Akshara Gupta : వైభవ్ తర్వాత బీహార్ నుంచి మరో క్రికెట్ సంచలనం.. వార్నీ.. 126బంతుల్లో 306 పరుగులు! కొట్టుడేకొట్టుడు..
Akshara Gupta : బీహార్‌కు చెందిన యువ క్రికెటర్ అక్షర గుప్తా ట్రిపుల్ సెంచరీతో అందరి దృష్టిని ఆకర్షించింది. కేవలం 126 బంతుల్లోనే 306 పరుగులు నమోదు చేసింది.
- Harish Thanniru
- Updated on- June 18, 2026 / 10:49 PM IST
Akshara Gupta
Akshara Gupta : క్రికెట్ ప్రపంచంలో బీహార్ యువ ప్రతిభావంతులు సంచలనాలు నమోదు చేస్తున్నారు. ఇప్పటికే బీహార్ కు చెందిన యువ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ తన అద్భుత బ్యాటింగ్‌తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాక 13ఏళ్లకే ఐపీఎల్ కాంట్రాక్ట్ దక్కించుకుని అందరినీ ఆశ్చర్యపోయేలా చేశాడు. ఐపీఎల్ లో రికార్డుల మోత మోగించిన వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం భారత టీ20 జట్టులోనూ చోటు దక్కించుకున్నారు. తాజా.. బీహార్ నుంచి మరో యువ క్రికెటర్ అక్షర గుప్తా సంచలన ఇన్నింగ్స్‌తో క్రికెట్ ప్రేమికుల దృష్టిని తనవైపు తిప్పుకుంది.
బీహార్‌కు చెందిన యువ క్రికెటర్ అక్షర గుప్తా ట్రిపుల్ సెంచరీతో అందరి దృష్టిని ఆకర్షించింది. బీహార్ అండర్-19 వన్డే టోర్నమెంట్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో అక్షర గుప్తా ప్రత్యర్థి బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ అజేయంగా 306 పరుగులు చేసింది. కేవలం 126 బంతుల్లోనే భారీ స్కోర్ నమోదు చేయడం విశేషం. ఆమె ఇన్నింగ్స్‌లో 55 ఫోర్లు, ఎనిమిది సిక్సర్లు బాదింది. మ్యాచ్ ప్రారంభం నుంచే దూకుడుగా ఆడిన అక్షర గుప్తా.. 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ, 34 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకుంది.
15ఏళ్ల అక్షర తూర్పు చంపారన్ జిల్లా రక్సాల్ అనే పట్టణంలో జన్మించింది. అక్షర తండ్రి రాజకిషోర్ షా రక్సౌల్‌లో చికెన్ షాపు నడుపుతుండగా.. ఆమె తల్లి రీనా గుప్తా గృహిణి. ఆమె మామయ్య రామ్‌కృపా గుప్తా ప్రతి మ్యాచ్ కు అక్షరతో పాటు వెళ్తారు. రక్సౌల్ వంటి చిన్న పట్టణం నుండి మహిళల క్రికెట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అక్షర. కృషి, పట్టుదలతో ఆడుతూ 14ఏళ్ల వయస్సులోనే అండర్ -19 మహిళల జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించింది. బిహార్ తరఫున రెండేళ్ల వ్యవధిలో వరుసగా నాలుగు బీసీసీఐ మహిళా టోర్నమెంట్లు ఆడిన తొలి మహిళా క్రికెటర్‌గా నిలిచింది. ఇటీవల వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ స్థాయిలో మెరిసిన నేపథ్యంలో, ఇప్పుడు అక్షర గుప్తా కూడా తన అద్భుత ప్రదర్శనతో బీహార్ క్రికెట్ ప్రతిభను మరోసారి దేశానికి చాటిచెప్పింది.
అక్షరకు బీహార్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు హర్షవర్దన్ అభినందనలు తెలిపారు. బీహార్ మహిళా క్రికెటర్లు తమ ప్రదర్శనల ద్వారా రాష్ట్రానికి నిరంతరం కీర్తిని తెస్తున్నారని పేర్కొన్నారు. క్రీడాకారులకు మెరుగైన అవకాశాలు కల్పించేందుకు బీసీఏ నిరంతరం కృషి చేస్తోందని, ఇలాంటి ఇన్నింగ్సులు యువ క్రికెటర్లకు స్ఫూర్తినిస్తాయని అన్నారు.
