Apara Ekadashi 2026 : అపర ఏకాదశి 2026… అపారమైన డబ్బు కోసం.. తులసి మొక్కకు ఈ ఒక్కటి సమర్పిస్తే.. !
Apara Ekadashi 2026 : అపర ఏకాదశి నాడు తులసికి ఈ ఒక్కటి సమర్పిస్తే అపార ఐశ్వర్యం
- Dharani Pilli
- Updated on- May 10, 2026 / 09:58 PM IST
Apara Ekadashi 2026 For Infinite Wealth Offer saffron to the Tulsi Plant
Apara Ekadashi 2026 : హిందూ ధర్మంలో ఏకాదశి తిథిని పరమ పవిత్రంగా భావిస్తారు. చాలా మంది ఏకాదశి వ్రతాన్ని పాటిస్తారు. అంటే ఏకాదశి నాడు తప్పకుండా ఉపవాసం ఉంటారు. అలానే ప్రతి నెలా రెండు ఏకాదశి తిథులు వస్తాయి. అయితే వీటిల్లో కొన్ని ఏకాదశి తిథులు చాలా శక్తివంతమైనవి.. ప్రత్యేకమైనవి కూడా. అలాంటి అత్యంత శక్తివంతమైన ఏకాదశి తిథే అపర ఏకాదశి. అపారమైన పుణ్యఫలం అందించే తిథి.
ప్రతి ఏటా వైశాఖ మాసం, కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని ‘అపర ఏకాదశి’ లేదంటే ‘అచల ఏకాదశి’ అని పిలుస్తారు. ‘అపర’ అంటే అపారమైన అని అర్థం. అంటే ఈ అపర ఏకాదశి రోజున భక్తితో పూజలు చేసే వారికి అపారమైన పుణ్యఫలాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. మరి ఈ 2026 సంవత్సరంలో అపర ఏకాదశి ఎప్పుడు వచ్చిందంటే.. మే 13వ తేదీ, బుధవారం నాడు ఈ అపర ఏకాదశి పర్వదినం వచ్చింది.
అపారమైన పుణ్యాన్ని ప్రసాదించే ఆ అపర ఏకాదశి నాడు శ్రీమహావిష్ణువును, లక్ష్మీదేవిని ఆరాధించడంతో పాటు తులసి పూజ చేయడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయని.. అనంతమైన పుణ్యం లభిస్తుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. అయితే, ఏకాదశి నాడు తులసి పూజ విషయంలో కొన్ని కఠిన నియమాలు ఉన్నాయి. అవేంటంటే ఏకాదశి నాడు తులసి కోయకూడదు, తాకకూడదు.. అలానే తులసి చెట్టుకు నీరు కూడా పోయకూడదు.
ఏకాదశి తిథి ఎప్పుడంటే
పంచాంగం ప్రకారం:
- ఏకాదశి తిథి ప్రారంభం: మే 12వ తేదీ మధ్యాహ్నం 2:52 గంటలకు.
- ఏకాదశి తిథి ముగింపు: మే 13వ తేదీ మధ్యాహ్నం 1:29 గంటలకు.
సూర్యోదయ తిథిని ప్రామాణికంగా తీసుకునే సంప్రదాయం ప్రకారం, మే 13వ తేదీ బుధవారం నాడు భక్తులు ఏకాదశి ఉపవాస వ్రతాన్ని ఆచరించాలి. ద్వాదశి నాడు విరమించాలి. ఈ రోజున చేసే విష్ణు నామ స్మరణ కోటి రెట్లు ఫలితాన్నిస్తుందని నమ్మకం. అపర ఏకాదశి నాడు కొన్ని పరిహారాలు చేస్తే ఆర్థిక సమస్యలు తొలగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని, అప్పుల బాధ నుంచి బయటపడతారని పండితులు చెబుతున్నారు.
ఐశ్వర్యం కోసం
ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే వారు అపర ఏకాదశి నాడు కొన్ని ప్రత్యేక పరిహారాలు పాటిస్తే ఆర్థిక సమస్యలు తొలగి అపార సిరిసంపదలు దక్కుతాయని పండితులు చెబుతున్నారు.
- కుంకుమపువ్వుతో అర్చన: అపర ఏకాదశి నాడు తులసి మొక్కకు కుంకుమపువ్వు (Saffron) సమర్పించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇది ఇంట్లోని దరిద్రాన్ని తొలగించి, ధన ప్రాప్తికి మార్గాలను సుగమం చేస్తుంది.
- దీపారాధన: అపర ఏకాదశి నాడు సాయంత్రం వేళ తులసి కోట వద్ద ఆవు నెయ్యితో దీపం వెలిగించి, 11 సార్లు ప్రదక్షిణలు చేయాలి.
- మంత్ర జపం: “ఓం నమో భగవతే వాసుదేవాయ” అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగిపోయి ప్రశాంతత చేకూరుతుంది.
