RCB కొత్త లోగోపై కోహ్లీ: వావ్.. లోగో చూసి థ్రిల్ అయ్యా

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆర్సీబీ నయా లోగో చూసి థ్రిల్‌కు గురయ్యాడట. ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశీవాలీ లీగ్ అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్ కు ముందు ఆర్సీబీ కొత్త హంగులతో  సిద్ధమవుతోంది. ఇన్నేళ్ల కలలను ఈ సీజన్ లో అయినా నిజం చేసుకోవాలని తహతహలాడుతోంది. 

విరాట్ తన అధికారిక ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేస్తూ.. ‘లోగో పనేంటంటే మనమేంటో తెలియజేయడం. ఆర్సీబీ లోగో చూసి థ్రిల్ అయ్యాను. మైదానంలోకి అడుగుపెట్టేందుకు చాలెంజింగ్ ఉత్సాహాన్ని నింపింది. ఐపీఎల్ 2020 కోసం ఆగలేకపోతున్నా’ అంటూ ట్వీట్ చేశాడు. 2016 తర్వాత ప్లే ఆఫ్ దశను కూడా దాటలేకపోయిన జట్టుకు ఇంత అవసరమా అని నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. 

ప్రస్తుతం టీమిండియాతో న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న కోహ్లీ రెండు టెస్టుల లాంగెస్ట్ ఫార్మాట్ కోసం సిద్ధమవుతున్నాడు. ఫిబ్రవరి 21నుంచి మొదలుకానున్న ఈ సిరీస్ తో పర్యటన పూర్తవుతుంది. ఆతిథ్య జట్టుతో ఆడిన భారత్.. టీ20లో 5-0తేడాతో గెలిస్తే ధీటైన బదులిచ్చిన కివీస్ 3-0తేడాతో వన్డే సిరీస్ ను ఎగరేసుకుపోయింది.