Glenn Maxwell : గ్లెన్ మాక్స్‌వెల్‌కు భారీ షాక్ ఇచ్చిన క్రికెట్ ఆస్ట్రేలియా.. ఇక ఆసీస్ తరుపున మళ్లీ ఆడనట్లే!
స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్‌కు (Glenn Maxwell) క్రికెట్ ఆస్ట్రేలియా భారీ షాక్ ఇచ్చింది.
- Thota Vamshi Kumar
- Published On : April 1, 2026 / 11:02 AM IST
Cricket Australia announced central contracts for 2026-27 season Glenn Maxwell dropped
- 2026-27 సెంట్రల్ కాంట్రాక్టు జాబితాను ప్రకటించిన క్రికెట్ ఆస్ట్రేలియా
- మాక్స్‌వెల్‌కు దక్కని చోటు
- టెస్టు స్పెషలిస్టులకు అధిక ప్రాధాన్యత
Glenn Maxwell : స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా భారీ షాక్ ఇచ్చింది. సెంట్రల్ కాంట్రాక్టు జాబితా నుంచి అతడిని తప్పించింది. బుధవారం 2026-27 సీజన్‌కు సంబంధించి సెంట్రల్ కాంట్రాక్టు జాబితాను క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. 21 మందికి ఈ జాబితాలో చోటు దక్కింది. ఈ జాబితాలో స్టార్ ఆల్‌రౌండర్ మాక్స్‌వెల్‌కు చోటు దక్కలేదు.
ఈ నేపథ్యంలో జాతీయ జట్టు దీర్ఘకాలిక ప్రణాళికలలో మాక్స్‌వెల్‌కు స్థానం లేదా అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. 2025 జూన్‌లో మాక్స్‌వెల్ వన్డేలకు రిటైర్‌మెంట్ ప్రకటించాడు. కాగా.. అతడు 2017లో చివరి సారిగా ఆసీస్ తరుపున టెస్టు మ్యాచ్ ఆడాడు. ప్రస్తుతం కేవలం టీ20ల్లోనే అతడు ఆసీస్ తరుపున ఆడుతున్నాడు. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్ 2026లోనూ అతడు పేలవ ప్రదర్శన చేశాడు.
టెస్టు స్పెషలిస్టులకు అధిక ప్రాధాన్యత..
ఆస్ట్రేలియా ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్టు జాబితాను చూస్తే టెస్టు స్పెషలిస్టులకు అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లుగా అర్థమవుతోంది. రాబోయే 12 నెలల్లో ఆస్ట్రేలియా షెడ్యూల్ ఫుల్ బిజీగా ఉంది. మొత్తంగా ఆసీస్ 15 టెస్టులు ఆడనుంది. వీటిలో స్వదేశంలో ఆరు మ్యాచ్‌లు ఆడనుంది. ఇందులో బంగ్లాదేశ్‌తో రెండు, న్యూజిలాండ్‌తో నాలుగు టెస్టులు ఉన్నాయి. ఇక విదేశాల్లో 8 టెస్టులు.. దక్షిణాఫ్రికాలో మూడు, భారత్‌లో ఐదు టెస్టులు ఉన్నాయి.
రిటైర్ కావడంతో ఉస్మాన్ ఖవాజా, పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న సామ్ కొన్‌స్టాస్ తో పాటు జై రిచర్డ్‌సన్, లాన్స్ మోరిస్, మాట్ షార్ట్ లకు సెంట్రల్ కాంట్రాక్టులో చోటు దక్కలేదు.
PBKS vs GT : అర్ష్‌దీప్ సింగ్ వచ్చి ఒక్కటే చెప్పాడు.. విజయం పై శ్రేయస్ అయ్యర్ హాట్ కామెంట్స్..
ఇక యాషెస్ సిరీస్‌లో 22.23 సగటుతో 201 పరుగులు మాత్రమే చేసిన జేక్ వెదరాల్డ్ పై క్రికెట్ ఆస్ట్రేలియా నమ్మకం ఉంచింది. ఇంగ్లాండ్‌పై రెండు మ్యాచ్‌లలో ఏడు వికెట్లు తీసిన బ్రెండన్ డాగెట్ తొలిసారి సెంట్రల్ కాంట్రాక్టులో చోటు సంపాదించుకున్నారు. మైఖేల్ నేసర్, టాడ్ మర్ఫీ లు తిరిగి జాబితాలోకి వచ్చారు.
2026-27 కోసం సెంట్రల్ కాంట్రాక్టులో చోటు దక్కించుకున్న ఆసీస్ ఆటగాళ్లు వీరే..
జేవియర్ బార్ట్‌లెట్, స్కాట్ బోలాండ్, అలెక్స్ కేరీ, పాట్ కమ్మిన్స్, బ్రెండన్ డాగెట్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, మార్నస్ లాబుషేన్, నాథన్ లియోన్, మిచెల్ మార్ష్, టాడ్ మర్ఫీ, మైఖేల్ నెసర్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, జేక్ వెదరాల్డ్, బ్యూ వెబ్‌స్టర్, ఆడమ్ జంపా.
