IPL 2024 : పోరాడి ఓడిన గుజరాత్.. చెలరేగిన పంత్, అక్షర్ పటేల్.. 4 పరుగుల తేడాతో ఢిల్లీ విజయం

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో 4 పరుగుల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది. హాఫ్ సెంచరీని నమోదు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన రిషబ్ పంత్ (88/43)కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

IPL 2024 DC vs GT : ఐపీఎల్ 2024లో ఢిల్లీ క్యాపిటల్స్ అదరగొట్టింది. అరుణ్ జైట్లీ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో 4 పరుగుల తేడాతో ఢిల్లీ జట్టు విజయం సాధించింది. ఈ సీజన్‌లో ఢిల్లీ నాల్గో విజయాన్ని అందుకుంది. ఢిల్లీ నిర్దేశించిన 225 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో గుజరాత్ పోరాడి ఓడింది. నిర్ణీత 20 ఓవర్లలో గుజరాత్ 8 వికెట్ల నష్టానికి 220 పరుగులకే పరిమితమైంది.

Read Also : ‘అదేం వీరబాదుడు.. అవేం పరుగులు..’ ఐపీఎల్‌లో జరుగుతోన్న పరిణామాలపై వసీం అక్రమ్ నిబిడాశ్చర్యం

గుజరాత్ ఆటగాళ్లలో సాయి సుదర్శన్ (65; 39 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్), డేవిడ్ మిల్లర్ (55; 23 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్) హాఫ్ సెంచరీలతో రాణించారు. మిగతా ఆటగాళ్లలో వృద్ధీమాన్ షా (39), రషీద్ ఖాన్ (21 నాటౌట్), సాయి కిషోర్ (13) పరుగులకే పరిమితం కాగా, శుభ్ మన్ గిల్ (6), అజ్మతుల్లా ఒమర్జాయ్ (1), షారుఖ్ ఖాన్ (8), రాహుల్ తివాతియా (4) సింగిల్ డిజిట్ కే చేతులేత్తేశారు. ఢిల్లీ బౌలర్లలో రాసిఖ్ సలామ్ 3 వికెట్లు తీయగా, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు, అన్రిచ్ నోర్ట్జే, ముఖేష్ కుమార్, అక్షర్ పటేల్ తలో వికెట్ తీసుకున్నారు.

హాఫ్ సెంచరీలతో మెరిసిన పంత్, అక్షర్ పటేల్ :
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఓపెనర్ పృథ్వీ షా (11) పరుగులకే పెవిలియన్ చేరగా, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ (23) పరుగులకే చేతులేత్తేశాడు. అనంతరం బ్యాటింగ్ అందుకున్న అక్షర్ పటేల్ (66) అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకోగా.. బ్యాటింగ్ ఝళిపించిన రిషబ్ పంత్ (88) పరుగులతో హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. భారీ స్కోరుతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన పంత్ (88/43)కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

మిగతా ఆటగాళ్లలో ట్రిస్టన్ స్టబ్స్ (26 నాటౌట్), షాయ్ హోప్ (5) ఆశించిన స్థాయిలో ఆకట్టుకులేకపోయారు. ఫలితంగా ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 224 పరుగు చేసింది. దాంతో ప్రత్యర్థి జట్టు గుజరాత్‌కు 225 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ లక్ష్యాన్ని ఛేదించడంలో గుజరాత్ పోరాడి ఓటమిని చవిచూసింది. గుజరాత్ బౌలర్లలో సందీప్ వారియర్ 3 వికెట్లు తీయగా, నూర్ అహ్మద్ ఒక వికెట్ తీసుకున్నాడు.

టాప్ 6లో ఢిల్లీ క్యాపిటల్స్ :
పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆడిన 9 మ్యాచ్‌ల్లో 4 గెలిచి 5 ఓడి 8 పాయింట్లతో 6వ స్థానంలో కొనసాగుతోంది. గుజరాత్ టైటాన్స్ ఆడిన 9 మ్యాచ్‌ల్లో 4 గెలిచి 5 ఓడి 8 పాయింట్లతో 7వ స్థానంలో కొనసాగుతుంది.

Read Also : Sale of IPL Tickets : ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు.. స్టేడియాన్ని ముట్టడిస్తాం..!

ట్రెండింగ్ వార్తలు