TTD : ప్రపంచ శాంతి, సౌభాగ్యం కోసం శ్రీయాగం
శ్రీ యాగం కారణంగా జనవరి 20 నుంచి 27వ తేదీ వరకు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవను రద్దు చేయడం జరిగిందన్నారు. జనవరి 20, 21, 27వ తేదీల్లో బ్రేక్ దర్శనం రద్దు చేస్తున్నట్లు...
- madhu
- Published On : January 19, 2022 / 01:42 PM IST
Tiruchanuru
Tiruchanur Padmavathi Ammavari Temple : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శ్రీయాగం నిర్వహించనున్నారు. మొత్తం ఏడు రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగనుంది. జనవరి 21వ తేదీ నుంచి జనవరి 27వ తేదీ వరకు కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలోని శ్రీకృష్ణ ముఖ మండపంలో ఏకాంతంగా ఈ యాగం జరుగనుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. ప్రపంచ శాంతి, సౌభాగ్యం కోసం ఈ యాగం నిర్వహిస్తున్నట్లు, యాగ కార్యక్రమాలను భక్తులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ లో వీక్షించవచ్చన్నారు.
Read More : RGV : కొడాలి నానికి సపోర్ట్ చేస్తూ వర్మ ట్వీట్లు
జనవరి 21న మొదటిరోజు ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు యాగశాలలో హోమాలు, చతుష్టానార్చన, అగ్ని ప్రతిష్ట, నిత్యపూర్ణాహుతి, నివేదన, వేద విన్నపం, మహామంగళహారతి నిర్వహిస్తారు. తిరిగి సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు చతుష్టానార్చన, శ్రీయాగం హోమాలు, లఘుపూర్ణాహుతి, మహానివేదన, వేద విన్నపం, మహా మంగళ హారతి చేపట్టి అమ్మవారి ఉత్సవర్లను సన్నిధిలోకి వేంచేపు చేస్తారు. జనవరి 22 నుండి 26వ తేదీ వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు శ్రీయాగం కార్యక్రమాలు నిర్వహిస్తారు.
Read More : International Flights: అంతర్జాతీయ విమానాలు రద్దు.. ఫిబ్రవరి 28వరకూ ఇంతే
జనవరి 27న చివరి రోజు ఉదయం 6.30 నుండి 8.30 గంటల వరకు చతుష్టానార్చన, హోమాలు, మహాప్రాయశ్చిత్త హోమం, మహాశాంతి హోమం నిర్వహిస్తారు. ఉదయం 8.30 నుండి 9 గంటల వరకు మహాపూర్ణాహుతి చేపడతారు. ఉదయం 9 నుండి 10.30 గంటల వరకు అభిషేకం మరియు అవభృతం నిర్వహిస్తారు. జనవరి 20వ తేదీ గురువారం సాయంత్రం 5.30 నుంచి రాత్రి 9 గంటల వరకు విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, మృత్సంగ్రహణం, అంకురార్పణ నిర్వహిస్తామన్నారు. జనవరి 20న గురువారం సాయంత్రం 5.30 నుండి రాత్రి 9 గంటల వరకు ఆర్జిత సేవలు రద్దు చేస్తునట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. శ్రీ యాగం కారణంగా జనవరి 20 నుంచి 27వ తేదీ వరకు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవను రద్దు చేయడం జరిగిందన్నారు. జనవరి 20, 21, 27వ తేదీల్లో బ్రేక్ దర్శనం రద్దు చేస్తున్నట్లు తెలిపారు. అర్చకులు పి.శ్రీనివాసన్ ఈ యాగానికి ప్రధానాచార్యులుగా వ్యవహరిస్తారు.
