Mahalaya Amavasya 2026 : ఈరోజే మహాలయ అమావాస్య.. పితృస్మరణతో పాటు ఈ దానాలు చేయడం మర్చిపోకండి!
Mahalaya Amavasya 2026 : మహాలయ అమావాస్య 2026 అక్టోబర్ 10న వచ్చింది. పితృదేవతల స్మరణ, తర్పణం, శ్రాద్ధకర్మలు, పిండప్రదానం, అన్నదానం ప్రాధాన్యతతో పాటు స్వయంపాకం, పితృకార్యాలు చేయలేనివారికి ప్రత్యామ్నాయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
- Sreehari A
- Published on- October 10, 2026 / 10:54 AM IST
Mahalaya Amavasya 2026
- పితృదేవతల అనుగ్రహం కోసం ఈ పనులు చేయండి
- మహాలయ అమావాస్య వేళ.. పితృకార్యాలు చేయలేకపోతే ఇలా చేయండి
- తర్పణం నుంచి అన్నదానం వరకు.. తెలుసుకోవాల్సిన విషయాలివే
Mahalaya Amavasya 2026 : హిందూ సంప్రదాయంలో మహాలయ అమావాస్యకు ఎంతో ప్రత్యేకత ఉంది. పూర్వీకులను స్మరించుకుంటూ వారి పట్ల కృతజ్ఞతను చాటుకునే ఈ పవిత్రమైన రోజును పితృకార్యాలకు అత్యంత అనుకూలమైన తిథిగా భావిస్తారు.
2026లో మహాలయ అమావాస్య అక్టోబర్ 10, శనివారం వచ్చింది. ఈ సందర్భంగా తర్పణాలు, శ్రాద్ధకర్మలు, పిండప్రదానం, దానధర్మాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. మహాలయ అమావాస్య ప్రత్యేకత ఏంటి? ఏయే ఆచరాలను పాటించాలి? అనేది పూర్తి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
మహాలయ అమావాస్య ప్రత్యేకత ఏంటి? :
భాద్రపద మాసంలో కృష్ణ పక్షం ముగిసే రోజున వచ్చే అమావాస్యను మహాలయ అమావాస్యగా పిలుస్తారు. మహాలయ పక్షం రోజులలో పూర్వీకులను స్మరించుకోవడం, వారి పేరుతో పితృకార్యాలు చేయడం సంప్రదాయంగా వస్తోంది. ఈ సమయంలో సమర్పించే తర్పణాలు, పిండప్రదానాల వల్ల పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయని అందరూ విశ్వసిస్తారు.
తప్పక పాటించాల్సిన ఆచారాలివే :
మహాలయ అమావాస్య రోజున కుటుంబ సంప్రదాయాలను పాటిస్తూనే జలతర్పణం, నువ్వులతో తిలతర్పణం, శ్రాద్ధకర్మలు, పిండప్రదానం చేయొచ్చు. పూర్వీకుల పేరుతో అన్నదానం, వస్త్రదానం వంటి సేవా కార్యక్రమాలు చేయొచ్చు. పవిత్ర నదీ తీరంలో లేదంటే మీకు అనువైన ప్రదేశంలో తర్పణం సమర్పించవచ్చు. స్థానిక సంప్రదాయాలను పాటించవచ్చు.
స్వయంపాకం ఏంటి? :
శ్రాద్ధకర్మలను పూర్తిస్థాయిలో చేయడం సాధ్యం కానివారు తమ కుటుంబ ఆచారాల ప్రకారం బ్రాహ్మణులకు బియ్యం, పప్పులు, కూరగాయలు వంటి నిత్యావసర సరుకులను దానం చేయొచ్చు. దాన్ని కూడా స్వయంపాకంగా భావించవచ్చు. పరిస్థితులను బట్టి దక్షిణ, తాంబూలాలు సమర్పించడం, నిరుపేదలకు భోజనం పెట్టడం వంటి దానధర్మాలు కూడా చేయొచ్చు.
శ్రాద్ధం చేయలేకపోతే.. :
అనారోగ్యం, దూరప్రాంతాల్లో నివాసం, ఇతర అనివార్య కారణాల వల్ల పితృకార్యాలు చేయలేనివారు నిరాశ చెందాల్సిన పనిలేదు. కుటుంబ సభ్యుల సాయంతో ఆచారాలను పాటించవచ్చు. విదేశాల్లో ఉన్నవారు సైతం పూర్వీకులను మనస్ఫూర్తిగా స్మరించుకోవచ్చు.
మహాలయ అమావాస్య అనేది పూర్వీకుల పట్ల కృతజ్ఞత, గౌరవానికి ప్రతీకగా భావిస్తారు. భారీ ఖర్చులతో శక్తికి తగిన విధంగా సేవా కార్యక్రమాలు చేపడతారు. కుటుంబ ఆచారాలను పాటిస్తారు. ఈ పర్వదినానికి ఇదే అసలైన స్ఫూర్తి. సంప్రదాయాల ప్రకారం.. పూజలు, తర్పణాలు నిర్వహించేవారు స్థానిక పండితుల సూచనలను పాటించవచ్చు.
