FIFA World Cup : ఫిఫా ప్రపంచకప్‌లో ఏలియన్లు! మ్యాచ్ జరుగుతుండగానే ఫుట్‌బాల్ ప్లేయర్ల కిడ్నాప్? వైరల్ జోస్యంతో ప్రపంచం ఉలిక్కిపాటు!
బ్రెజిల్‌కు చెందిన ప్రముఖ జ్యోతిష్యురాలు వో బహియానా (FIFA World Cup) చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాశం అయ్యాయి.
- Thota Vamshi Kumar
- Updated on- June 25, 2026 / 12:59 PM IST
Brazil vs Scotland match Alien invasion prediction goes viral
FIFA World Cup : ఫిఫా ప్రపంచకప్ 2026లో భాగంగా మయామి వేదికగా నేడు బ్రెజిల్-స్కాట్లాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే.. ఈ మ్యాచ్‌కు ముందు ఓ విచిత్రమైన జోస్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బ్రెజిల్‌కు చెందిన ప్రముఖ జ్యోతిష్యురాలు వో బహియానా చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాశం అయ్యాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో 24.4 మిలియన్లకు పైగా ఫాలోవర్లు కలిగిన ఆమె.. ఏలియన్లు భూమిపైకి వస్తాయని చెప్పింది. ఈ మ్యాచ్ జరిగే స్టేడియాన్ని లక్ష్యంగా చేసుకోవచ్చునని హెచ్చరించింది.
వో బహియానా తెలిపిన దాని ప్రకారం.. తనకు కలలో మియామి స్టేడియం పైన అనేక అంతరిక్ష నౌకలు కనిపించాయని, మొదట వచ్చిన నౌక ఆటగాళ్లను కిడ్నాప్ చేస్తున్న దృశ్యాలు తాను చూశానని తెలిపింది. ఆ తరువాత ఓ భారీ మదర్‌షిప్ స్టేడియం మీదకు వచ్చి యాంత్రిక చేతుల సహాయంతో వేలాది మంది అభిమానులను ఎత్తుకెళ్లినట్లు కనిపించిందని తెలిపింది.
అంతేకాదండోయ్.. మరో అంతరిక్ష నౌకలో రెప్టిలియన్స్(బల్లి లాంటి రూపం ఉండే గ్రహాంతర వాసులు) లను చూసినట్లు చెప్పింది. ఈ ఘటనల కారణంగా స్టేడియంలో అరుపులు, ఏడుపులు, భయానక పరిస్థితులు నెలకొన్నాయని ఆమె వివరించింది. ఇలా ఒకే విధమైన కల తనకు రెండు సార్లు వచ్చిందని, అందుకనే తనకు భయంగా ఉందని చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
చాలామంది ఆమె చెప్పిన జోస్యాన్ని సరదాగా తీసుకున్నప్పటికీ, ఆమె అభిమానుల్లో కొందరు మాత్రం దీనిని సీరియస్‌గా పరిగణిస్తున్నారు. గతంలో రియో గ్రాండే డో సుల్ వరదల గురించి బ్రెజిలియన్ సంగీతకారుల మరణాలు వంటి కొన్ని సంఘటనలను ఆమె ముందుగానే చెప్పిందని, అవి నిజం అయ్యాయని అనుచరులు గుర్తుచేస్తున్నారు.
కాగా మ్యాచ్ ప్రారంభానికి కొన్ని గంటల ముందు లైవ్ స్ట్రీమ్‌లో మాట్లాడిన బహీయానా.. తన జోస్యానికి కట్టుబడి ఉన్నానని చెప్పారు. ‘నా కలలు చాలా వరకు నిజమయ్యాయి.. కాబట్టి ఈరోజు ఏదో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరగొచ్చు. అయితే నేను కలలో చూసినట్లే ప్రతిదీ జరగాలని లేదు. బహుశా షిప్ రావచ్చు కానీ ఆటగాళ్లను తీసుకెళ్లకపోవచ్చు.’ అని ఆమె జోస్యంలో కాస్త టర్న్ తీసుకున్నారు.
అలాగే తనను ఎగతాళి చేసే వారికి హెచ్చరించారు. హద్దులు దాటి విమర్శిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు.
ఇక ఈ వార్తలు వైరల్‌గా మారగా.. సోషల్ మీడియాలో ఏలియన్స్ స్టేడియం పై ఉన్నట్లు ఏఐతో రూపొందించిన వీడియోలు, ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. మయామి అంతర్జాతీయ విమానాశ్రయం కూడా సరదాగా ఒక ఏఐ ఫోటోను పంచుకుంది. స్టేడియంపై స్పెస్ షిప్ ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. ఈ రాత్రి స్కాట్లాండ్ వర్సెస్ బ్రెజిల్ మ్యాచ్ కోసం FAA (ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్) విమాన ఆంక్షలు విధించింది, ఎందుకంటే అక్కడ కొన్ని వింత ఆకాశ వింతలు కనిపిస్తున్నాయి అని పోస్ట్ పెట్టింది. అయితే అది కేవలం సరదా కోసమే పెట్టిన పోస్టుగా వివరించింది.
ఇదిలా ఉంటే.. మ్యాచ్ సమయంలో నిజంగా ఏదైనా అసాధారణ ఘటన జరుగుతుందా? లేక ఇది కేవలం ఒక వైరల్ జోస్యంగానే మిగిలిపోతుందా? అన్నది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.
