Asian Games 2026 : ఆసియా క్రీడల్లో శనివారం భారత్‌కు పసిడి పంట.. ఏ ఏ క్రీడల్లో స్వర్ణాలంటే?
జపాన్‌లోని ఐచి-నగోయాలో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో శనివారం భారత్‌కు పసిడి పంట పండింది.
- Thota Vamshi Kumar
- Published on- October 3, 2026 / 05:53 PM IST
Asian Games 2026 India won gold medals list on Saturday
Asian Games 2026 : జపాన్‌లోని ఐచి-నగోయాలో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో శనివారం భారత్‌కు పసిడి పంట పండింది. ఆర్చరీ, గోల్ఫ్, క్రికెట్, రెజ్లింగ్, హాకీ క్రీడల్లో భారత్ స్వర్ణపతకాలను కైవసం చేసుకుంది. దీంతో ఇప్పటి వరకు ఆసియా క్రీడలు 2026లో భారత్ స్వర్ణ పతకాల సంఖ్య 21కి చేరింది.
ప్రస్తుతం పతకాల పట్టికలో భారత్ 4వ స్థానంలో ఉంది. 21 స్వర్ణ, 27 రజత, 37 కాంస్య సహా మొత్తం 85 పతకాలను భారత్ సొంతం చేసుకుంది. ఇక 167 స్వర్ణాలతో చైనా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ తరువాత జపాన్, దక్షిణ కొరియాలు వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.
చరిత్ర సృష్టించిన కుంకుమ్ మహోద్..
శనివారం ఉదయం రికర్వ్ ఆర్చరీలో కుంకుమ్ మహోద్ చరిత్ర సృష్టించింది. మహిళల వ్యక్తిగత విభాగంలో ఫైనల్‌లో దక్షిణకొరియా క్రీడాకారిణి ఓయోజిన్‌ను ఓడించి తొలి స్థానంలో నిలిచింది. సింగిల్స్ రికర్వ్ పతకాన్ని గెలుచుకున్న తొలి భారతీయురాలిగా నిలిచింది.
గోల్ఫ్‌లో డబుల్ మెడల్..
శనివారం గోల్ఫ్‌లో రెండు పతకాలు లభించాయి. ఇందులో ఒకటి స్వర్ణం కాగా మరొకటి రజతం.
వ్యక్తిగత గోల్ఫ్ ఈవెంట్‌లో ప్రణవి శరత్ పసిడి పతకాన్ని సాధించింది. ఫైనల్ సింగపూర్, చైనా ప్లేయర్లను వెనక్కి నెట్టి విజయాన్ని సొందం చేసుకుంది. కాగా.. మహిళల గోల్ఫ్ విభాగంలో భారత్ కు స్వర్ణ పతకం రావడం ఇదే తొలిసారి. టీమ్ విభాగంలో రజతం లభించింది.
శ్రేయస్ అయ్యర్ సేన పసిడి..
పురుషుల క్రికెట్‌లోనూ భారత్ పసిడి పతకాన్ని సాధించింది. శనివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను 19 పరుగుల తేడాతో ఓడించి శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత జట్టు గోల్డ్ మెడల్‌ను సాధించింది.
ఫైనల్ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 211 పరుగులు సాధించింది. టీమ్ఇండియా బ్యాటర్లలో అభిషేక్ శర్మ (61; 28 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లు), తిలక్ వర్మ (51 నాటౌట్; 22 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్ సెంచరీలు చేశారు. పాక్ బౌలర్లలో అరఫత్ మిన్హాస్, అహ్మద్ డానియాల్ లు చెరో రెండు వికెట్లు తీయగా.. సైమ్ అయూబ్, అబ్రార్ అహ్మద్ లు తలా ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం 212 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 192 పరుగులకే పరిమితమైంది. పాక్ బ్యాటర్లలో హసన్ నవాజ్ (96; 51 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లు) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ రెండు, వాషింగ్టన్ సుందర్, శివద్ దూబెలు తలా రెండు వికెట్లు పడగొట్టారు.
అమన్ సెహ్రావత్ పసిడి పట్టు..
రెజర్లర్ అమన్ సెహ్రావత్ స్వర్ణ పతకాన్ని సాధించాడు. పురుషుల 57 కేజీల విభాగంలో ప్రపంచ ఛాంపియన్, ఉత్తర కొరియా ఆటగాడు చాంగ్ సాంగ్ హాన్ ను 11-7 తేడాతో ఓడించి గోల్డ్ మెడల్‌ను ముద్దాడాడు.
హాకీలో అదరహో..
పురుషుల హాకీలో భారత జట్టు స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో మలేసియాపై 5-1 తేడాతో విజయం సాధించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. దీంతో ఆసియా క్రీడల్లో భారత స్వర్ణ పతకాల సంఖ్య 21కి చేరంది.
