T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ గెలవగానే ట్రోఫీతో సూర్య, గంభీర్, జైషాలు ఎక్కడి వెళ్లారో చూశారా?
ముచ్చటగా మూడోసారి భారత జట్టు టీ20 ప్రపంచకప్ ను (T20 World Cup 2026) ముద్దాడింది.
- Thota Vamshi Kumar
- Updated on- March 9, 2026 / 09:14 AM IST
Gambhir Surya and Jay Shah Visit Hanuman Temple After T20 World Cup Win
- టీ20 ప్రపంచకప్ 2026 విజేతగా భారత్
- ఫైనల్‌లో న్యూజిలాండ్ పై ఘన విజయం
- ట్రోఫీతో సూర్య, గంభీర్, జై షాలు కలిసి హనుమాన్ టెంపుల్‌కి
T20 World Cup 2026 : ముచ్చటగా మూడోసారి భారత జట్టు టీ20 ప్రపంచకప్ ను ముద్దాడింది. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు న్యూజిలాండ్ పై గెలుపొందింది. టీ20 ప్రపంచకప్ 2026 విజేతగా టీమ్ఇండియా నిలవడంతో దేశ వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు.
టీ20 ప్రపంచకప్‌ను అందుకున్న తరువాత టీమ్ఇండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, ఐసీసీ ఛైర్మన్ జైషా లు కలిసి
అహ్మదాబాద్‌లోని ప్రముఖ హనుమాన్ ఆలయాన్ని సందర్శించారు. ట్రోఫీని హనుమంతుడి పాదాల ముందు ఉంచి ప్రత్యేక పూజలు చేయించారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చేతిలో ట్రోఫీ పట్టుకుని ఆలయంలోకి వెళ్లిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో సంజూ శాంసన్ (89), అభిషేక్ శర్మ (52), ఇషాన్ కిషన్ (54) లు హాఫ్ సెంచరీలు చేశారు. కివీస్ బౌలర్లలో జేమ్స్ నీషమ్ మూడు వికెట్లు తీయగా.. మాట్ హెన్రీ, రచిన్ రవీంద్రలు చెరో వికెట్ పడగొట్టారు. ఆ తరువాత 256 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ 19 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌటైంది.
దీంతో భారత్ 96 పరుగుల తేడాతో విజయం సాధించింది. కివీస్ బ్యాటర్లలో టిమ్ సీఫెర్ట్ (52), మిచెల్ సాంట్నర్ (43) రాణించారు. టీమ్ఇండియా బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లు పడగొట్టగా.. అక్షర్ పటేల్ మూడు వికెట్లు తీశాడు. హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి, అభిషేక్ శర్మలు తలా ఓ వికెట్ సాధించారు.
చరిత్ర సృష్టించిన భారత్..
టీ20 ప్రపంచకప్ 2026 విజయంతో భారత్ చరిత్ర సృష్టించింది. సౌతాఫ్రికాను ఓడించి టీ20 ప్రపంచకప్ 2024 విజేతగా నిలిచిన భారత్, ఇప్పుడు కివీస్‌ను ఓడించి టీ20 ప్రపంచకప్ 2026 విజేతగా నిలిచి వరుసగా రెండు సార్లు పొట్టి ప్రపంచకప్‌లను ముద్దాడిన జట్టుగా నిలిచింది.
అంతేకాదండోయ్ పొట్టి ప్రపంచకప్‌ను గెలుచుకున్న తొలి ఆతిథ్య దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. భారత్ కాకుండా మరే ఆతిథ్య దేశం కూడా టీ20 ప్రపంచకప్‌ను గెలవలేదు. ఇక భారత్‌కు ఇది మూడో టీ20 ప్రపంచకప్ ( 2007, 2024, 2026). ఈ నేపథ్యంలో అత్యధిక సార్లు టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టుగా భారత్ రికార్డులకు ఎక్కింది.
