IPL 2027 Retentions : 20+ కోట్ల ఖరీదైన ప్లేయర్లను ఆ ఫ్రాంఛైజీలు వదిలేస్తాయి.. పుజారా కామెంట్స్..
IPL 2027 Retentions : ఐపీఎల్ 2027 సీజన్‌కు సంబంధించి ఆటగాళ్ల రిటెన్షన్ గడువు నవంబర్ 17తో ముగియనుంది.
- Thota Vamshi Kumar
- Published on- November 9, 2026 / 11:00 AM IST
Cheteshwar Pujara Predicts Two Rs 20 Crore Plus Stars May Be Released
IPL 2027 Retentions : ఐపీఎల్ 2027 సీజన్‌కు సంబంధించి ఆటగాళ్ల రిటెన్షన్ గడువు నవంబర్ 17తో ముగియనుంది. మరో వారం రోజులకు పైగా మాత్రమే సమయం ఉండటంతో ఫ్రాంచైజీలు తమ వద్ద అట్టిపెట్టుకోవాల్సిన ఆటగాళ్లు, విడుదల చేయాల్సిన క్రికెటర్లపై కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే పలు ట్రేడింగ్ వార్తలు తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా పంజాబ్ కింగ్స్‌కు వెళ్లడం, అందుకు బదులుగా అర్ష్‌దీప్ సింగ్ ముంబై ఇండియన్స్‌కు చేరడం వంటి వార్తలు క్రికెట్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ పుజారా ఐపీఎల్‌లోని పది ఫ్రాంచైజీలు విడుదల చేసే అవకాశం ఉన్న ఆటగాళ్లపై తన అంచనాలను తెలియజేశాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) నుంచి కామెరూన్ గ్రీన్‌ను విడుదల చేసి వేలంలో తిరిగి దక్కించుకునే అవకాశం ఉందన్నాడు. ఐపీఎల్ 2026 వేలంలో గ్రీన్ ఏకంగా రూ 25.20 కోట్లకు కేకేఆర్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
చెన్నై సూపర్ కింగ్స్ విషయానికి వస్తే.. మాట్ హెన్రీ, మాథ్యూ షార్ట్‌లలో ఒకరిని విడుదల చేసే అవకాశం ఉందని చెప్పాడు. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మాత్రం తన జట్టులోని ఆటగాళ్లను ఎవరినీ విడుదల చేయకపోవచ్చునని అన్నాడు.
ఇక ముంబై ఇండియన్స్ నుంచి హార్దిక్ పాండ్యాను విడుదల చేసే అవకాశం ఉందన్నాడు. గుజరాత్ టైటాన్స్ విషయానికి వస్తే.. రాహుల్ తెవాటియా, షారుఖ్ ఖాన్‌లలో ఒకరికి ఉద్వాసన పలికే అవకాశం ఉందన్నాడు. ఈ ఇద్దరూ అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోయారని చెప్పుకొచ్చాడు.
పంజాబ్ కింగ్స్ నుంచి జేవియర్ బార్ట్‌లెట్, లాకీ ఫెర్గూసన్‌లలో ఒకరిని విడుదల చేయవచ్చని చెప్పాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ నుంచి జయదేవ్ ఉనద్కట్, హర్షల్ పటేల్‌లలో ఒకరిని వదులుకునే అవకాశం ఉందని అంచనా వేశాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి పృథ్వీ షా, కరుణ్ నాయర్‌లలో ఒకరికి ఉద్వాసన తప్పకపోవచ్చని చెప్పాడు. లక్నో సూపర్ జెయింట్స్ నుంచి రూ.21 కోట్ల భారీ ధర పలికిన నికోలస్ పూరన్‌ను విడుదల చేసే అవకాశం ఉందన్నాడు. అయితే పూరన్‌ను కొనసాగించాలని జట్టు యాజమాన్యం నిర్ణయిస్తే.. ఆయుష్ బదోనీని విడిచిపెట్టే అవకాశం ఉందన్నాడు.
ఇక రాజస్థాన్ రాయల్స్ ఎవరిని విడుదల చేయకపోవచ్చునని, చేస్తే మాత్రం ఓ భారత ఆటగాడికి వీడ్కోలు పలికే అవకాశం ఉందన్నాడు.
