Pic Courtesy @ EspnCricInfo
Pakistan: చిరకాల ప్రత్యర్థి భారత్ చేతిలో ఘోర పరాజయం.. పాకిస్తాన్ క్రికెట్ జట్టును కుదిపేస్తోంది. జట్టు ప్రదర్శనపై మేనేజ్‌మెంట్ ఆగ్రహంతో ఊగిపోతున్నట్లు సమాచారం. ఓటమి తర్వాత అర్ధరాత్రి కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. సీనియర్ ప్లేయర్లు బాబర్ అజాం, షాహీన్ అఫ్రీదిపై వేటు వేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. వారి స్థానాల్లో సల్మాన్ మీర్జా, నసీమ్, ఫకర్, ఖవాజా పేర్లను నమీబియాతో మ్యాచ్‌కు పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు.
ఆదివారం కొలంబోలో భారత్ చేతిలో 61 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైన పాక్.. ఫిబ్రవరి 18న నమీబియాతో జరిగే కీలకమైన గ్రూప్-దశ పోరుకు రెడీ అవుతోంది. ఈ మ్యాచ్ కు ముందు సీనియర్ క్రికెటర్లు బాబర్ అజాం, షాహీన్ షా అఫ్రిదిలను జట్టు నుండి తొలగించాలని నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం.
భారత్ తో మ్యాచ్ లో విఫలమైన తర్వాత వీరిద్దరూ బెంచ్‌లో ఉంటారని తెలుస్తోంది. బాబర్, షాహీన్ పాక్ జట్టులో అతిపెద్ద ఆటగాళ్లు. ఎంతో అనుభవం ఉంది. అయితే, అత్యంత ముఖ్యమైన సమయంలో ఈ ఇద్దరు ఆటగాళ్ళు చెత్త ప్రదర్శన ఇచ్చారని మేనేజ్ మెంట్ సీరియస్ గా ఉంది.
పాకిస్తాన్ కు మంచి ఆరంభమే లభించింది. కెప్టెన్ సల్మాన్ అలీ అఘా మొదటి ఓవర్ లోనే అభిషేక్ శర్మను ఔట్ చేశాడు. పాక్ బౌలర్లు భారత్‌ను 175/7కి పరిమితం చేయడంలో సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత బ్యాటర్లు విఫలం అయ్యారు. ఒత్తిడికి తలొగ్గారు.
తమ ప్లేయర్లు మెరుగైన ప్రదర్శన చూపలేదని పాక్ ప్రధాన కోచ్ మైక్ హెస్సన్ అన్నారు. ఓటమి తర్వాత మేనేజ్ మెంట్ అర్థరాత్రి వరకు సుదీర్ఘంగా సమావేశమైంది. జట్టులో మార్పులు అవసరమని తేల్చింది. ఇందులో భాగంగా నమీబియాతో మ్యాచ్ లో బాబర్, షాహీన్‌లను బెంచ్ కు పరిమితం చేసి.. సల్మాన్ మీర్జా/నసీమ్ షా, ఫఖర్ జమాన్‌లను ర్లీ ప్లేస్ చేయాలని పాక్ మేనేజ్ మెంట్ నిర్ణయించుకుంది.
పాక్ ఓటమి ఖాయమని తెలియగానే ప్రేమదాస స్టేడియం నుండి ముందుగానే వెళ్లిపోయారు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ. జట్టు మేనేజర్ నవేద్ అక్రమ్ చీమాకు తన తీవ్ర అసంతృప్తిని తెలియజేశారని తెలుస్తోంది. ముఖ్యమైన మ్యాచ్‌లలో ఇలాంటి ప్రదర్శనలు ఆమోదయోగ్యం కానివి అని ఆయన అన్నట్లు సమాచారం.
షాహీన్ అఫ్రిది స్థానంలో సల్మాన్ మీర్జా లేదా నసీమ్ షాలలో ఒకరు జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ హీరో ఫఖర్ జమాన్ బాబర్ అజామ్ స్థానంలో XIలోకి తిరిగి రావొచ్చు. మార్పులు విజయవంతమైతే మిడిల్ ఆర్డర్‌లో ఖవాజా నఫే వంటి యువ ప్రతిభను నింపాలని యాజమాన్యం కూడా ఆసక్తిగా ఉంది.
పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజాలు షోయబ్ అక్తర్, షాహిద్ అఫ్రిది కూడా భారత్ చేతిలో ఓటమి పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రదర్శన తక్కువగా ఉన్న ఆటగాళ్లకు అవకాశాలు ఎందుకు అందుతూనే ఉన్నాయని అక్తర్ ప్రశ్నించాడు. బాబర్, షాదాబ్ ఖాన్‌లతో పాటు తన అల్లుడు షాహీన్‌ను తొలగించాలని అఫ్రిది డిమాండ్ చేశాడు.
భారత్ చేతిలో ఈ భారీ ఓటమికి ముందు పాకిస్తాన్ తక్కువ ర్యాంక్‌లో ఉన్న USA, నెదర్లాండ్స్‌లను ఓడించినందున, సూపర్ 8 దశకు చేరాలంటే నమీబియాపై మంచి గెలుపు తప్పనిసరి. దీంతో పాక్ జట్టుపై తీవ్రమైన ఒత్తిడి ఉంది.
Also Read: చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్.. టీ20 క్రికెట్‌లో ఏకైక బౌలర్..