Asian Games 2026 : ఆసియా క్రీడలు 2026లో భారత్‌కు తొలి స్వర్ణం.. మహిళల క్రికెట్‌లో.. ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక పై హర్మన్ సేన ఘన విజయం..
జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడలు 2026లో (Asian Games 2026) భారత్ తొలి స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది.
- Thota Vamshi Kumar
- Published on- September 22, 2026 / 01:26 PM IST
Asian Games 2026 India win first gold medal team india beat srilanka in womens cricket final match
Asian Games 2026 : జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడలు 2026లో భారత్ తొలి స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. మహిళల క్రికెట్‌లో భారత్ గోల్డ్ మెడల్‌ను సొంతం చేసుకుంది. శ్రీలంక జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 147 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. కాగా.. గత ఆసియా క్రీడల్లోనూ హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత మహిళల జట్టు ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక జట్టునే ఓడించి పసిడి పతకాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఫైనల్ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో స్మృతి మంధాన (79; 45 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేయగా షఫాలీ వర్మ (48; 29 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు), రిచా ఘోష్ (49 నాటౌట్; 22 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు) వేగంగా ఆడారు. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (19; 17 బంతుల్లో 3 ఫోర్లు) పర్వాలేదనిపించింది. శ్రీలంక బౌలర్లలో సుగంధిక కుమారి, కవిషా దిల్హారి, చాముడి ప్రభోదలు తలా ఓ వికెట్ తీశారు.
అనంతరం 217 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు 15.4 ఓవర్లలో 69 పరుగులకే కుప్పకూలింది. లంక బ్యాటర్లలో కెప్టెన్ చమరి ఆటపట్టు (29; 21 బంతుల్లో 5 ఫోర్లు), కవిష దిల్హరి (11), కౌశాని నుత్యంగన (14) లు మాత్రమే రెండు అంకెల స్కోరు సాధించారు. మిగిలిన వారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ మూడు వికెట్లు తీసింది. షఫాలీ వర్మ, శ్రీ చరణి, శ్రేయాంక పాటిల్ లు తలా రెండు వికెట్లు పడగొట్టారు.
