్పటినుంచో తీవ్ర అసంతృప్తిగా ఉన్న జీవన్‌రెడ్డి..ఇక తాడోపేడో అనేందుకు సిద్దమౌతున్నారనే టాక్ నడుస్తోంది.
ఏడాదిన్నరగా ఆయన నిరసనలు, అసంతృప్తి రాగం కంటిన్యూ అవుతూనే ఉంది. జంపింగ్‌లను ప్రోత్సహించడంపై రాష్ట్ర నాయకత్వం తీరును నిరసిస్తూ ఇప్పటికే ఓసారి ఏఐసీసీకి లేఖ రాశారు. ఆ తర్వాత సీఎం రేవంత్‌కు బహిరంగ లేఖ రాసి చర్చకు దారితీశారు. ఇప్పుడు మరోసారి మేడిగడ్డ బ్యారేజీపై సీఎంకు ఓపెన్ లెటర్ రాశారు జీవన్‌రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్ట్ పునరుద్ధరణ పనులు చేపట్టి తుమ్మడి హట్టి దగ్గర బ్యారేజీ నిర్మాణం చేపట్టాలని..ఇందుకోసం 10 కోట్లు కేటాయించాలని రేవంత్‌రెడ్డిని కోరారు.
ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తే తెలంగాణలోని సగం ప్రాంతానికి సాగు, తాగునీరు అందుతుందని..మూసీకి కూడా నీళ్లు అందించే అవకాశం ఉంటుందన్నారు. మేడిగడ్డ బ్యారేజీని కూడా బాగు చేయాలని ప్రతిపక్ష నేత పాత్రను పోషిస్తూ సీఎంకు లెటర్ రాసి చర్చకు దారితీశారాయన. కాళేశ్వరం అవినీతిపై తప్పితే..రిపేర్లపై పెద్దగా ఏ కాంగ్రెస్ నేత మాట్లాడటం లేదు. ఈ సమయంలో జీవన్‌రెడ్డి రాసిన లేఖ కలకలం రేపుతోంది.
ప్రస్తుత పరిస్థితుల్లో తాను కాంగ్రెస్ పార్టీలో కొనసాగటంపై ఆలోచించుకోవాల్సిన పరిస్థితి నెలకొందని ఓపెన్‌గానే ప్రకటించేశారు జీవన్‌రెడ్డి. అందరి ఆలోచనలు తీసుకోకుండా తాను ఇప్పుడే ఏ నిర్ణయం తీసుకోనని..అయితే అందరి ఆలోచనలకు అనుగుణంగానే తన నిర్ణయం ఉంటుందంటూ నర్మగర్భంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. హస్తం పార్టీకి గుడ్‌బై చెప్పాలని జీవన్‌రెడ్డి ఇప్పటికే డిసైడ్ అయినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో తన మనుషులకు టికెట్లు దక్కకపోవడం..ఎమ్మెల్యే వర్గానికి ఎక్కువ టికెట్లు ఇవ్వడం..సొంతంగా తన అభ్యర్థులను పోటీకి పెట్టి గెలిపించుకోవడం ఇవన్నీ జరిగిపోయాయి. చివరకు ఛైర్మన్ నియామకంలోనూ తన మాటకన్నా ఎమ్మెల్యే సంజయ్‌కే పార్టీ జైకొట్టిందంటూ అప్పుడే అసహనం వ్యక్తం చేశారు జీవన్ రెడ్డి.
ఈ క్రమంలో తన అసంతృప్తిని గమనించి.. సీనియారిటీని గుర్తించి అధిష్టానం పెద్దలైనా తనను పిలిచి మాట్లాడుతారని భావించారట. కానీ ఆయన ఊహించినట్లుగా ఏం జరగట్లేదట. పైగా రాష్ట్ర నేతలు ఎవరైనా టచ్‌లోకి వచ్చి సర్ధి చెప్తారేమోనని కూడా వెయిట్ చేస్తే అది కూడా జరుగకపోవడం జీవన్‌రెడ్డి వర్గాన్ని నైరాశ్యంలోకి నెట్టిందనే టాక్ నడుస్తోంది. గాంధీభవన్ వేదికగా రచ్చ చేయడం..మంత్రుల పర్యటనల్లో తన అసంతృప్తిని వినిపించడంతో..రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు ఆయన తీరుపై కాస్త సీరియస్‌గా ఉన్నారట. పైగా జీవన్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కూడా భావించారట.
కానీ సీనియర్ నేత..ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటే తప్పుడు సంకేతాలు వెళ్తాయని..పైగా జీవన్‌రెడ్డికి సానుభూతి పెరిగే అవకాశం ఉంటుందని ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండిపోతున్నారట. అయితే అటు పార్టీ పెద్దలు పిలిచి మాట్లాడకపోవడం ఒక ఎత్తు అయితే..తన నిరసనలకు కూడా ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో జీవన్‌రెడ్డికి మరింత ఆగ్రహం తెప్పిస్తుందట. ఈ క్రమంలోనే ఆయన కాంగ్రెస్ పార్టీని వీడాలని డిసైడ్ అయినట్లు ఇన్ సైడ్ టాక్.
జీవన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడితే..ఆయన రాజకీయ అడుగులు ఎటువైపు అనేది చర్చనీయాంశంగా మారనుంది. మరో వారం పది రోజుల్లోనే జీవన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి బైబై చెప్పేస్తారని అంటున్నారు. ఈలోపే తన అసంతృప్తి పూర్తి స్థాయిలో వెళ్లగక్కి..రాష్ట్ర నేతలను తీరు ఎండిగట్టి కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్తున్నట్లు ప్రకటించాలని ఆయన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఆ తర్వాత ఏ పార్టీలోకి వెళ్లకుండా పబ్లిక్ వాయిస్‌గా..ప్రజల తరఫున గళం వినిపించాలనేది జీవన్‌రెడ్డి ఆలోచనగా చెబుతున్నారు.
వచ్చే ఎన్నికల దాకా ఏ పార్టీలో చేరకుండా..జనం పక్షాన ఉండాలని ఆయన భావిస్తున్నారట. రాబోయే ఎన్నికల నాటికి అప్పుటి పరిస్థితులు, పొలిటికల్ ఈక్వేషన్స్‌ను బట్టి తన కోడలు లేక కుమారుడిని..పాలిటిక్స్‌లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట. సిచ్యువేషన్‌ను బట్టి తాను ఏ పార్టీలో చేరకుండా..తన కుటుంబ సభ్యులను మాత్రం బీఆర్ఎస్ లేకపోతే బీజేపీ నుంచి పోటీ చేయించే ప్లాన్ చేస్తున్నారని గుసగుసలు విన్పిస్తున్నాయి. అప్పటివరకు నిత్యం ప్రజల్లో ఉండాలనేది జీవన్‌రెడ్డి ఆలోచనగా చెబుతున్నారు. ఉగాది నాటికే దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం మాత్రం కన్పిస్తోంది. జీవన్‌రెడ్డి అడుగులు ఎటువైపు పడుతాయో చూడాలి?