Ajinkya Rahane : అన్ని రకాల క్రికెట్‌కు టీమ్ఇండియా వెట‌ర‌న్ ఆట‌గాడు అజింక్య ర‌హానే గుడ్‌బై

టీమ్ఇండియా వెట‌ర‌న్ ఆట‌గాడు అజింక్యా రహానే (Ajinkya Rahane )అంత‌ర్జాతీయ క్రికెట్ స‌హా అన్ని రకాల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

Ajinkya Rahane announces retirement from all forms of the game

Ajinkya Rahane : టీమ్ఇండియా వెట‌ర‌న్ ఆట‌గాడు అజింక్య రహానే అంత‌ర్జాతీయ క్రికెట్ స‌హా అన్ని రకాల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా స్వ‌యంగా అత‌డే వెల్ల‌డించాడు.

‘జీవితంలోని వాస్తవం ఏమిటంటే ప్రతి విషయానికీ ఒక ప్రారంభం, ఒక ముగింపు ఉంటుంది. సమయం వచ్చినప్పుడు దాన్ని మ‌నం గౌరవించి ముందుకు సాగాల్సిందే. బ్యాటింగ్‌లో నేను ఎప్పుడూ సరైన టైమింగ్‌ను నమ్ముకున్నాను. దాని విలువ నాకు ఎప్పుడూ తెలుసు. ఈ రోజు కూడా నా జీవితంలో ముందుకు వెళ్లడానికి ఇదే సరైన సమయమని భావించి, అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాను.

చిన్న వయసులో కేవలం ప్రాక్టీస్ కోసమే డోంబివ్లి నుండి ప్రయాణించిన ఆ తొలి రోజుల నుంచే, నేను ఈ ఆటకు నా సర్వస్వాన్ని అర్పించాను. ప్రతి రోజు, ప్రతి ఇన్నింగ్స్‌లో, బ్యాటింగ్ చేయడానికి దొరికిన ప్రతి అవకాశంలో, భారత జట్టు జెర్సీ ధరించాలన్నదే నా కల. నా దేశం, నా జట్టును ఎప్పుడూ నా కంటే ముందుగా ఉంచాలనే ఒకే సూత్రాన్ని పాటించాను.

Vaibhav Sooryavanshi : వైభ‌వ్ సూర్య‌వంశీని భ‌య‌ప‌ట్టే బౌల‌ర్ ఎవ‌రో తెలుసా?

నేను ఈ ఆటను పూర్తి నిజాయితీతో ఆడాను. మన ఉద్దేశం మంచిదైతే ఆట కూడా మనకు న్యాయం చేస్తుందని నేను ఎప్పుడూ నమ్మాను. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేసినప్పటి నుంచి గత 20 ఏళ్లలో భారత క్రికెట్ ఎంతో అభివృద్ధి చెందింది. ఆ ప్రయాణంలో భాగమైనందుకు నేను గర్వపడుతున్నాను. భారత క్రికెటర్‌గా నా అధ్యాయం ముగిసినా, క్రికెట్‌తో నా అనుబంధం మాత్రం ముగియదు. తదుపరి తరం ఆటగాళ్లకు సహాయం చేయడం, ఈ ఆట నాకు నేర్పిన విలువలను వారికి పంచడం, క్రికెట్ నాకు ఇచ్చిన దానికి తిరిగి ఏదో ఒకటి ఇవ్వడం నా తదుపరి లక్ష్యం.

ముంబైలో ఒక యువ ఆటగాడిగా ప్రారంభమై, భారత జట్టు తరఫున ఆడే అవకాశం రావడం నాకు గొప్ప గౌరవం. ఈ ప్రయాణంలో విజయాలు, పరాజయాలు రెండూ చూశాను. కానీ క్రికెట్ ఆడిన ఆనందం, వివిధ జట్లతో కలిసి ఆడిన అనుభవం, జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలు సృష్టించుకోవడం నా కెరీర్‌లో అతిపెద్ద సంతృప్తి.

బీసీసీఐ, ముంబై క్రికెట్ అసోసియేషన్, నా సహచర ఆటగాళ్లు, కోచ్‌లు, ఐపీఎల్ ఫ్రాంచైజీలు, నా భార్య రాధిక, నా కుటుంబ సభ్యులు, స్నేహితులు, అలాగే ఎప్పుడూ నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా నా కెరీర్‌లో ప్రతి ఎత్తుపల్లంలోనూ నాకు అండగా నిలిచిన క్రికెట్ అభిమానులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు.

‘అజింక్య’ అంటే అపరాజితుడు. కానీ క్రికెట్ నాకు ఎన్నో పరాజయాలను చూపించింది. క్రికెటర్‌గా విజయాల కంటే వైఫల్యాలే ఎక్కువగా ఎదురవుతాయి. నా జట్టు మ్యాచ్‌లు ఓడిపోయింది, నేను కూడా తప్పులు చేశాను. కానీ ఒక చోట మాత్రం నేను ఎప్పుడూ ఓడిపోలేదు.. అది మీ హృదయాల్లో. మీరు నన్ను ఎప్పుడూ మీ కుటుంబ సభ్యుడిలా ఆదరించారు. మీ ప్రేమకు, నాపై ఉంచిన నమ్మకానికి, మద్దతుకు హృదయపూర్వక ధన్యవాదాలు. భారత్ క్యాప్ నంబర్ 278… ఇక వీడ్కోలు.’ అని ఆ వీడియోలో ర‌హానే చెప్పుకొచ్చాడు.

2011లో అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అరంగ్రేటం చేసిన అజింక్యా ర‌హానే టీమ్ఇండియా త‌రుపున 85 టెస్టులు, 90 వ‌న్డేలు, 20 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 38.5 స‌గ‌టుతో 5077 ప‌రుగులు సాధించాడు. ఇందులో 12 సెంచ‌రీలు 26 అర్థ‌శ‌త‌కాలు ఉన్నాయి. వ‌న్డేల్లో 35.3 స‌గ‌టుతో 2962 ప‌రుగులు చేశాడు. ఇందులో మూడు శ‌త‌కాలు, 24 అర్థ‌శ‌త‌కాలు ఉన్నాయి. ఇక టీ20ల్లో 20.8 స‌గ‌టుతో 375 ప‌రుగులు సాధించాడు. ఇందులో ఓ అర్థ‌శ‌త‌కం ఉంది.

ఇక ఐపీఎల్‌లో 212 మ్యాచ్‌లు ఆడాడు. 30.1 స‌గ‌టుతో 5367 ప‌రుగులు చేశాడు. ఇందులో రెండు సెంచ‌రీలు 35 అర్థ‌శ‌త‌కాలు ఉన్నాయి.