సైనా, శ్రీకాంత్ అవుట్.. ఆశలన్నీ సింధూపైనే

ప్రతిష్టాత్మక ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో తెలుగు స్టార్ షట్లర్ పీవీ సింధు అదరగొట్టినప్పటికీ సైనా నెహ్వాల్‌, కిదాంబి శ్రీకాంత్‌, ప్రణయ్‌లు క్వార్టర్స్‌ చేరకుండానే నిష్క్రమించారు. 16వ సీడ్ భమిడిపాటి సాయిప్రణీత్‌ సంచలనం సృష్టించాడు. ప్రపంచ 8వ ర్యాంకర్‌, ఆరో సీడ్‌ ఆంథోనీ జింటింగ్‌ (ఇండోనేసియా)ను ఓడించి క్వార్టర్‌ఫైనల్లోకి చేరుకోగలిగాడు. 

గురువారం జరిగిన పురుషుల ప్రిక్వార్టర్స్‌ పోరులో ప్రణీత్‌ 21-19, 21-13తో జిన్‌టింగ్‌ను చిత్తుచేసి క్వార్టర్స్‌లో స్థానం దక్కించుకున్నాడు. 43 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో ప్రణీత్‌ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. ఇప్పటి వరకు వీరిద్దరు ఐదు సార్లు తలపడగా.. మూడింట్లో సాయి, రెండింట్లో జిన్‌టింగ్‌ పైచేయి సాధించారు.

మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో సింధు 21-14, 21-6తో తొమ్మిదో సీడ్‌, అమెరికా క్రీడాకారిణి బీవెన్‌ జాంగ్‌ను సునాయాసంగా ఓడించింది. 34 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో సింధు పూర్తి ఆధిపత్యం సాధించింది. క్వార్టర్స్‌లో రెండో సీడ్‌, చైనీస్‌ తైపీ క్రీడాకారిణి తై జు యింగ్‌ను సింధు ఢీకొంటుంది.

మహిళల సింగిల్స్‌ మరో ప్రిక్వార్టర్స్‌లో ఎనిమిదో సీడ్‌ సైనా 21-15, 25-27, 12-21తో మియా బ్లిచ్‌ఫెల్ట్‌ (డెన్మార్క్‌) చేతిలో పరాజయం మూటగట్టుకుంది. కిదాంబి శ్రీకాంత్‌ ప్రిక్వార్టర్స్‌లో 14-21, 13-21తో థాయ్‌లాండ్‌ క్రీడాకారుడు వాంగ్‌చెరోయిన్‌ చేతిలో పరాజయం పాలయ్యాడు. రెండో రౌండ్లో దిగ్గజ ఆటగాడు లిన్‌ డాన్‌ను ఓడించిన సంచలనం సృష్టించిన ప్రణయ్‌.. టాప్‌ సీడ్‌ కెంటో మొమొటా చేతిలో 19-21, 12-21తో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు.