BAN vs PAK : బంగ్లాదేశ్ చేతిలో ఓట‌మి.. పాక్ హెడ్ కోచ్ మైక్ హెస్సన్ కీల‌క వ్యాఖ్య‌లు..

త‌మ జ‌ట్టు ఓట‌మిపై (BAN vs PAK ) పాక్ హెడ్ కోచ్ మైక్ హెస్సన్ స్పందించాడు.

BAN vs PAK 1st ODI Pakistan head coach Mike Hesson reacts to teams poor batting performance

  • తొలి వ‌న్డేలో బంగ్లాదేశ్ చేతిలో ఓట‌మి
  • పాక్ హెడ్ కోచ్ మైక్ హెస్సన్ కామెంట్స్‌
  • బ్యాట‌ర్లే కొంప‌ముంచారు

BAN vs PAK : టీ20 ప్రపంచ కప్ 2026 సెమీఫైనల్‌కు సల్మాన్ అలీ అఘా నాయ‌క‌త్వంలోని పాకిస్థాన్ జ‌ట్టు అర్హత సాధించడంలో విఫలమైనప్పటి నుండి ఆ జ‌ట్టు ప్రధాన కోచ్ మైక్ హెస్సన్ పై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇక మూడు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్‌లో భాగంగా ఢాకా వేదిక‌గా బుధ‌వారం బంగ్లాదేశ్‌తో జ‌రిగిన తొలి వ‌న్డే మ్యాచ్‌లో పాకిస్థాన్ 8 వికెట్ల తేడాతో ఘోర ప‌రాజ‌యం చవిచూసింది. పాక్ వ‌న్డే చ‌రిత్ర‌లో ఇది నాలుగో అతి పెద్ద ఓట‌మి కావ‌డంతో హెస్స‌న్ పై మ‌రింతగా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఈక్ర‌మంలో తొలి వ‌న్డేలో ఓట‌మిపై అత‌డు స్పందించాడు. బ్యాటింగ్ వైఫ‌ల్య‌మే ఇందుకు కార‌ణం అని చెప్పాడు.

ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 30.4 ఓవ‌ర్ల‌లో 114 ప‌రుగుల‌కే ఆలౌటైంది. పాక్ బ్యాట‌ర్ల‌లో ఫహీం అష్రఫ్ (37), సాహిబ్జాదా ఫర్హాన్ (27) లు రాణించారు. బంగ్లా బౌల‌ర్ల‌లో న‌హిద్ రాణా ఐదు వికెట్లు తీయ‌గా.. మెహిది హసన్ మీరాజ్ మూడు వికెట్లు, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్ చెరో వికెట్ ప‌డ‌గొట్టారు.

Suryakumar Yadav : దక్షిణాఫ్రికాతో ఓటమి త‌రువాత భార‌త్ పుంజుకోవ‌డానికి బాహుబ‌లి పాట ఎలా సాయం చేసిందంటే?

ఆ త‌రువాత తంజిద్ హసన్ తమీమ్ (67 నాటౌట్; 42 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స‌ర్లు) అర్ధ‌శ‌త‌కంతో రాణించ‌డంతో బంగ్లాదేశ్ 115 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 15.1 ఓవ‌ర్ల‌లో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. పాక్ బౌల‌ర్ల‌లో షాహీన్ అఫ్రిది, మహ్మద్ వసీం జూనియర్ లు చెరో వికెట్ తీశారు.

ఇక మ్యాచ్ అనంత‌రం త‌మ జ‌ట్టు ఓట‌మిపై పాక్ హెడ్ కోచ్ మైక్ హెస్సన్ స్పందించాడు. త‌మ జ‌ట్టు బ్యాటింగ్ ప్ర‌ద‌ర్శ‌న నిరాశ‌ప‌రిచింద‌న్నాడు. త‌ప్పు మొత్తం బ్యాట‌ర్ల‌దేన‌ని అన్నాడు. పిచ్ బాగానే ఉంద‌న్నాడు. యువ ఆట‌గాళ్లు నేర్చుకునే ద‌శ‌లో ఉన్నార‌న్నాడు. బంగ్లా బౌలర్ల‌కు క్రెడిట్ ఇవ్వాల్సిందేన‌ని చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా నహిద్ రాణా అసాధారణంగా బౌలింగ్ చేశాడ‌ని మెచ్చుకున్నాడు.

అత‌డు బౌలింగ్ రాక‌ముందు వ‌ర‌కు త‌మ బ్యాట‌ర్లు బాగానే ఆడార‌ని అన్నాడు. అయితే.. రాణా మ్యాచ్ స్వ‌రూపాన్నే మార్చేశాడ‌ని చెప్పుకొచ్చాడు. అత‌డు బౌలింగ్‌లో వైవిధ్యంతో పాటు బౌన్స్ ఉంద‌న్నాడు. అయితే.. త‌మ‌ బ్యాట‌ర్లు అత‌డిని ఆడ‌డంలో విఫ‌లం అయ్యార‌న్నాడు. ఈ ఓట‌మి నుంచి పాఠాలు నేర్చుకుని బ‌లంగా తిరిగి వ‌స్తామ‌ని చెప్పుకొచ్చాడు.

LSG : ఐపీఎల్ 2026 ముందు కీల‌క ప‌రిణామం.. అమ్మ‌కానికి ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌..!

ఈ విజ‌యంతో బంగ్లాదేశ్ మూడు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇరు జ‌ట్ల మ‌ధ్య రెండో వ‌న్డే మార్చి 13న జ‌ర‌గ‌నుంది.