Abhishek Sharma : అభిషేక్ శ‌ర్మ కీల‌క వ్యాఖ్య‌లు.. నా ప్ర‌ణాళిక అదే.. వైభ‌వ్ జ‌ట్టులో ఉన్న‌ప్పుడు..

న్యూజిలాండ్‌తో మూడో టీ20 మ్యాచ్‌లో త‌న విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్ పై అభిషేక్ శ‌ర్మ(Abhishek Sharma) కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు.

Abhishek Sharma key comments after century in IND vs NZ 3rd T20 match

Abhishek Sharma : వెల్లింగ్ట‌న్ వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భార‌త్ 6 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. త‌ద్వారా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ను మ‌రో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండ‌గానే సొంతం చేసుకుంది.

ఇక మూడో టీ20 మ్యాచ్ విజ‌యంలో ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ కీల‌క పాత్ర పోషించాడు. 199 ప‌రుగుల ల‌క్ష్య ఛేద‌న‌లో ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. 35 బంతుల్లోనే సెంచ‌రీ చేశాడు. అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో అభిషేక్‌కు ఇది నాలుగో శ‌త‌కం. ఇక ఈ మ్యాచ్‌లో మొత్తంగా 38 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు, 11 సిక్స‌ర్ల సాయంతో 113 ప‌రుగులు చేశాడు. ఈ క్ర‌మంలో ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సొంతం చేసుకున్నాడు.

అవార్డు అందుకున్న త‌రువాత త‌న ఇన్నింగ్స్ పై అభిషేక్ శ‌ర్మ స్పందించాడు. ‘మా ప్ర‌ణాళిక చాలా సింపుల్‌. వైభ‌వ్, నేను క్రీజులో ఉన్నంత సేపు ఆట‌ను ఆస్వాదిస్తూ ఆడాల‌ని అనుకున్నాము ముఖ్యంగా ప‌వ‌ర్ ప్లేలో. ఫీల్డింగ్ చేస్తున్నప్పుడే పిచ్‌పై అదనపు బౌన్స్ ఉండటాన్ని గమనించాం. మైదానం కొలతలను మాకు అనుకూలంగా ఉప‌యోగించుకోవాల‌ని భావించాం. ప‌వ‌ర్ ప్లేలో దూకుడుగా ఆడ‌టంతో పాటు బౌల‌ర్ల వేగాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని అనుకున్నాము. మొద‌టి ఓవ‌ర్‌ను వైభ‌వ్ ఆరంభించిన తీరు అద్భుతంగా ఉంది. జట్టుకు మంచి ఊపునివ్వడమే మా లక్ష్యం, ఆ తర్వాత అదే జోరును కొనసాగించాం.’ అని అభిషేక్ శ‌ర్మ తెలిపాడు.

కోచింగ్ సిబ్బంది, కెప్టెన్ ప్రోత్సాహం గురించి..

కోచింగ్ సిబ్బంది, కెప్టెన్ ఇచ్చిన‌ ప్రోత్సాహం గురించి మాట్లాడుతూ.. ‘మైదానంలో స‌హజసిద్ధ‌మైన‌ ఆట ఆడటం ఎప్పుడూ అంత సుల‌భం కాదు. కానీ తెర వెనుక చేసిన కఠినమైన సన్నద్ధతే దీనికి కారణం. ముఖ్యంగా మా కోచ్‌లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి. వారు సైడ్‌ఆర్మ్‌ బౌలింగ్‌తో మాకు చాలా ప్రాక్టీస్‌ చేయిస్తున్నారు. ఓ బ్యాటర్‌గా సరైన సన్నద్ధత చాలా ముఖ్యం. పిచ్ పరిస్థితులు, మైదానపు కొలతలు, అలాగే బౌలర్ల శైలిని దృష్టిలో ఉంచుకుని దానికి తగ్గట్టుగా షాట్లు ఆడటంపైనే నా దృష్టి ఉంటుంది. నిన్న మాకు మంచి ప్రాక్టీస్ సెషన్ దొరికింది. దానిని సరిగ్గా ఉపయోగించుకున్నాను. నిజం చెప్పాలంటే.. ఈ ఇన్నింగ్స్ ఎలా ఆడాలో నేను ముందే అనుకున్నాను. స‌రిగ్గా అలాగే ఆడాను.’ అని అభిషేక్ శ‌ర్మ చెప్పుకొచ్చాడు.

IND vs NZ : అభిషేక్ శ‌ర్మ వీర విధ్వంసం.. మూడో టీ20మ్యాచ్‌లో కివీస్ పై భార‌త్ ఘ‌న విజ‌యం.. సిరీస్ కైవ‌సం.. మ‌రో రెండు మ్యాచ్‌లు ఉండ‌గానే..

యువీ కామెంట్స్ పై..

12 బంతుల్లో హాఫ్ సెంచ‌రీ చేయ‌లేక‌పోతున్నావంటూ యువ‌రాజ్ సింగ్ గ‌తంలో పంపిన సందేశం గురించి మాట్లాడుతూ.. ‘ఈ విష‌యం గురించి ఇంత‌క ముందే నేను చెప్పాను. ఆ రోజుల్లో ఆయన ఎలాంటి క్రికెట్ ఆడేవారో నాకు తెలియదు. కానీ 12 బంతుల్లో 50 ప‌రుగులు చేయ‌డం అంత సుల‌భం కాదు. ఎవరైనా బ్యాటర్ అలా ఆడాలనుకుంటే.. అది చాలా కష్టమైన పని. ఎవరూ అనుకున్నంత సులభంగా 12 బంతుల్లో 50 పరుగులు చేయలేరు. ఇలాంటివి అరుదుగా మాత్రమే జరుగుతుంటాయి. కానీ.. ఓ బ్యాటర్‌గా మేము ఎప్పుడూ వ్యక్తిగత మైలురాళ్ల కోసం చూడము. జట్టు కోసం మ్యాచ్ గెలవడమే మా లక్ష్యం. వైభవ్ కూడా అలాగే ఆడ‌తాడు. ఇక ఈ సిరీస్ అంతటా కూడా మేము ఇదే విధానాన్ని కొనసాగించాలనుకుంటున్నాము.’ అని అభిషేక్ శ‌ర్మ అన్నాడు.