IND vs NZ : కోహ్లీ విధ్వంసం.. వన్డే సిరీస్లో గెలుపు బోణీ కొట్టిన భారత్.. డక్వర్త్ లూయిస్ పద్దతిలో తొలి వన్డేలో న్యూజిలాండ్ పై ఘన విజయం
IND vs NZ : న్యూజిలాండ్తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల వన్డే సిరీస్లో భారత్ విజయంతో బోణీ కొట్టింది.
Virat Kohli half century helps Team India won by 5 wickets against New Zealand in 1st ODI
IND vs NZ : న్యూజిలాండ్తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల వన్డే సిరీస్లో భారత్ విజయంతో బోణీ కొట్టింది. ఆక్లాండ్ వేదికగా జరిగిన తొలి వన్డే మ్యాచ్లో డక్త్ వర్త్ లూయిస్ పద్దతిలో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది.
పలుమార్లు వర్షం అంతరాయం కలిగించడంతో డక్వర్త్ లూయిస్ పద్దతిలో భారత లక్ష్యాన్ని 32 ఓవర్లలో 143 పరుగులుగా నిర్ణయించారు. ఈ లక్ష్యాన్ని భారత్ 22.4 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. టీమ్ఇండియా బ్యాటర్లలో విరాట్ కోహ్లీ (74; 51 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీ చేశాడు. కెప్టెన్ శుభ్మన్ గిల్ (37; 56 బంతుల్లో 5 ఫోర్లు) రాణించారు. రోహిత్ శర్మ, అక్షర్ పటేల్లు డకౌట్లు అయ్యారు. శ్రేయస్ అయ్యర్ (15) పర్వాలేదనిపించాడు. కివీస్ బౌలర్లలో జాకబ్ డఫీ మూడు వికెట్లు తీశాడు. కైల్ జేమీసన్, నాథన్ స్మిత్ చెరో వికెట్ను తీశారు.
అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 40.2 ఓవర్లలో 185 పరుగులకు ఆలౌటైంది. కివీస్ బ్యాటర్లలో టిమ్ సీఫెర్ట్ (38; 43 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు), బ్లెయిర్ టిక్నర్ (34; 23 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సర్లు), గ్లెన్ ఫిలిప్స్ (30; 51 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్)లు రాణించారు. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ నాలుగు, గుర్నూర్ బ్రార్ మూడు వికెట్లు తీశారు. అన్షుల్ కాంబోజ్ రెండు వికెట్లు పడగొట్టాడు.
పలుమార్లు వర్షం అంతరాయం..
186 పరుగుల లక్ష్యంతో భారత్ బరిలోకి దిగగా పలుమార్లు వర్షం అంతరాయం కలిగించింది. భారత ఇన్నింగ్స్లో 10.5 ఓవర్లు పూర్తి అయిన తరువాత తొలిసారి వర్షం కారణంగా ఆట నిలిచిపోయింది. కొద్దిసేపటి తరువాత వర్షం తగ్గిపోగా.. సమయం నష్టపోవడంతో డక్ వర్త్ లూయిస్ పద్దతిలో తొలుత భారత లక్ష్యాన్ని 40 ఓవర్లలో 167గా నిర్ణయించారు.
ఆట ప్రారంభమై తరువాత మరో ఏడు బంతులు పడగానే మరోసారి వరుణుడు వచ్చాడు. చాలాసేపటి తరువాత వర్షం తగ్గింది. చివరికి డక్వర్త్ లూయిస్ పద్దతిలో భారత లక్ష్యాన్ని 32 ఓవర్లలో 143 నిర్ణయించారు. ఈ లక్ష్యాన్ని భారత్ 22.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
ఇక ఇరు జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్ నవంబర్ 7న వెల్లింగ్టన్ వేదికగా జరగనుంది.
