IND-W Vs BAN-W : ఆసియా క్రీడ‌ల్లో ఫైన‌ల్ చేరిన భార‌త్.. సెమీస్‌లో బంగ్లాదేశ్ పై ఘ‌న విజ‌యం

జపాన్ వేదిక‌గా జ‌రుగుతున్న ఆసియా క్రీడ‌ల్లో భార‌త మ‌హిళ‌ల క్రికెట్ జ‌ట్టు (IND-W Vs BAN-W) ఫైన‌ల్‌కు చేరుకుంది.

Asian Games 2026 India Women enter tin to final after they beat Bangladesh in semis

IND-W Vs BAN-W : జపాన్ వేదిక‌గా జ‌రుగుతున్న ఆసియా క్రీడ‌ల్లో భార‌త మ‌హిళ‌ల క్రికెట్ జ‌ట్టు ఫైన‌ల్‌కు చేరుకుంది. ఆదివారం బంగ్లాదేశ్‌తో జ‌రిగిన సెమీఫైన‌ల్ మ్యాచ్‌లో 114 ప‌రుగుల భారీ తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 195 ప‌రుగుల‌ భారీ స్కోరు చేసింది. టీమ్ఇండియా బ్యాట‌ర్ల‌లో ఓపెన‌ర్ ష‌ఫాలీ వ‌ర్మ (100 నాటౌట్; 49 బంతుల్లో 3 ఫోర్లు, 9 సిక్స‌ర్లు) శ‌త‌కంతో చెల‌రేగింది. మ‌రో ఓపెన‌ర్ స్మృతి మంధాన (37; 19 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ (40; 33 బంతుల్లో 6 ఫోర్లు) లు రాణించారు. క‌మ‌లినీ (3), రిచా ఘోష్ (2)లు విఫ‌లం అయ్యారు. బంగ్లా బౌల‌ర్ల‌లో మరుఫా అక్త‌ర్, శంజిదా అక్త‌ర్ మేఘల, రబేయా ఖాన్, నహిదా అక్త‌ర్ లు త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

Smriti Mandhana : చ‌రిత్ర సృష్టించిన స్మృతి మంధాన‌.. మ‌హిళ‌ల టీ20 క్రికెట్‌లో ఏకైక ప్లేయ‌ర్‌..

అనంత‌రం 196 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన బంగ్లాదేశ్ 15.4 ఓవ‌ర్ల‌లో 81 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. బంగ్లా బ్యాట‌ర్ల‌లో దిలారా అక్తర్ (27), సుల్తానా ఖాతున్ (12 నాటౌట్) , షార్మిన్ అఖ్తర్ (10) లు మాత్ర‌మే రెండు అంకెల స్కోరు సాధించారు. మిగిలిన వారంతా సింగిల్ డిజిట్‌కే ప‌రిమితం అయ్యారు. భార‌త బౌల‌ర్ల‌లో నందినీ శ‌ర్మ, దీప్తి శ‌ర్మ‌లు చెరో మూడు వికెట్లు తీశారు. శ్రీ చ‌ర‌ణి రెండు వికెట్లు ప‌డ‌గొట్టింది. శ్రేయాంక పాటిల్‌, క్రాంతి గౌడ్‌లు త‌లా ఓ వికెట్ సాధించారు.

ఇక మంగ‌ళ‌వారం (సెప్టెంబ‌ర్ 22) జ‌రిగే ఫైన‌ల్ మ్యాచ్‌లో శ్రీలంక‌తో భార‌త్ స్వ‌ర్ణ ప‌త‌కం కోసం పోటీప‌డ‌నుంది.