Padmini Ekadashi 2026 : అధిక మాసంలో అత్యంత పవిత్రమైన పద్మిని ఏకాదశి.. తేదీ, పూజా విధానం ప్రాముఖ్యత..!
Padmini Ekadashi 2026 : అధిక మాసంలో అత్యంత పవిత్రమైన పద్మిని ఏకాదశి వస్తుంది. తేదీ, పూజా సమయం, పాటించాల్సిన నియమాలు వంటి వివరాలు..
- Dharani Pilli
- Updated on- May 25, 2026 / 10:04 PM IST
Padmini Ekadashi 2026 on May 26 or 27 Puja Timings Fasting Rules and Spiritual Significance
Padmini Ekadashi 2026 : హిందువులు అధిక మాసాన్ని చాలా పవిత్రమైన కాలంగా భావిస్తారు. విష్ణుమూర్తికి అధిక మాసం అంటే ఎంతో ప్రీతి అని నమ్ముతారు. అయితే ఈ అధిక మాసం ఎందుకు వస్తుంది అంటే.. హిందూ పంచాంగాన్ని సూర్యుడు, చంద్రుని గమనాల ఆధారంగా రూపొందిస్తారు. ఇలా సూర్య, చంద్రుల గమనాల గణనల మధ్య వచ్చే కాలాంతరాన్ని సమతుల్యం చేయడానికి ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి అదనపు నెలను చేర్చుతారు. ఆ నెలనే అధిక మాసం లేదా మలమాసం అని పిలుస్తారు. దీన్నే ‘పురుషోత్తమ మాసం’ అని కూడా అంటారు.
ఇదిలా ఉంటే, ఏకాదశి తిథిని కూడా పరమ పవిత్రంగా భావిస్తారు. నెలకు రెండు సార్లు వచ్చే ఏకాదశి తిథి నాడు చాలా మంది పచ్చి మంచి నీళ్లు కూడా తీసుకోకుండా ఉపవాసం ఉంటారు. అంత పవిత్రమైన ఏకాదశి తిథి.. విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన అధిక మాసంలో వస్తే, దాన్ని మరింత విశిష్టంగా భావిస్తారు. ఈ క్రమంలో అధిక మాసంలో వచ్చే ఈ ఏకాదశిని ‘పద్మిని ఏకాదశి’ అని పిలుస్తారు. దీనికి హిందూ సంప్రదాయంలో ఎంతో పవిత్రత, ప్రత్యేకత, విశిష్ట స్థానం ఉంది.
ఈ ఏకాదశిని పురుషోత్తమ ఏకాదశి, అధిక మాస ఏకాదశి, మలమాస ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ పవిత్రమైన రోజున భక్తులు ఉపవాసం ఉండి నిష్టగా, భక్తిశ్రద్ధలతో విష్ణుమూర్తిని పూజిస్తే.. కచ్చితంగా ఆయన కటాక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. మరి ఇంతటి పవిత్రమైన పద్మిని ఏకాదశి ఎప్పుడు వస్తుంది.. పూజా సమయం, పాటించాల్సిన నియమాలు ఇక్కడ చూద్దాం:
పద్మిని ఏకాదశి 2026 ఎప్పుడంటే..
- ఏకాదశి తిథి ప్రారంభం: 2026 మే 26వ తేదీ ఉదయం 7:49 గంటలకు.
- ఏకాదశి తిథి ముగింపు: మే 27వ తేదీ ఉదయం 7:55 గంటలకు.
- వ్రత దినం: తిథి నియమాల ప్రకారం 2026 మే 27వ తేదీన (బుధవారం) పద్మిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి.
పూజకు శుభ సమయం
మే 27వ తేదీ, బుధవారం ఉదయం 5:25 గంటల నుంచి 8:52 గంటల వరకు పూజ చేసుకోవచ్చని పండితులు చెబుతున్నారు.
ఉపవాస విరమణ సమయం (పారణ)
పద్మిని ఏకాదశి వ్రతాన్ని మే 28వ తేదీన అంటే గురువారం ఉదయం 5:25 గంటల నుంచి 7:56 గంటల మధ్య విరమించాలి.
రావణుడితో పద్మిని ఏకాదశి సంబంధం
హిందూ పురాణాల ప్రకారం, కార్తవీర్యార్జునుడు అనే మహా వీరుడు ఈ పద్మిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడని చెబుతారు. ఈ వ్రతం ఆచరించడం వల్ల అతడికి అపారమైన శక్తి లభించి.. లంకేశ్వరుడైన రావణాసురుడిని సైతం బంధించగలిగాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ తర్వాత అతడు పరశురాముడి చేతిలో మోక్షం పొందినట్లు పురాణాల్లో పేర్కొన్నారు.
పద్మిని ఏకాదశి ప్రాముఖ్యత
- పద్మిని ఏకాదశి వ్రతం పాటిస్తే.. జీవితంలో సుఖసంతోషాలు, ఐశ్వర్యం, అదృష్టం కలిసి వస్తాయని నమ్ముతారు.
- చాలా మంది సంతాన సౌభాగ్యం కోసం, దాంపత్య జీవితంలో సమస్యల పరిష్కారం కోసం ఈ వ్రతాన్ని పాటిస్తారు.
- భక్తితో పద్మిని ఏకాదశి వ్రతాన్ని పాటిస్తే.. ఒక అశ్వమేధ యజ్ఞం చేసినంత పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.
- ఆధ్యాత్మిక పురోగతి, విష్ణుమూర్తి అనుగ్రహం పొందేందుకు ఇది అత్యంత ఉత్తమమైన ఏకాదశిగా భావిస్తారు.
పద్మిని ఏకాదశి పూజా విధానం
- పద్మిని ఏకాదశి నాడూ (మే 27, బుధవారం) ఉదయాన్నే తలస్నానం చేసి శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిలను పూజించాలి.
- స్వామివారికి తులసి దళాలు, పసుపు రంగు పువ్వులు సమర్పించి, పంచామృతంతో అభిషేకం చేయాలి.
- విష్ణు సహస్రనామం లేదా “ఓం నమో నారాయణాయ” మంత్రాన్ని జపించడం అత్యంత శుభప్రదం.
- పద్మిని ఏకాదశి నాడు రాత్రి పూట భజనలు, జాగరణ చేయడం వల్ల మరింత పుణ్యం, మంచి ఫలితాలు కలుగుతాయి.
- ఈ పవిత్ర రోజున పేదలకు అన్నదానం, తోచిన దానధర్మాలు చేయడం వల్ల విశేష పుణ్యఫలం లభిస్తుంది.
