Tirumala : తిరుమలలో ఆదివారం రాత్రి శ్రావణ గరుడ సేవ
శ్రావణ పౌర్ణమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం రాత్రి టీటీడీ శ్రావణ పౌర్ణమి గరుడసేవ నిర్వహించనుంది. రాత్రి 7 నుంచి రాత్రి 9 గంటల మధ్య సర్వాలంకార భూషితుడైన..
- Subhan Ali Shaik
- Published On : August 22, 2021 / 09:14 AM IST
Tirumala
Tirumala : శ్రావణ పౌర్ణమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం రాత్రి టీటీడీ శ్రావణ పౌర్ణమి గరుడసేవ నిర్వహించనుంది. రాత్రి 7 నుంచి రాత్రి 9 గంటల మధ్య సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు సువర్ణకాంతులీనుతున్న గరుడునిపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ఈ నెలలో శ్రీవారికి రెండుసార్లు గరుడ సేవ జరుగుతోంది. ఇంతకు ముందు ఈ నెల 13న గరుడ పంచమి పర్వదినం సందర్భంగా స్వామివారిని తనకు ఇష్టవాహనమైన గరుడునిపై తిరుమాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు. ప్రతి ఏడాది తిరుమలలో గరుడ పంచమిని ఘనంగా నిర్వహిస్తున్నారు.
నూతన దంపతులు తమ వైవాహిక జీవితం ఆనందదాయకంగా ఉండేందుకు, స్త్రీలు తమకు పుట్టే సంతానం గరుడునిలాగా బలశాలిగా, మంచి వ్యక్తిత్వం గలవాడిగా ఉండేందుకు ‘గరుడపంచమి’ పూజ చేస్తారని ప్రాశస్త్యం. అలాగే ప్రతీ పౌర్ణమికి సైతం గరుడ సేవ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ మేరకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది.
