Asian Games 2026 : భారత్ ఖాతాలో మరో స్వర్ణం.. కొరియా ఆదిపత్యానికి బ్రేక్.. గట్టి షాకిచ్చిన అమ్మాయిలు!

Asian Games 2026 : ఏషియన్ గేమ్స్ 2026లో భారత్ క్రీడాకారుల జోరు కొనసాగుతోంది. పలు విభాగాల్లో పతకాల పంట పండిస్తున్నారు. తాజాగా.. భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది.

Asian Games 2026

Asian Games 2026 : ఏషియన్ గేమ్స్ 2026లో భారత్ క్రీడాకారుల జోరు కొనసాగుతోంది. పలు విభాగాల్లో పతకాల పంట పండిస్తున్నారు. తాజాగా.. భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. భారత మహిళల రికర్వ్ ఆర్చరీ జట్టు చరిత్ర సృష్టించింది. కుమ్కుమ్, అంకిత భకత్, కీర్తిలతో కూడిన భారత జట్టు ఫైనల్లో అదిరిపోయే ప్రదర్శన చేసింది. ఫలితంగా దక్షిణ కొరియా ఆధిపత్యానికి తెరదించి స్వర్ణ పతకాన్ని సాధించింది.

Also Read : Gautam Gambhir : వెస్టిండీస్ పై భార‌త్ రికార్డు ఛేద‌న‌.. గౌత‌మ్ గంభీర్ తీవ్ర అసంతృప్తి..

ఒఖాజాకి చువో సోగో పార్క్ వేదికగా జరిగిన మహిళల రికర్వ్ టీమ్ ఫైనల్‌లో భారత్, దక్షిణ కొరియా మధ్య ఫైనల్ పోరు హోరాహోరీగా జరిగింది. భారత ఆర్చర్లు అద్భుతమైన ఏకాగ్రతతో బాణాలను సంధిస్తూ ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించారు. కొరియా తరఫున లీ తొలుత తొమ్మిది పాయింట్లతో ఆరంభించి, మరో తొమ్మిది, ఆ తర్వాత 10 పాయింట్లు సాధించి తమ జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చింది.

భారత్ తరఫున కీర్తి మరోసారి కీలక పాత్ర పోషించింది. ఆమె తొమ్మిది పాయింట్లతో ప్రారంభించగా.. అంకిత భకత్ ఒక దశలో ఎనిమిది పాయింట్స్ సాధించడంతో భారత్‌పై ఒత్తిడి పెరిగింది. అయితే కుమ్కుమ్ తొమ్మిది పాయింట్లు సాధించి భారత్‌ను పోటీలో నిలిపింది. ప్రారంభంలో కొరియా ఆధిపత్యం కొనసాగించినా.. భారత ఆర్చర్లు క్రమంగా పుంజుకున్నారు. రెండో రొటేషన్‌లో కొరియా 8 పాయింట్లతో ప్రారంభించి, కాంగ్ 9 పాయింట్ సాధించింది. చివరి బాణంతో మరో 9 పాయింట్ సాధించి కొరియా 54 స్కోరుతో సెట్‌ను ముగించింది.

భారత జట్టు ఒత్తిడిని అధిగమించింది. కీర్తి తొమ్మిది పాయింట్లతో ఆరంభించగా.. అంకిత కూడా తొమ్మిది పాయింట్లు సాధించింది. మ్యాచ్ కీలక దశలో కుమ్కుమ్‌పై భారీ బాధ్యత పడింది. ఆమె అద్భుతంగా 10 పాయింట్ల బాణం సంధించి భారత్‌కు ఆశలు పెంచింది. చివరగా కీర్తి సంధించిన బాణం 9 పాయింట్లుగా నిర్ధారణ కావడంతో భారత్ సెట్‌ను సమం చేసి మొత్తం మ్యాచ్‌ను 5-3 తేడాతో గెలుచుకుంది.

ఈ విజయంతో భారత మహిళల రికర్వ్ ఆర్చరీ జట్టు ఏషియన్ గేమ్స్‌లో స్వర్ణ పతకాన్ని సాధించడంతో పాటు.. ఈ విభాగంలో కొరియా దీర్ఘకాల ఆధిపత్యానికి ముగింపు పలికింది. భారత ఆర్చర్ల అద్భుత ప్రదర్శన దేశానికి మరో గర్వకారణమైన విజయాన్ని అందించింది.

ఏషియన్ గేమ్స్ 2026లో భారత్ ఇప్పటి వరకు 67 పతకాలు సాధించింది. వీటిలో 11 స్వర్ణాలు, 23 రజతాలు, 33 కాంస్యాలు ఉన్నాయి.