Arjun Rajput : పాక్ బౌలర్లకు చుక్కలు చూపించిన 14 ఏళ్ల సంచలనం.. ఎవరీ అర్జున్ రాజ్‌పుత్..? పేదరికాన్ని ఓడించిన క్రికెటర్
Who is Arjun Rajput : భారత్-పాకిస్థాన్ అండర్-19 ఆసియా కప్ పోరులో ఓ యువ క్రికెటర్ పేరు మార్మోగుతోంది. అతనే అర్జున్ రాజ్‌పుత్. భారత టాప్ ఆర్డర్ కుప్పకూలిన వేళ క్రీజులోకి వచ్చిన జలంధర్ కుర్రాడు అర్జున్ రాజ్‌పుత్ అద్భుత శతకంతో ఆకట్టుకున్నాడు.
- Harish Thanniru
- Published on- November 8, 2026 / 05:06 PM IST
Who is Arjun Rajput
Who is Arjun Rajput : భారత్-పాకిస్థాన్ అండర్-19 ఆసియా కప్ పోరులో ఓ యువ క్రికెటర్ పేరు మార్మోగుతోంది. భారత టాప్ ఆర్డర్ కుప్పకూలిన వేళ క్రీజులోకి వచ్చిన జలంధర్ కుర్రాడు అర్జున్ రాజ్‌పుత్ అద్భుత శతకంతో జట్టును ఆదుకున్నాడు. ఒకవైపు వీరేంద్ర సెహ్వాగ్, మరోవైపు రాహుల్ ద్రవిడ్ కుమారులు విఫలమైనా.. ఏమాత్రం ఒత్తిడికి లోనుకాకుండా అర్జున్ ఆడిన ఇన్నింగ్స్ అందరి దృష్టిని ఆకర్షించింది. అసలు ఈ అర్జున్ రాజ్‌పుత్ ఎవరు? అతడి క్రికెట్ ప్రయాణం వెనుక ఉన్న కథ ఏమిటి.. అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.
Also Read : IND vs NZ : న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో 4 పరుగుల తేడాతో గెలిచిన భారత్..
పంజాబ్‌లోని జలంధర్‌కు చెందిన అర్జున్ రాజ్‌పుత్ సాధారణ కుటుంబం నుంచి వచ్చాడు. అతడి తండ్రి హోతిరామ్ గతంలో వీధిలో బండిపై చోలే-కుల్చాలు విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించేవారు. ఆ వ్యాపారం ద్వారా వచ్చే కొద్దిపాటి ఆదాయంతోనే కుటుంబ అవసరాలు, పిల్లల చదువుల ఖర్చులు చూసుకునేవారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా కుమారుడి క్రికెట్ కలకు మాత్రం అడ్డుపడలేదు. పిల్లల చదువుల కోసం అప్పులుసైతం చేశాడు. ప్రస్తుతం ఆయన చిన్న బేకరీ నిర్వహిస్తూ కుల్చాలను తయారుచేసి సరఫరా చేస్తున్నాడు.
అర్జున్‌కు చిన్నప్పటి నుంచే క్రికెట్‌పై ఆసక్తి ఉండేది. ఏడేళ్ల వయసులోనే క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. జలంధర్‌లోని హర్భజన్ సింగ్ క్రికెట్ అకాడమీలో శిక్షణ తీసుకున్నాడు. అయితే కొంతకాలానికి ఆ అకాడమీ మూతపడటంతో అతడి ప్రయాణంలో ఆటంకం ఎదురైంది. ఆ సమయంలో కోచ్ విక్రమ్ సిద్ధూ అండగా నిలిచారు. అర్జున్‌కు ఓ ప్రముఖ పాఠశాలలో ప్రవేశం కల్పించడంతో పాటు ఫీజు మినహాయింపు వచ్చేలా పాఠశాల యాజమాన్యంతో మాట్లాడారు. దీంతో చదువుతో పాటు క్రికెట్ సాధనను కొనసాగించగలిగాడు.
దేశవాళీ అండర్-19 క్రికెట్‌లో అర్జున్ తన ప్రతిభను నిరూపించుకున్నాడు. 2026-27 వినూ మన్కడ్ ట్రోఫీలో పంజాబ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో ఏకంగా 695 పరుగులు సాధించాడు. ఫైనల్లో ముంబైపై 33 బంతుల్లో అజేయంగా 55 పరుగులు చేసి పంజాబ్ జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. షేర్-ఎ-పంజాబ్ టీ20 కప్‌లోనూ లూధియానా లయన్స్ తరఫున మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఈ ప్రదర్శనలతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించి భారత అండర్-19 జట్టులో చోటు సంపాదించాడు.
అండర్-19 ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్జున్ తన సత్తా చాటాడు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 22 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అర్జున్.. పాక్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ 22 పరుగులు చేయగా, రాహుల్ ద్రవిడ్ కుమారుడు అన్వయ్ ద్రవిడ్ 10 పరుగులకే వెనుదిరిగాడు. మరోవైపు అర్జున్ మాత్రం అద్భుతంగా ఆడుతూ కేవలం 80 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. చివరకు 85 బంతుల్లో 107 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడి ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి.
అర్జున్ పోరాటంతో భారత్ 46.3 ఓవర్లలో 208 పరుగులు చేయగలిగింది. నేపాల్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనూ బంతితో సత్తా చాటిన అతడు మూడు వికెట్లు పడగొట్టాడు. అయితే, పాకిస్థాన్‌పై ఆడిన శతకంతో అర్జున్ రాజ్‌పుత్ ఇప్పుడు భారత క్రికెట్‌లో మరో ఆశాకిరణంగా నిలిచాడు.
