Vaibhav Sooryavanshi : వైభవ్ సూర్యవంశీ కోసం నాయర్ కీలక ప్రతిపాదన.. టీమ్ఇండియా ఏం చేస్తుందో?
గౌతమ్ గంభీర్ ఓపెనర్లుగా సంజూ శాంసన్- అభిషేక్ శర్మ జోడికి మద్దుతు ఇస్తుండగా 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి (Vaibhav Sooryavanshi) తుది జట్టులో చోటు దక్కడం లేదు.
- Thota Vamshi Kumar
- Published on- October 13, 2026 / 12:43 PM IST
Abhishek Nayar support teenage batting sensation Vaibhav Sooryavanshi
Vaibhav Sooryavanshi : టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఓపెనర్లుగా సంజూ శాంసన్- అభిషేక్ శర్మ జోడికి మద్దుతు ఇస్తుండగా 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో చోటు దక్కడం లేదు. నిలకడగా ఆడలేకపోతున్న సంజూ శాంసన్‌ను తప్పించి వైభవ్ సూర్యవంశీకి అవకాశాలు ఇవ్వాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయినప్పటికి కూడా సంజూకు గంభీర్ మద్దతు ఉండడంతో జట్టులో కొనసాగుతున్నాడు. వెస్టిండీస్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు పూర్తి కాగా.. కేవలం ఒకే ఒక మ్యాచ్‌లో సంజూ శాంసన్ రాణించాడు.
ప్రస్తుతం భారత జట్టు సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో ఉంది. బుధవారం (అక్టోబర్ 14) హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ టీమ్ఇండియా సొంతం అవుతుంది. అప్పుడు కనీసం ఐదో టీ20 మ్యాచ్‌లోనైనా వైభవ్ ను ఆడించాలని భారత మాజీ సహాయ కోచ్ అభిషేక్ నాయర్ విజ్ఞప్తి చేస్తున్నాడు.
Sara Tendulkar : సారా టెండూల్కర్ @ 29.. సెలబ్రేషన్స్ ఫోటోలు వైరల్..
‘భారత్ 3-1తో ఆధిక్యంలోకి వెళ్లాలని నేను కోరుకుంటున్నా. ఆ తర్వాత చివరి మ్యాచ్‌లో సూర్యవంశీ ఆడాలి.’ అని స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ నాయర్ తెలిపాడు.
అభిషేక్ శర్మపై ప్రశంసలు..
ఇక తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన అభిషేక్ శర్మ మూడో టీ20లో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 69 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తన దూకుడైన బ్యాటింగ్‌తో ఆరు ఫోర్లు, ఐదు సిక్సర్లు బాదాడు.
అభిషేక్ పోరాట పటిమను నాయర్ ప్రశంసించాడు. వెస్టిండీస్ స్పిన్నర్ రోస్టన్ చేజ్‌తో అతడు సాగించిన పోరాటాన్ని సిరీస్‌లో కీలక అంశంగా అభివర్ణించాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో చేజ్ బౌలింగ్‌లోనే అభిషేక్ ఔటయ్యాడు. అయితే.. మూడో మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్‌తో అతడు బలంగా బదులిచ్చాడు.
‘బౌలర్‌ను ఎలా ఎదుర్కోవాలనే దానిపై ప్రణాళిక సిద్ధం చేసుకోవడానికి క్రీజులో కొంత సమయం తీసుకోవడం ముఖ్యం. ప్రతి బంతిని ఎదుర్కొంటున్నప్పుడు బౌలర్ ఎలాంటి వ్యూహంతో బౌలింగ్ చేస్తున్నాడో బ్యాటర్ అర్థం చేసుకోవాలి. అభిషేక్ ఆరు బంతులు ఆడిన తర్వాత రోస్టన్ చేజ్ అతడిని లక్ష్యంగా చేసుకుని బౌలింగ్ చేయడం మొదలుపెట్టాడు. అభిషేక్‌కు ఒక ప్రత్యేకమైన పేరు ఉంది. ఆ పేరుకు తగ్గట్టుగానే చేజ్ కూడా అతడికి బంతులు వేస్తున్నాడు. మొదటి ఆరు బంతులు ఆడిన తర్వాత అభిషేక్‌ను అనుసరించేలా చేజ్ బౌలింగ్ మారుతుంది.’ అని నాయర్ వివరించాడు.
Tilak Varma : సొంత గడ్డ ఉప్పల్‌లో తిలక్ వర్మ.. శతక సిక్సర్ల రికార్డు అందుకునేనా ?
‘ఒక బ్యాటర్‌ను రెండుసార్లు ఔట్ చేసిన బౌలర్.. ఆ బ్యాటర్ ఐదు లేదా ఆరు బంతులు ఆడిన తర్వాత తదుపరి ఏం చేయబోతున్నాడో ముందుగానే అంచనా వేయడానికి ప్రయత్నిస్తాడు. ఆఫ్ స్పిన్నర్‌గా తాను వేయగల బంతులన్నింటినీ బ్యాటర్ ఇప్పటికే అర్థం చేసుకుని ఉంటాడనే భావనతో బౌలర్ తన వ్యూహాన్ని మార్చుకుంటాడు. ఇదే అభిషేక్ శర్మను ప్రత్యేకంగా నిలబెడుతుంది. అతడు మొదటి బంతి నుంచే దూకుడుగా ఆడగలడు. అవసరమైతే సమయం తీసుకుంటూ ప్రత్యర్థి బౌలర్‌పై ఒత్తిడి పెంచగలడు.’ అని అభిషేక్ ఆటతీరును కొనియాడాడు.
