Lovlina Borgohain : ఆసియా క్రీడ‌ల్లో భార‌త్‌ ఖాతాలో మ‌రో స్వ‌ర్ణం.. బాక్సింగ్‌లో లవ్లీనాకు గోల్డ్ మెడ‌ల్

బాక్సింగ్‌లో ల‌వ్లీనా బోగోహైన్ (Lovlina Borgohain) గోల్డ్ మెడ‌ల్‌ను సాధించింది.

Asian Games 2026 Lovlina Borgohain wins gold medal in womens 75kg boxing

Lovlina Borgohain : ఆసియా క్రీడ‌లు 2026లో భార‌త్ ఖాతాలో మ‌రో స్వ‌ర్ణ ప‌త‌కం వ‌చ్చి చేరింది. బాక్సింగ్‌లో ల‌వ్లీనా బోగోహైన్ గోల్డ్ మెడ‌ల్‌ను సాధించింది. మ‌హిళ‌ల 75 కిలోల విభాగంలో పోటీప‌డిన ల‌వ్లీనా ఫైన‌ల్‌లో చైనాకు చెందిన బావో జియిను ఓడించి ప‌త‌కాన్ని సాధించింది.

ఫైన‌ల్ మ్యాచ్‌ ప్రారంభ రౌండ్‌లో బావో జియి దూకుడుగా క‌నిపించింది. అయిన‌ప్ప‌టికి చైనీస్ క్రీడాకారిణిపై ఎదురుదాడి చేయడంతో ల‌వ్లీనా 3-2 స్కోరుతో మొదటి రౌండ్‌ను కైవసం చేసుకుంది. ఇక రెండో రౌండ్‌లోనూ బావో తన దూకుడు వ్యూహాలను కొనసాగించింది. అయితే, మొదటి రౌండ్‌లో విజయం సాధించి ఆత్మవిశ్వాసంతో ఉన్న లవ్లీనా బోర్గోహైన్.. తన సంయమనాన్ని కోల్పోకుండా రెండవ రౌండ్‌లో కూడా చైనీస్ క్రీడాకారిణి దాడులను ఎదుర్కొని 4-1 స్కోరుతో ఆ రౌండ్‌ను కైవసం చేసుకుంది.


ఇదే జోరు మూడో రౌండ్‌లో కూడా కొనసాగింది. చైనా క్రీడాకారిణిపై 2-0 ఆధిక్యంలో ఉన్న లవ్లీనా.. బావోను తనపైకి దూసుకొచ్చేలా చేసి, సరైన సమయంలో ఎదురుదాడి చేసి మూడో రౌండ్‌ను కూడా కైవసం చేసుకుంది. తద్వారా 5-0 ఏకగ్రీవ విజయంతో బౌట్‌ను గెలిచింది. 2026 ఆసియా క్రీడల్లో భారతదేశానికి ఇది 12వ స్వర్ణ ప‌త‌కం.

ఇప్ప‌టి వ‌ర‌కు ఆసియా క్రీడ‌ల్లో భార‌త ఖాతాలో 70 ప‌త‌కాలు చేరాయి. వీటిలో 12 స్వ‌ర్ణాలు, 24 ర‌జ‌తాలు, 34 కాంస్య ప‌త‌కాలు ఉన్నాయి. ప్ర‌స్తుతం ప‌ట్టిక‌లో భార‌త్ ఆరో స్థానానికి చేరుకుంది.