Ayush Mhatre comments after India win U19 World Cup 2026 trophy
U19 World Cup 2026 : అండర్-19 ప్రపంచకప్ 2026 విజేతగా నిలవడంపై టీమ్ఇండియా కెప్టెన్ ఆయుత్ మాత్రే ఆనందాన్ని వ్యక్తం చేశాడు. తమ సీనియర్లు అయిన రోహిత్ శర్మ, హర్మన్ ప్రీత్ కౌర్‌ల వారసత్వాన్ని కొనసాగించాలని భావించామని, ఎట్టకేలకు ఆ లక్ష్యాన్ని చేరుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నాడు. వారిద్దరూ ప్రపంచకప్‌లను గెలిచారని, ఇప్పుడు తాము గెలిచామన్నాడు. ఈ విజయాన్ని వర్ణించడానికి తన దగ్గర మాటలు లేవన్నాడు. ఏదీ ఏమైనప్పటికి కూడా తమ కెరీర్‌లోనే కాకుండా భారత క్రికెట్ చరిత్రలో ఇది ఓ మరుపురాని క్షణంగా నిలిచిపోతుందన్నాడు.
తమ ప్లేయర్లు అద్భుతంగా ఆడారని, అనుకున్న ప్రణాళికలను మైదానంలో చక్కగా అమలు చేశారని మెచ్చుకున్నాడు. తామంతా సహజసిద్ధమైన ఆటను ఆడాలని అనుకున్నామని, అదే విధంగా ఆడినట్లు చెప్పుకొచ్చాడు. అందుకనే తానెంతో సంతోషంగా ఉన్నానని అన్నాడు.
ఇక వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్ పై మాట్లాడుతూ.. అతడిపై ప్రశంసల వర్షం కురిపించాడు ఆయుష్ మాత్రే. అతడి గురించి ఏం చెప్పాలో తనకు అర్థం కావడం లేదన్నాడు. అతడు ఓ అద్భుతమైన బ్యాటర్ అని తెలుసు. అతడు ఏం చేయగలడో ఈ మ్యాచ్‌లో చూపించాడని అన్నాడు. గత కొన్నాళ్లుగా తమ కోసం జట్టు సహాయక సిబ్బంది ఎంతో కష్టపడుతున్నారని అన్నాడు. వారి గురించి ఎంత చెప్పినా తక్కువే అని తెలిపాడు. ఈ గెలుపులో వారికి కూడా క్రెడిట్ దక్కుతుందన్నాడు. ఇక అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ.. మైదానంలో తమకు మంచి మద్దతుగా నిలిచారన్నాడు. ఇందుకు కృతజ్ఞతలు తెలియజేశాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 411 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత బ్యాటర్లలో వైభవ్ సూర్యవంశీ (175; 80 బంతుల్లో 15 ఫోర్లు, 15 సిక్సర్లు) విధ్వంసకర శతకం బాదాడు. ఆయుష్ మాత్రే (53), అభిజ్ఞాన్ కుంద్(40) లు రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో మింటో మూడు వికెట్లు తీయగా.. అలెక్స్ గ్రీన్ రెండు వికెట్లు పడగొట్టాడు.
అనంతరం 412 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 40.2 ఓవర్లలో 311 పరుగులకే ఆలౌటైంద. ఇంగ్లాండ్ బ్యాటర్లలో కాలెబ్ ఫాల్కనర్ (115; 67 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్సర్లు) మెరుపు సెంచరీ చేశాడు. బెన్ డాకిన్స్ (66), బేస్ మేస్ (45)లు రాణించారు. భారత బౌలర్లలో అంబ్రిష్ మూడు వికెట్లు తీశౄడు. కనిష్క్ చౌహాన్, దీపేశ్ దేవేంద్రన్ చెరో రెండు వికెట్లను పడగొట్టారు.