‘అదేం వీరబాదుడు.. అవేం పరుగులు..’ ఐపీఎల్‌లో జరుగుతోన్న పరిణామాలపై వసీం అక్రమ్ నిబిడాశ్చర్యం

Wasim Akram: అంటే వన్డేల్లో 450-500 మధ్య స్కోరు బాదినట్లు లెక్క. పోనీ ఇది ఏదో ఒకసారి జరిగితే అంతగా ప్రభావం..

‘అదేం వీరబాదుడు.. అవేం పరుగులు..’ ఐపీఎల్‌లో జరుగుతోన్న పరిణామాలపై వసీం అక్రమ్ నిబిడాశ్చర్యం

@SunRisers

సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ తీరుపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఎవరూ ఊహించని విధంగా విధ్వంసకర బ్యాటింగ్‌తో రెచ్చిపోతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు సొంత గడ్డపై మరో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. గురువారం ఆర్సీబీ, ఎస్ఆర్‌హెచ్ మధ్య హైదరాబాద్‌లో మ్యాచ్ జరుగుతుంది.

ఇప్పటికే హైదరాబాద్ జట్టు ఢిల్లీతో జరిగిన మ్యాచులో 266/7 పరుగులు, ముంబైతో జరిగిన మ్యాచులో 277/3, హైదరాబాద్‌ వర్సెస్ బెంగళూరు మ్యాచులో 287/3 పరుగులు బాదింది. క్రికెట్ ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచింది. హైదరాబాద్ బ్యాటర్ల వీరబాదుడు ముందు ప్రత్యర్థి జట్ల బౌలర్లు అందరూ చిన్నబోతున్నారు. ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియంలో ఇటీవల ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్‌ చ‌రిత్ర‌లోనే అత్య‌ధిక ప‌వ‌ర్ ప్లే స్కోరును హైదరాబాద్ జట్టు న‌మోదు చేసింది. పవర్ ప్లేలో 125/0 స్కోరు రాబట్టింది.

ఈ పరిణామాలపై వసీం అక్రమ్ ఏమన్నాడు?
ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పుణ్యాన నమోదవుతున్న స్కోరుపై వసీం అక్రమ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… ‘‘థ్యాంక్ గాడ్.. నేను ఈ కాలంలో క్రికెట్ ఆడటం లేదు. ఎందుకంటే 20 ఓవర్లలో 270 పరుగులు బాదుతున్నారు.

అంటే వన్డేల్లో 450-500 మధ్య స్కోరు బాదినట్లు లెక్క. పోనీ ఇది ఒకసారి జరిగితే అంతగా ప్రభావం ఉండకపోయేది. మూడు-నాలుగు సార్లు ఇంత భారీగా పరుగులు బాదారు. 5 ఓవర్లలో 100 పరుగులు చేయడం అన్యాయమే.. ఫుల్ టాస్‌లు వేసినప్పటికీ అంతగా స్కోరు కొట్టడం అసాధ్యం.

ఐపీఎల్‌లో బౌలర్లు డబ్బులు తీసుకుని, ఆటతీరులో చివరకు నష్టపోతున్నారు’’ అని చెప్పాడు. బౌలర్లపై తాను జాలి పడుతున్నట్లు తెలిపాడు. ఐపీఎల్‌లో ఆర్సీబీ అత్యంత విధ్వంసకర జట్టు అని వసీం అన్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటికే 268 పరుగులు బాదిన హైదరాబాద్ జట్టు బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ తన ఫేవరెట్ క్రికెటర్లలో ఒకడని చెప్పాడు. గురువారం ఆర్సీబీతో హైదరాబాద్ జట్టు మరో మ్యాచ్ ఆడుతుండడంతో వసీం ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.

బెంగళూరు VS హైదరాబాద్.. ఉప్పల్ స్టేడియం రెడీ.. కోహ్లీ నినాదాలతో హోరెత్తించిన ఫ్యాన్స్