Former Skipper Raviteja : ఫస్ట్-క్లాస్ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన హైదరాబాద్ మాజీ కెప్టెన్ రవితేజ..!

Former Skipper Raviteja  : హైదరాబాద్ మాజీ కెప్టెన్ ద్వారక భమిడిపాటి రవితేజ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తన 16ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలికాడు.

Former Skipper Raviteja  : హైదరాబాద్ మాజీ కెప్టెన్ ద్వారక భమిడిపాటి రవితేజ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తన 16ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌కు 34ఏళ్ల హైదరాబాద్ క్రికెటర్ ముగింపు పలికాడు. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా రవితేజ తన నిర్ణయాన్ని ప్రకటించాడు. 16 ఏళ్ల ఫస్ట్‌ క్లాస్‌ కెరీర్‌లో హైదరాబాద్ డెక్కన్ ఛార్జర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ప్రాతినిధ్యం వహించాడు. 2006లో కరద్‌లోని మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ తరపున రంజీలో అరంగ్రేటం చేశాడు. ఈ మ్యాచ్‌లో ఏకైక ఇన్నింగ్స్‌లో 84 పరుగులు చేశాడు. ఈ నెల ప్రారంభంలో రాజ్‌కోట్‌లో గుజరాత్‌తో మేఘాలయ తరఫున తన చివరి మ్యాచ్ ఆడాడు. కుడిచేతి వాటం ఆటగాడు తన మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో 133 పరుగులతో (సెంచరీ పూర్తి) అత్యద్భుతంగా ఆడిన తర్వాత తన ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలికాడు. ఆంధ్ర జట్టుకు కూడా రవితేజ ప్రాతినిథ్యం వహించాడు.

భారత అండర్‌-19 జట్టుకు, భారత్‌-A జట్టుకు కూడా రవితేజ ఆడాడు. ఈ క్రమంలో భారత అండర్‌-19 జట్టుకు, భారత్‌-A జట్టుకు ఆడే అవకాశం కల్పించిన బీసీసీఐ (BCCI)కు రవితేజ ధన్యవాదాలు తెలిపాడు. రంజీ సీజన్ తర్వాత.. 2008 ఐపీఎల్‌ (IPL 2008) తొలి సీజన్‌లో హైదరాబాద్‌ డెక్కన్‌ ఛార్జర్స్‌ తరపున రవితేజ ప్రాతినిథ్యం వహించాడు. ఈ జట్టు రవితేజను ఓపెనర్‌గా ఎంపిక చేసింది. తన కెరీర్‌లో 78 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ల్లో రవితేజ 41.06 సగటుతో మొత్తం 4722 పరుగులు చేశాడు. అందులో 12 సెంచరీలు, 22 హాఫ్ సెంచరీలను తన పేరిట నమోదు చేశాడు. అత్యధిక స్కోరు 204 నాటౌట్‌గా నిలిచాడు. 85 లిస్ట్‌-A మ్యాచ్‌ల్లో 6 సెంచరీల సాయంతో 2942 పరుగులు సాధించాడు. 89 T20ల్లో సెంచరీతో సహా 1618 పరుగులు చేశాడు. లెగ్‌స్పిన్నర్‌గా జట్టుకు సేవలిందించాడు. భారత అండర్-19 జట్టులో రవితేజ.. అత్యధికంగా 60 సగటుతో 653 పరుగులు సాధించాడు.

తన ఫస్ట్ క్లాస్ రిటైర్మెంట్ ప్రకటనను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వెల్లడించాడు. ‘ఈ అద్భుతమైన క్రికెట్ గేమ్‌లో సుదీర్ఘమైన సంతృప్తికరమైన కెరీర్‌ని సాగించాను. ఆ తర్వాత నేను ఫస్ట్ క్లాస్ క్రికెట్ నుంచి రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నాను. ఇకపై నా కెరీర్‌ను క్రికెట్ కాకుండా మరో దిశలో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాను. నా కెరీర్‌లో హైలైట్‌గా నిలిచిన ఇండియా అండర్-19 ఇండియా A జట్లకు ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని కల్పించినందుకు బీసీసీఐకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇదే నా కెరీర్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇది నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. నేను ఎప్పుడూ గర్వపడే విషయం ఏదైనా ఉందంటే ఇదే..’ అని లేఖలో పేర్కొన్నాడు. డెక్కన్ ఛార్జర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ సహా అందరి సాయానికి నేను కృతజ్ఞుడను. IPL సీజన్ టోర్నీ నిజంగా చాలా సరదాగా, ఉల్లాసంగా, ఉత్కంఠభరితంగా ఉంటుంది. లెజెండ్స్ నుంచి నేను నేర్చుకోవడం చాలా అద్భుతంగా అనిపించిందని రవితేజ చివరిగా ముగించాడు.

Read Also : IPL 2022 : కోహ్లీ తర్వాత RCB కెప్టెన్ ఇతడే.. సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్‌‌ చేతికి కెప్టెన్సీ పగ్గాలు..! 

ట్రెండింగ్ వార్తలు