3 బంతుల్లో 14: బ్యాటింగ్ స్టైల్ మార్చి బాదేసిన వార్నర్

బాల్ ట్యాంపరింగ్ కారణంగా నిషేదాన్ని ఎదుర్కొంటున్న వార్నర్ మార్చి ఆఖరి వారం తర్వాత పునరాగమనం చేయనున్నాడు. స్వతహాగా లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్ అయిన వార్నర్ ఆస్ట్రేలియా జట్టుకు ఎప్పటినుంచి ఆడతాడోననేది మాత్రం ఆ దేశ క్రికెట్ బోర్టు చేతుల్లో ఉంది. నిషేదానికి గురైన స్మిత్, బాన్ క్రాఫ్ట్, వార్నర్‌లు ఫామ్ కాపాడుకునేందుకు దేశీవాలీ లీగ్‌లలో ఆడుతున్నారు. ఈ క్రమంలో కెనడా లీగ్ అనంతరం బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఆడుతున్నాడు. బుధవారం జరిగిన మ్యాచ్‌లో తన బ్యాటింగ్ సత్తా చాటి జట్టుకు విజయాన్ని తెచ్చిపెట్టాడు. 

వార్నర్‌ బీపీఎల్‌లో సిల్హెట్‌ సిక్సర్స్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యహరిస్తున్నాడు. బుధవారం రంగాపూర్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 36 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అజేయంగా 61 పరుగులు చేయగలిగాడు. ఈ మ్యాచ్‌లో వార్నర్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్‌గా మాత్రమే కాకుండా రైట్ హ్యాండ్‌తోనూ అలరించాడు. ఈ మేరకు తన బ్యాటింగ్‌ గార్డ్‌ను మార‍్చుకుని బ్యాటింగ్ చేశాడు. 

 

స్వతహాగా వార్నర్‌ ఎడమచేతి వాట బ్యాట్స్‌మన్‌.. కానీ, గేల్‌ వేసిన 19 ఓవర్‌ నాల్గో బంతికి అనూహ్యంగా గార్డ్‌ మార్చుకున్నాడు. అంతకుముందు బాల్‌ను హిట్టింగ్‌లో విఫలం కావడంతో కుడి చేతి వాటం బ్యాటింగ్‌ చేయడానికి నిశ్చయించుకున్నాడు. తన విన్నపాన్ని ఫీల్డ్‌ అంపైర్‌కు తెలిపాడు. ఇలా రైట్‌ హ్యాండ్‌తో ఆడిన మొదటి బంతిని సిక్స్‌గా మలిచాడు. ఆ తర్వాత వరుస బంతుల్ని రెండు ఫోర్లుగా బాది అలరించాడు. మొత్తంగా 61 పరుగులు సాధించిన వార్నర్ లెఫ్ట్‌ హ్యాండర్‌గా 33 బంతుల్లో 47, రైట్‌ హ్యాండర్‌గా 3 బంతుల్లో 14 పరుగుల్ని సాధించాడు.

ఈ మ్యాచ్‌లో సిల్హెట్‌ సిక్సర్స్‌ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. ఆ తర్వాత రంగపూర్‌ రైడర్స్‌ ఆరు వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసి లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమైంది.