Bipul Sharma: రిటైర్మెంట్ ప్రకటించిన ఇండియన్ క్రికెటర్.. ఇకపై అమెరికా తరపున ఆడుతాడు

భారత్-దక్షిణాఫ్రికా(IND vs SA) మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతున్న సమయంలో భారత ఆటగాడు 38ఏళ్ల బిపుల్ శర్మ భారతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

Bipul Sharma Retirement: భారత్-దక్షిణాఫ్రికా(IND vs SA) మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతున్న సమయంలో భారత ఆటగాడు 38ఏళ్ల బిపుల్ శర్మ భారతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. భవిష్యత్తులో అమెరికా తరపున క్రికెట్ ఆడేందుకు రిటైర్మెంట్ ప్రకటించాడు బిపుల్ శర్మ. 2016లో ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టును ఛాంపియన్‌గా నిలబెట్టడంలో బిపుల్ శర్మ కీలక పాత్ర పోషించాడు.

బిపుల్ శర్మ కంటే ముందు భారత అండర్-19 జట్టుకు కెప్టెన్‌గా ఉన్న ఉన్ముక్త్ చంద్ కూడా భారత జట్టులో అవకాశం రాకపోవడంతో రిటైరయ్యాడు. ప్రస్తుతం అమెరికాలో క్రికెట్ ఆడుతూ సత్తా చాటుతున్నారు. బిపుల్ శర్మ ఫస్ట్ క్లాస్‌ క్రికెట్‌లో మొత్తం 59 మ్యాచ్‌లు ఆడాడు. మొత్తం 8సెంచరీలు, 17 అర్ధ సెంచరీలతో 3012 పరుగులు చేశాడు బిపుల్ శర్మ. అంతేకాదు 126 వికెట్లు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. లిస్ట్ A క్రికెట్‌లో బిపుల్ 96 మ్యాచ్‌లు ఆడి 1620 పరుగులతో 96 వికెట్లు పడగొట్టాడు.

ఐపీఎల్‌:
ఐపీఎల్‌లో బిపుల్ శర్మ ప్రదర్శన చాలా బాగా సాగింది. 2016 సీజన్‌లో, బిపుల్ హైదరాబాద్ జట్టు తరపున మూడు నాకౌట్ మ్యాచ్‌లలో ఆడే అవకాశాన్ని పొందాడు. అందులో KKRపై 11 బంతుల్లో 27 పరుగులు చేశాడు. బిపుల్ ఐపీఎల్ కెరీర్‌ను పరిశీలిస్తే 33 మ్యాచ్‌లు ఆడి 17 వికెట్లు పడగొట్టాడు. 152.03 స్ట్రైక్ రేట్‌తో 187 పరుగులు చేశాడు.

బిపుల్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (పంజాబ్ కింగ్స్) తరపున కూడా ఆడాడు. 2010లో జట్టులో చేరాడు. పంజాబ్‌తో నాలుగేళ్ల పాటు అనుబంధం ఉన్నా అక్కడ అతనికి పెద్దగా అవకాశాలు రాలేదు. పంజాబ్ తరఫున 15 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఆ తర్వాత బిపుల్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో చేరాడు.

భారత క్రికెట్‌లోకి..
పంజాబ్‌కు చెందిన బిపుల్ శర్మ.. పంజాబ్‌తో పాటు హిమాచల్ ప్రదేశ్, సిక్కిం తరఫున కూడా ఆడాడు. ఇప్పుడు USA నుంచి ఆడబోతూ ఉండగా.. భారత క్రికెట్‌కు తిరిగి రాలేనని స్పష్టం చేశాడు బిపుల్. బీసీసీఐ నిబంధనల ప్రకారం విదేశీ లీగ్‌లలో పాల్గొనేందుకు ఐపీఎల్, దేశవాళీ క్రికెట్ నుంచి తప్పుకున్నారు బిపుల్ శర్మ.

 

ట్రెండింగ్ వార్తలు