IND vs AFG : భారత్‌తో ఏకైక టెస్టు మ్యాచ్‌కు ముందు అఫ్గాన్ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు.. అప్పుడు మాకు అనుభవం లేదు.. ఇప్పుడు..
భారత్‌తో ఏకైక టెస్టు మ్యాచ్‌కు ముందు అఫ్గానిస్థాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది (IND vs AFG ) కీలక వ్యాఖ్యలు చేశాడు.
- Thota Vamshi Kumar
- Updated on- June 4, 2026 / 04:01 PM IST
Afghan Captain Hashmatullah Shahidi key comments ahead only test against India
- భారత్, అఫ్గాన్ జట్ల మధ్య ఏకైక టెస్టు మ్యాచ్
- జూన్ 6 నుంచి 10 వరకు ముల్లన్‌పూర్ వేదికగా
- ఈ మ్యాచ్‌కు ముందు అఫ్గాన్ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు..
IND vs AFG : భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య ముల్లన్‌పూర్ వేదికగా జూన్ 6 నుంచి 10 వరకు ఏకైక టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం భారత్, అఫ్గాన్ జట్లు ఇప్పటికే ముల్లన్‌పూర్‌కు చేరుకుని ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఇక ఈ మ్యాచ్‌కు ముందు అఫ్గానిస్థాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది కీలక వ్యాఖ్యలు చేశాడు.
తమ టెస్టు క్రికెట్ చరిత్రలో తొలి టెస్టు మ్యాచ్‌ను టీమ్ఇండియాతోనే ఆరేళ్ల క్రితం ఆడిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. అప్పుడు తమకు అంతగా అనుభవం లేదని కానీ ఈ ఆరేళ్లలో తాము ఎంతో క్రికెట్ ఆడామన్నాడు. ఎంతో నేర్చుకున్నామన్నాడు.
టెస్టు హోదా పొందినప్పటి నుంచి అఫ్గాన్ ఇప్పటి వరకు 12 టెస్టులు మాత్రమే ఆడింది. దీనిపై షాహిది మాట్లాడుతూ.. మేము ప్రతి సంవత్సరం ఒకటి లేదా రెండు టెస్ట్ మ్యాచ్‌లు మాత్రమే ఆడతాము. కాబట్టి కుర్రాళ్లకు రెడ్-బాల్ క్రికెట్ ఆడిన అనుభవం అంతగా లేదు. అయితే.. మా దేశంలో ఫస్ల్ క్లాస్ క్రికెట్‌లో ప్రతి ప్లేయర్ ప్రతి ఏడాది దాదాపు ఆరు నుంచి ఏడు రెడ్ మ్యాచ్‌లు ఆడతారు, ఆ అనుభవం సరిపోతుంది. అని షాహిది అన్నాడు.
టీ20 ఫ్రాంచైజీ లీగ్‌లకు ప్రపంచవ్యాప్త ఆకర్షణ, ఆర్థిక బలం ఉన్నప్పటికీ, తమ జట్టు సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ఐదు రోజుల ఆటనే అంతిమ వేదిక అని షాహిది నొక్కి చెప్పారు. టెస్టు క్రికెట్ ఆడే ఓపిక తమకు ఉందన్నాడు. నా టెస్ట్ కెరీర్‌లో 10 లేదా 11 మ్యాచ్‌లలో నేను రెండు డబుల్ సెంచరీలు సాధించాను. రహ్మత్ షా ఒక డబుల్ సెంచరీ చేశాడు, ఇంకా ఈ ఫార్మాట్‌లో అఫ్గానిస్థాన్ తరఫున మరికొందరు ఆటగాళ్లు కూడా సెంచరీలు సాధించారు. దీన్నిబట్టి మాకు ఓపిక ఉందని, ఇక్కడ పరుగులు ఎలా చేయాలో మాకు తెలుసని అర్థమవుతుందనే విషయాన్ని గుర్తించాలన్నాడు.
ముల్లన్‌పూర్ రాకముందు తాము జలాలాబాద్‌లో మూడు వారాల పాటు కఠిన సన్నాహక శిబిరంలో పాల్గొన్నామన్నాడు. అక్కడ కూడా భారత్‌లోలాగానే వాతావరణం సుమారు 34 డిగ్రీల నుంచి 35 డిగ్రీలు ఉంటుందని, దానికి తాము ఆలవాటు పడ్డామని చెప్పుకొచ్చాడు.
కొత్త హెడ్ కోచ్ రిచర్డ్ పైబస్ చాలా సానుకూల దృక్పథం ఉన్న వ్యక్తి. ఎల్లప్పుడూ ఆటగాళ్లను జాగ్రత్తగా చూసుకుంటారు. ప్రతి సెషన్‌లోనూ సానుకూలంగా ఎలా ఉండాలి, ప్రేరణతో ఎలా ఉండాలి, నాణ్యమైన ప్రాక్టీస్ ఎలా చేయాలో ఆయన మాకు చూపిస్తూ, నేర్పిస్తున్నారు అని షాహిది తెలిపాడు.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్‌లు టెస్టులకు రిటైర్‌మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై మాట్లాడుతూ.. సీనియర్ ఆటగాళ్లు లేనప్పటికి భారత్‌ను తక్కువగా అంచనా వేయడానికి వీలులేదన్నాడు. కుర్రాళ్లు కూడా చాలా బాగా ఆడతారనే విషయం తమకు తెలుసునని అన్నాడు. అయితే.. ఓ ప్రత్యర్థి జట్టు కెప్టెన్‌గా.. వారు ఈ మ్యాచ్‌లో మంచిగా ఆడకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే సమయంలో మా జట్టు బాగా ఆడాలని నేను కోరుకుంటున్నాను. అని హష్మతుల్లా షాహిది తెలిపాడు.
