Arjun Tendulkar : టీ20 ముంబై లీగ్‌లో అర్జున్ టెండూల్కర్ పెను విధ్వంసం.. ఐపీఎల్‌లో ఓ రెండు మ్యాచ్‌లు ఆడుంటేనా?
టీ20 ముంబై లీగ్ 2026లో సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ (Arjun Tendulkar ) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు.
- Thota Vamshi Kumar
- Updated on- June 9, 2026 / 08:22 AM IST
Arjun Tendulkar all round show in T20 Mumbai League 2026 on monday
- టీ20 ముంబై లీగ్‌లో అర్జున్ టెండూల్కర్ ఆల్‌రౌండ్ షో
- బౌలింగ్‌లో మూడు వికెట్లు, బ్యాటింగ్‌లో మెరుపు హాఫ్ సెంచరీ
Arjun Tendulkar : టీ20 ముంబై లీగ్ 2026లో సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. ఏఆర్‌సీఎస్ అంధేరికి ప్రాతినిధ్యం వహిస్తున్న అర్జున్ టెండూల్కర్ సోమవారం బాంద్రా బ్లాస్టర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అటు బ్యాట్‌తో ఇటు బంతితో విజృంభించి అందరిని ఆకట్టుకున్నాడు.
వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో బాంద్రా జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. అర్జున్ టెండూల్కర్ తన కెరీర్ బెస్ట్ ప్రదర్శన చేశాడు. తన లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను వణికించాడు. మూడు ఓవర్లలో 11 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు కీలక వికెట్లు తీశాడు. ఇందులో ఓ ఓవర్ మెయిడిన్‌గా వేయడం విశేషం. అర్జున్ ధాటికి బాంద్రా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 144 పరుగులే చేసింది.
ఆ తరువాత బ్యాటింగ్‌లోనూ అర్జున్ టెండూల్కర్ పెను విధ్వంసం సృష్టించాడు. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అతను మైదానం నలుమూలలా భారీ షాట్లు ఆడుతూ కేవలం 25 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అదే ఊపులో మొత్తం 34 బంతులు ఎదుర్కొన్న అర్జున్.. 4 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 66 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
అర్జున్ మెరుపులతో అంధేరి జట్టు 145 పరుగుల లక్ష్యాన్ని కేవలం 13.5 ఓవర్లలోనే ఛేదించి ఘన విజయాన్ని సాధించింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన అర్జున్ టెండూల్కర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు.
ఐపీఎల్ 2026లో లక్నో సూపర్ జాయింట్స్ కు అర్జున్ టెండూల్కర్ ఆడాడు. ఈ సీజన్‌లో కేవలం ఒకే ఒక మ్యాచ్‌లో అతడికి ఆడే అవకాశం వచ్చింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఆ మ్యాచ్ ద్వారా లక్నో తరుపున అర్జున్ అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో లక్నో జట్టు ఓడిపోయినప్పటికీ.. అర్జున్ తన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. 4 ఓవర్లలో 36 పరుగులు ఇచ్చి కీలకమైన ప్రభ్‌సిమ్రాన్ సింగ్ వికెట్ పడగొట్టాడు
